గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్–2025 అవార్డు గ్రహీతల ప్రకటన

- January 23, 2026 , by Maagulf
గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్–2025 అవార్డు గ్రహీతల ప్రకటన

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గౌరవనీయులైన గవర్నర్ 2024లో తొలిసారిగా ప్రారంభించిన “గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్” కార్యక్రమం రెండో సంవత్సరానికి అడుగుపెట్టింది. మొదటి సంవత్సరంలో పర్యావరణ పరిరక్షణ, దివ్యాంగుల సంక్షేమం, క్రీడలు & ఆటలు, సంస్కృతి రంగాలలో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులు, సంస్థలకు 26 జనవరి 2025న అవార్డులు ప్రదానం చేశారు.

2025 సంవత్సరానికి గాను మహిళా సాధికారత, గిరిజన అభివృద్ధి, రూరల్ హెల్త్ & మెడికల్ ఫిలాంత్రపీ, కార్పొరేట్ వాలంటీరింగ్ అనే నాలుగు విభాగాల్లో సమాజానికి అంకితభావంతో సేవలందించిన వ్యక్తులు, సంస్థలను గుర్తించి వారికి గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ అందించాలని నిర్ణయించారు.

ఈ అవార్డుల కోసం 2025 నవంబర్‌లో సంబంధిత రంగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వ్యక్తులు, సంస్థల నుంచి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో నామినేషన్లు ఆహ్వానించారు. అందిన దరఖాస్తులను ప్రముఖులతో కూడిన అవార్డుల ఎంపిక కమిటీ క్షుణ్ణంగా పరిశీలించింది.

ఈ ఎంపిక కమిటీకి భారత ప్రభుత్వ మాజీ కేంద్ర హోంశాఖ కార్యదర్శి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ చైర్మన్ కె.పద్మనాభయ్య, ఐఏఎస్ (రిటైర్డ్) అధ్యక్షత వహించారు. కమిటీ సభ్యులుగా సి.ఆర్.బిశ్వాల్, ఐఏఎస్ (రిటైర్డ్), మాజీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి; డా.సునీతా కృష్ణన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ సామాజిక సేవకురాలు; డా.చిన్నబాబు సుంకవల్లి, ఆరోగ్య సంరక్షణ నిపుణుడు;రమేష్ కాజా, సెక్రటరీ జనరల్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సభ్యులుగా ఉన్నారు.

2025 సంవత్సరానికి ఎంపికైన అవార్డు గ్రహీతలు

వ్యక్తులు (Individuals):

  • మహిళా సాధికారత: రమాదేవి కన్నెగంటి, హైదరాబాద్
  • గిరిజన అభివృద్ధి: తోడసం కైలాస్, వాఘాపూర్, ఆదిలాబాద్ జిల్లా
  • రూరల్ హెల్త్ & మెడికల్ ఫిలాంత్రపీ: డా.ప్రద్యుత్ వాఘ్రే, హైదరాబాద్
  • కార్పొరేట్ వాలంటీరింగ్: వి.రాజన్న, హైదరాబాద్

సంస్థలు (Organizations):

  • మహిళా సాధికారత: శ్రీ సాయి సోషల్ ఎంపవర్‌మెంట్ సొసైటీ, ఘట్‌కేసర్
  • గిరిజన అభివృద్ధి: ఇండిజినస్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (IDO), గట్టుమల్ల (వి), భద్రాద్రి–కొత్తగూడెం జిల్లా
  • రూరల్ హెల్త్ & మెడికల్ ఫిలాంత్రపీ: రామదేవ్‌రావు హాస్పిటల్, హైదరాబాద్
  • కార్పొరేట్ వాలంటీరింగ్: గివ్ ఫర్ సొసైటీ, ఘట్‌కేసర్

ప్రతి అవార్డు గ్రహీతకు రూ. 2 లక్షల నగదు బహుమతితో పాటు వారి విశిష్ట సేవలను గుర్తించే ప్రశంసా పత్రం అందజేయనున్నారు.ఈ అవార్డులను గౌరవనీయులైన గవర్నర్ గారు 26 జనవరి 2026న సాయంత్రం 5:00 గంటలకు, హైదరాబాద్‌లోని లోక్ భవన్లో నిర్వహించనున్న ‘అట్ హోమ్’ కార్యక్రమంలో ప్రదానం చేయనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com