రవికుమారునికి జన్మదిన శుభాకాంక్షలు

- June 05, 2016 , by Maagulf
రవికుమారునికి జన్మదిన శుభాకాంక్షలు

సందర్భం బర్త్‌డే భాస్కరభట్ల రవికుమార్‌... ట్రెండ్‌కి అనుగుణంగా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించేలా పాటలు రాయగల సమర్థుడు. పాట ఏదైనా సరే.. అందరి నోట పలకాలని చేసిన ప్రయత్నంలో విజయాన్ని సాధించి, పరిశ్రమలో ఓ ప్రత్యేక బ్రాండ్‌ సృష్టించుకున్న గీత రచయిత భాస్కరభట్ల పుట్టినరోజు నేడు (ఆదివారం). ఈ నేపథ్యంలో లిరిక్‌ రైటర్‌గా తన ప్రస్థానం గురించి భాస్కరభట్ల మాటల్లోనే.. చిన్నతనం నుండి గుంపులో గోవిందలా జీవించడం సుతారమూ ఇష్టముండేది కాదు. ఏదో ప్రత్యేకతను సంతరించుకుని చుట్టూ ఉన్న వాళ్ళ దృష్టి నాపై పడేలా రకరకాల జిమ్మిక్కులు చేస్తుండేవాణ్ణి. బ్లాక్‌ బోర్డ్‌పై కవితో, బొమ్మో.. ఇలా ఏదోఒకటి కెలుకుతూ సెలబ్రిటీ ఫోజిచ్చేవాణ్ణి.దుంపల బడి మొదలు డిగ్రీ వరకూ ఇదే తరహా నాది. మా స్కూలుకి పెద్ద ప్రహరీ గోడ, దాని చుట్టూతా సినిమా పోస్టర్లు అతికించి ఉండేవి. భుజానికి కరీం బీడీ సంచి తగిలించుకుని నెమ్మదిగా అడుగులేసుకుంటూ ఆ పోస్టర్లను చూస్తూ నడవటం ఎంతో ఇష్టంగా ఉండేది. పోస్టర్ల మీది యాక్టర్ల బొమ్మలకంటే అడుగున ఉండే సిరివెన్నెల, వేటూరి, భువనచంద్ర లాంటి పేర్లు నన్ను ఎక్కువగా ఆకర్షించేవి. ఆ పేర్ల దగ్గర నా పేరు కూడా ఉండాలంటే నేను కూడా పాటలు రాయాలనే ఆలోచన ఆ వయసులోనే వచ్చింది. డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ పూర్తి కాకుండానే హైదరాబాద్‌ వచ్చేసి 'సితార' సినీ వార పత్రికలో చేరడం అనుకోని మలుపు. ఆ తర్వాత సినీ రంగంలోకి ప్రవేశించినా డిగ్రీ పూర్తి చేయలేకపోయాననే వెలితి వెలితిగానే ఉండిపోయింది. 'సితార'లో సినిమా రిపోర్టర్‌గా ఉద్యోగం. ఆపై పెళ్ళి...పిల్లలు.. జీవితం గాడిలో పడింది. కానీ, లక్ష్యం మాత్రం గాడి తప్పింది. ఐదు..ఆరు.. ఏడేళ్ళు గడిచిపోయాయి. పాటలు రాయాలన్న కోరిక ఏమైపోయిందీ.. నా లక్ష్యమేంటి.. నా ప్రయాణం ఎటువైపు సాగుతోంది.. అని ఓసారి ఆత్మావలోకనం చేసుకున్నా. ఉద్యోగం మానేద్దామనుకున్నా. ప్రయత్నాలు మొదలు పెట్టా. చాలా మంది దర్శకులు చూద్దాం చేద్దాం అంటూ దాటేసేవారు. చివరికి ఈవీవీ సత్యనారాయణ 'చాలా బాగుంది'లో ఓ పాటకి అవకాశం ఇచ్చారు. ట్యూన్‌ ఇచ్చి రాయమన్నారు. తొలి పాట కదా అని చాలా జాగ్రత్తపడి రాశా. కానీ ఓకే కాలేదు. ఆ తర్వాత 'గొప్పింటల్లుడు' సినిమా కోసం ఓ పాట రాశాను. పాట ఓకే అయ్యింది. తొలిసారి తెరపై పేరు చూసుకుని మురిసిపోయా. కానీ, ఎక్కడో అసంతృప్తి. ఆ సినిమా బాగా ఆడలేదు. ఆపై వరుస ప్లాపులు. నాకు సక్సెస్‌ కావాలి. హిట్‌ సినిమాలకు రాశానన్న తృప్తి మిగలాలి. దాని కోసం పోరాటం కొనసాగించాను. చిన్నప్పుడు జోలపాట, కాలేజీలో సరదాపాట, రచయితగా బతుకు పాట.. ఇలా నా జీవితంలో ఎన్నో పాటలు, వాటి కోసం ఎన్నో పాట్లు ఉన్నాయి. ఆ పాట్ల ఫలితమే ప్రజంట్‌ పొజిషన్‌.