కళ్ళు
- April 02, 2015
కళ్ళు ఎంత అందమైనవి
ఆకుచాటు పిందెల్లా
ముత్యపు చిప్పల్లోని
స్వాతి ముత్యాలవి
ప్రకృతి సోయగాలను
మనసుకు పరిచయం చేస్తాయవి!
తెలుపు నలుపుల జీవితానికి
ప్రపంచపు తీరుతెన్నులను
రంగురంగులలో చూపిస్తాయవి!
సుషుప్తిలో మలిగి ఉన్నా
కలల ప్రపంచంలోకి
మనల్ని విసిరేస్తాయి
కడలిలా గుండె ద్రవించినప్పుడు
అవి బొట్టు బొట్టుగా
జారవిడిచే
ఒక్కో కన్నీటిచుక్క
ఒక్కో కధకూ ఒక్కో వ్యధకూ
అవి ప్రతీక! నిశ్శబ్ద అక్షర రూపం!
ఆ కళ్ళల్లో ఎన్నెన్ని భావాలో
మరిన్ని ఆలోచనా వలయాలో
భాష లేదు వాటికి!
లిపి సమకూరదు వాటికి!
ఎవరికీ తోచిన భాష వాళ్ళు
చెప్పుకోవాలి ఏ నాటికి!
ఒక ఆర్తితో నిండిన చూపు
కరుణరసప్లావితం కాదూ!
ఒక పలకరింపు చూపు
సౌజన్యాన్ని కురిపించదూ!
ఎర్రనిరంగు
కంటి పొరల్లో జారాడినప్పుడు
అంతరంగం ఆవిష్కృతం కాదూ!
చిరు దరహాసం
కన్నులలో మెరిసినప్పుడు
ఏదో ఒక చిలిపి ఊహకు
అది వర్ణ చిత్రం కాదూ!
కళ్ళు రచించగలవు
కమనీయ కావ్యాలను
కళ్ళు సృజించగలవు
రసమధుర ఘట్టాలను
కళ్ళు పలికించగలవు
కమనీయ స్వరాలను
నాదాలను నినాదాలను
బిడ్డపై అనురక్తి
తల్లిపై భక్తి
భర్త యందు రక్తి
స్నేహితులతో చెలిమి
కంటి యవనికపై
హృదయంగా మనం చూడగలం!
కళ్ళు కావాలి మమతల లోగిళ్ళు
కళ్ళు కావాలి మానవత్వపు
కట్టడానికి అందమైన వాకిళ్ళు
కళ్ళు దేవుడు మనకిచ్చిన వరం!
విలువ తెలిసి వాడుకుందాం మనందరం!
డా|| మాదిరాజు రామలింగేశ్వర రావు
తాజా వార్తలు
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు







