లోక్ భవన్‌లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు

- January 23, 2026 , by Maagulf
లోక్ భవన్‌లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు

విజయవాడ: ‘ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్’ కార్యక్రమంలో భాగంగా మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకలు బుధవారం విజయవాడలోని లోక్ భవన్ దర్బార్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ, భారతదేశంలో ఈశాన్య ప్రాంతం ఎంతో కీలకమైన భాగమని, పర్యాటక పరంగా విశేష ప్రాధాన్యం కలిగిన ప్రాంతమని అన్నారు. మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాలు పర్వత శ్రేణులు, నీలి కొండలు, లోయలతో ప్రకృతి సౌందర్యంతో అలరారుతున్నాయని పేర్కొన్నారు. ఈ మూడు రాష్ట్రాలు అపూర్వమైన వృక్షజాలం, జంతుజాలం, అరుదైన స్థానిక జీవ వైవిధ్యం, సంపన్నమైన సాంస్కృతిక వారసత్వంతో ఆశీర్వదించబడ్డాయని తెలిపారు. సంప్రదాయం, ఆధునికత సమన్వయంతో కూడిన అద్భుత దృశ్యాలు, సజీవ పర్యావరణ వ్యవస్థలు ఈ రాష్ట్రాల ప్రత్యేకతగా పేర్కొన్నారు.

‘ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్’ కార్యక్రమం ద్వారా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రజల మధ్య పరస్పర అవగాహన, స్నేహభావం పెంపొందించడమే లక్ష్యమని, ‘ఒకే దేశం–ఒకే ప్రజలు’ అనే భావనను బలోపేతం చేయడానికే ఈ కార్యక్రమం దోహదపడుతుందని గవర్నర్ అన్నారు.

అంతకుముందు మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా, మేఘాలయ గవర్నర్  సీ.హెచ్. విజయ శంకర్, త్రిపుర గవర్నర్ ఎన్.ఇంద్రసేన రెడ్డి వీడియో సందేశాలు ప్రదర్శించారు. కార్యక్రమంలో ఐకాన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల సంప్రదాయ జానపద నృత్యాలు ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ఈ కార్యక్రమంలో గవర్నర్‌కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.అనంత రాము, సంయుక్త కార్యదర్శి పి.ఎస్.సూర్యప్రకాశ్, లోక్ భవన్ అధికారులు, సిబ్బంది, అలాగే విజయవాడ పరిసర ప్రాంతాల్లో వివిధ విద్యాసంస్థల్లో చదువుతున్న మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల విద్యార్థులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com