భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో

- January 23, 2026 , by Maagulf
భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో

తిరుమల: జనవరి 25వ తేదిన తిరుమలలో నిర్వహించబోయే రథ సప్తమి వేడుకలకు భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా ప్రణాళికబద్ధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి తెలియజేశారు. శుక్రవారం సాయంత్రం ఆయన టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, సీవీఎస్వో మురళీకృష్ణలతో కలిసి శ్రీవారి ఆలయ మాడ వీధుల్లో రథ సప్తమికి చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా మాడ వీధుల్లోని గ్యాలరీలు, అన్న ప్రసాదాల పంపిణీకి తీసుకుంటున్న చర్యలు పరిశీలించి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ రథ సప్తమి సందర్భంగా ఇప్పటికే తిరుమలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు. భక్తుల భద్రత, వివిధ విభాగాల సమన్వయం, ప్రవేశ, నిష్క్రమణ మార్గాల వద్ద అధికారుల తీసుకోవాల్సి చర్యలు వంటి అంశాలపై చర్చించి అధికారులకు సూచనలు చేయడం జరిగిందన్నారు. గ్యాలరీల్లో కూర్చునే భక్తులకు ఎండకు, వర్షానికి ఇబ్బంది పడకుండా పందిళ్లు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు.ఈ పరిశీలనలో టీటీడీ సీఈ సత్య నారాయణ, డిప్యూటీ ఈవోలు లోకనాథం, రాజేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com