ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు

- November 10, 2025 , by Maagulf
ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్సుల జారీ విధానంలో కీలక మార్పులు చేపట్టింది. సరైన శిక్షణ లేకుండా లైసెన్స్ పొందడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని గుర్తించిన రవాణా శాఖ, ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ఆధారంగా సంస్కరణలు చేపడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 53 డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్లు, 5 ప్రాంతీయ డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ సెంటర్లలో శిక్షణ పూర్తిచేసిన వారికి ఇకపై ఆర్టీఏ కార్యాలయంలో డ్రైవింగ్ టెస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు.

శిక్షణ సర్టిఫికెట్ ఆధారంగా నేరుగా లైసెన్స్ జారీ అవుతుంది. రెండు చక్రాలు, నాలుగు చక్రాలు, భారీ వాహనాల డ్రైవింగ్‌కు సంబంధించిన ప్రాక్టికల్ శిక్షణ, రోడ్డు భద్రతా నియమాలు, సిమ్యులేటర్ ప్రాక్టీస్ వంటి అంశాలు ఇందులో భాగంగా ఉంటాయి.

ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న ఆర్‌డీటీసీల్లో లైసెన్స్ నేరుగా పొందే అవకాశం ఉంటుంది. ప్రతి డీటీసీ ఏర్పాటుకు కనీసం రెండు ఎకరాల భూమి అవసరమవుతుండగా, కేంద్ర ప్రభుత్వం మొత్తం వ్యయంలో 85 శాతం (గరిష్ఠంగా రూ.2.5 కోట్లు) ఆర్థిక సాయం అందిస్తుంది. ఆర్‌డీటీసీ కోసం మూడు ఎకరాల భూమి అవసరం కాగా, ఒక్కో కేంద్రానికి రూ.5 కోట్ల వరకు నిధులు మంజూరు చేస్తుంది.

ఆసక్తి గల వ్యక్తులు, సంస్థలు తమ జిల్లా కలెక్టర్లకు జనవరి చివరి వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఇప్పటికే కొన్ని జిల్లాల నుంచి దరఖాస్తులు అందగా, అనంతపురం జిల్లాలోని ఒక కేంద్రానికి ఆమోదం లభించింది. ఫిబ్రవరిలో కేంద్రానికి తుది ప్రతిపాదనలు పంపి, వచ్చే ఏడాదిలో ఈ కేంద్రాలను ప్రారంభించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com