అహ్మదాబాద్ విమాన ప్రమాదం: మృతదేహాల గుర్తింపునకు డీఎన్‌ఏ పరీక్షలు!

- June 12, 2025 , by Maagulf
అహ్మదాబాద్ విమాన ప్రమాదం: మృతదేహాల గుర్తింపునకు డీఎన్‌ఏ పరీక్షలు!

అహ్మదాబాద్: అహ్మదాబాద్‌ లో చోటుచేసుకున్న ఘోర విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా విమానం వైద్య విద్యార్థుల హాస్టల్ పై కూలిపోయింది. ఈ ప్రమాదంలో 200మందికిపైగా మృత్యువాత పడగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదం అనంతరం మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో, వారి గుర్తింపుకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాలని గుజరాత్‌ ఆరోగ్యశాఖ కార్యదర్శి ధనంజయ్‌ ద్వివేది తెలిపారు. బి.జె. మెడికల్‌ కళాశాల ఆసుపత్రిలో ఈ పరీక్షలకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.

మృతుల కుటుంబసభ్యులు, ముఖ్యంగా తల్లిదండ్రులు లేదా పిల్లలు డీఎన్‌ఏ నమూనాలు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీని ద్వారా మరణించినవారిని త్వరగా గుర్తించే అవకాశం ఉంటుందని వివరించారు.

గాయపడిన 50 మందిని అహ్మదాబాద్‌ సివిల్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ, స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు ఇప్పటికే 25 మంది గాయపడిన వారి పేర్లను విడుదల చేశారు.

ప్రమాదం అనంతరం అహ్మదాబాద్‌ సివిల్‌ ఆసుపత్రిలో హృదయ విదారక దృశ్యాలు చోటుచేసుకున్నాయి. ఇటువంటి సామూహిక ప్రాణనష్టం తాము ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ప్రమాదం తర్వాత ఆస్పత్రిలో పరిస్థితి గందరగోళంగానూ, హృదయ విదారకంగానూ మారిందన్నారు.

తీవ్రమైన గాయాలతో బాధపడుతూ అనేక మంది బాధితులు విలపిస్తూ రోదించడమే కాక, కుటుంబ సభ్యులు ఆసుపత్రి వెలుపల గుమిగూడి ఆందోళన వ్యక్తం చేశారు. క్షతగాత్రులను ఒకరి తర్వాత ఒకరు అత్యవసర వార్డులకు తరలిస్తున్నారని, పరిస్థితి భయంకరంగా ఉందని, తీవ్ర గాయాల కారణంగా అనేక మంది రోదనలు, హాహా కారాలతో భయానక పరిస్థితి నెలకొందని చెప్పారు.

ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు.ఆయన వెంటనే అహ్మదాబాద్ కు వెళ్లి అక్కడ బి.జె. మెడికల్ కాలేజీ ఆసుపత్రిని సందర్శించి, చికిత్స పొందుతున్న గాయపడిన వారిని పరామర్శించారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా కేంద్రం మద్దతుగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. విమాన ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం అధికారం కలిగిన ఏజెన్సీలతో కూడిన సమగ్ర విచారణకు ఆదేశించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com