ఓసారి ఉగాది సందర్భంగా భరణి గారి ఇంట్లో జరిగిన కవి సమ్మేళనంలో నేనొక కవిత వినిపించాను. భరణిగారికి అది బాగా నచ్చింది. ఆ పక్కనే కులశేఖర్‌, సంగీత దర్శకుడు చక్రి ఉన్నారు. వాళ్ళతో నాకు పరిచయం లేదు. చక్రి కళ్ళలో నీళ్లొచ్చాయి. నా దగ్గరకొచ్చి, 'నేను రాజమండ్రిలో పుట్టి, పెరిగి ఉండకపోవచ్చు. కానీ మీ కవిత హృదయాన్ని మీటింది. మిమ్మల్ని లిరిక్‌ రైటర్‌గా పరిచయం చేస్తా' అన్నారు. అప్పటికే కొన్ని సినిమాలకు రాశానని, అవి ప్లాప్‌ అయ్యానని చెప్పాను. అయినా ఆయన నన్ను దర్శకుడు పూరీ జగన్నాథ్‌కి పరిచయం చేశారు. వాళ్ళిద్దరి కాంబినేషన్‌లో నాకో అవకాశం ఇచ్చారు. అదే 'ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం'. అందులో 'రామ సక్కని బంగారు బొమ్మ' రాశాను. అది హిట్‌. ఆ తర్వాత ఇదే కాంబినేషన్‌లో ఎన్నో పాటలు రాశాను. అవన్ని హిట్లే. అంతే ఇక కెరీర్‌లో వెనుదిరిగి చూసుకోలేదు. 'ఇడియట్‌', 'అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి', 'జల్సా', 'పోకిరి', 'నచ్చావులే'...ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సూపర్‌డూపర్‌ హిట్‌ చిత్రాల్లో పాటలు రాశాను. ఇన్నేళ్ళ ప్రస్థానంలో దాదాపు వెయ్యి పాటలు రాయగలిగినందుకు చాలా ఆనందంగా ఉంది. సినిమాల్లో పాటలు రాస్తూ నాకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ఓసారి రాజమండ్రికి వెళ్ళాను. చిన్నప్పటి స్కూల్‌ ప్రహరీ గోడలపై 'నచ్చావులే' పోస్టర్లు. ఆ పోస్టర్‌లో రామోజీరావు, రవిబాబు, భాస్కరభట్ల పేర్లు కన్పించేసరికి కలిగిన ఆనందంగా అంతా ఇంతా కాదు. అది చూసినప్పుడు చిన్నప్పటి జ్ఞాపకాలు మదిలో మెదిలాయి. ఇలాంటిదే నా అభిమాన నటుడు నాగార్జున విషయంలోనూ జరిగింది. నాగార్జునగారి సినిమాకి పాట రాశాను. ఆడియో వేదికపైకి నన్ను పిలిచారు. స్టేజ్‌ మీద నేను, చేతిలో మైకు, ఎదురుగా నాగార్జున. ఆయన్ని చూడగానే కొన్ని జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. వాటిని చెప్పాలనిపించి ...నాగార్జునతో, 'చిన్నప్పుడు మిమ్మల్ని చూద్దామని షూటింగ్‌ స్పాట్‌కి వచ్చాను. సెక్యూరిటీవాళ్ళు తోసేశారు. బురదలో పడ్డాను. ఇంకోసారి అన్నపూర్ణ స్టూడియో గేటు బయట నిలబడ్డాను. గూర్ఖా పొమ్మన్నాడు. ఆరోజే అనుకున్నాను. ఎప్పటికైనా మీ సినిమాలకు పాటలు రాయాలని. అది నిజమైంది' అని ఆవేశంగా చెప్పాను. అది విని, 'సారీ.. భాస్కరభట్ల.. వాళ్ళకి నీ గురించి తెలిసుండదులే..' అని నవ్వుతూ అన్నారు. అవి నా జీవితంలో ఉద్వేగపూరిత క్షణాలు. నా అభిమాన హీరో కళ్ళముందే ఉండటం.. ఆయన సినిమాకి పాటలు రాయడం... ఇవన్నీ 'పాట' నాకిచ్చిన బహుమానాలు. జీవితంలో ప్రతీ దశలోనూ నేను 'పాట'సారినే. దాదాపు 15 ఏండ్ల సుదీర్ఘ సినీ గీత రచయిత ప్రస్థానం ఇంత బాగా సాగడానికి ముఖ్య కారణం శ్రోతలు. వారిచ్చిన ప్రోత్సాహమే నన్ను ఈ స్థాయికి వచ్చేలా చేసింది. ఈ ప్రయాణంలో ఎంతో మంది సంగీత దర్శకులు, దర్శకులు, నిర్మాతలు సహకరించారు. (పలు సందర్భాల్లో భాస్కరభట్ల మీడియాకి చెప్పిన విశేషాల ఆధారంగా..)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com