సినిమా రివ్యూ: ‘రాకాస’.!
- April 04, 2026
‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నిర్మాత మెగా డాటర్ నిహారిక కొణిదెల. అదే ప్రోత్సాహంతో ‘కమిటీ కుర్రోడు’ సంగీత్ శోభన్ని సోలో హీరోగా పరిచయం చేస్తూ నిర్మాతగా తన రెండో ప్రయత్నమే ఈ ‘రాకాస’. ఈ సినిమాని బాగా ప్రమోట్ చేశారు. యూజ్వల్లీ ఈ సినిమా ప్రచార చిత్రాలు చూస్తే హారర్ కామెడీ చిత్రంగా అనిపించడం ఖాయం. కానీ, ఇదో హారర్ ఫాంటసీ సినిమాగా చెబుతున్నారు. మరి, ఈ హారర్ ఫాంటసీ మూవీ ‘రాకాస’ ప్రేక్షకుల్ని ఎలా అలరించింది.? తన నిర్మాణంలో అభిరుచి గల సినిమాలకే ప్రత్యేకమైన స్కోప్ అంటోన్న నిహారిక కొణిదెల ఖాతాలో మరో హిట్ పడనుందా.? లేదా.? తెలియాలంటే ‘రాకాస’ సినిమా కథలోకి వెళ్లాల్సిందే.!
కథ:
ఫోనులో పరిచయానికి ప్రేమలో పడిపోయిన తన ప్రియురాలిని కలుసుకోవాలని ఎంతో ఆశతో ఏకంగా అమెరికా నుంచి ఊరికి తిరిగొస్తాడు వీరు అలియాస్ వీరబాబు (సంగీత్ శోభన్). తీరా ఊరికొచ్చేసరికి తన ప్రియురాలు పెళ్లి పీటలెక్కబోతోందని తెలుస్తుంది. ఆ పెళ్లిని ఎలాగైనా ఆపేయాలని తన చిన్ననాటి స్నేహితుడు బాలు(గెటప్ శీను)తో కలిసి ప్రయత్నాలు చేస్తుంటాడు వీరు. వీరికి సాయం చేస్తుంటుంది మరో చిన్ననాటి స్నేహితురాలైన సుబ్బలక్ష్మి (నయన్ సారిక). మరోవైపు ఆ ఊరికో ఆచారం వుంటుంది. ఊరికి చివరగా వున్న రాక్షస కోట అప్పుడప్పుడూ నరబలి కోరడం.. ఆ కోరికను ఊరి ప్రజలు తీర్చడం అందుకోసం మూడు సంకేతాల తర్వాత సదరు వ్యక్తిని ఆ కోటలోకి పంపించడం ఆనవాయితీగా వస్తుంటుంది. అలా చేయకపోతే ఊరు నాశనం అవుతుందని ఆ ఊరి ప్రజలు నమ్ముతుంటారు. అనుకోకుండా వీరు అతని స్నేహితులు ఆ కోటలోకి వెళ్లాల్సి వస్తుంది. మరి, ఆ కోటలోకి వెళ్లిన వీరు అతని స్నేహితులు ఎలాంటి అనుభవం ఎదుర్కొన్నారు.? ఆ కోటలోని బ్రహ్మ రాక్షసుడి ఫ్లాష్ బ్యాక్ ఏంటీ.? తాను కోరుకున్న అమ్మాయిని వీరు పెళ్లి చేసుకున్నాడా.? వీరు, సుబ్బలక్ష్మి కథేంటీ.? వీటన్నింటికీ సమాధానం తెలియాలంటే ‘రాకాస’ సినిమాని ధియేటర్లలో చూడాల్సిందే.!
నటీనటుల పనితీరు:
సంగీత్ శోభన్ తన డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకోవడం ఇప్పటికే పలు చిత్రాల్లో చూసేశాం. సెపరేట్ డిక్షన్ కామెడీతో తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు సంగీత్. అలాగే ఈ సినిమాలోనూ తనదైన కామెడీతో ఆకట్టుకున్నాడు. సంగీత్కి మంచి పాట్నర్ గెటప్ శీను కాంబినేషన్ కూడా బాగా సెట్టయ్యింది. వీరిద్దరి కాంబినేషన్లో కామెడీ సన్నివేశాలు బాగా వర్కవుట్ అయ్యాయ్. వీరిద్దరి కాంబోకీ వెన్నెల కిషోర్ సపోర్ట్ కామెడీ నెక్స్ట్ లెవల్‌కి వెళ్లేందుకు సహకరించింది. ఈ ముగ్గురి కాంబో తెరపై నవ్వులు పూయించాయ్. నయన్ సారిక ఈ సారి కూడా తనదైన నటనతో ఆకట్టుకుంటూ అందంగా కనిపించింది. ప్రాధాన్యత వున్న పాత్రలో నటించి మెప్పించింది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో ఆమె పర్ఫామెన్స్ అబ్బురపరుస్తుంది. బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి వంటి సీనియర్ నటులు వారి పాత్రల పభావం సినిమాపై బాగానే ఆకట్టుకుటుంది. మిగిలిన నటీ నటులు వారి వారి పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.
సాంకేతిక విభాగం పనితీరు:
చిన్న బడ్జెట్లో ఈ సినిమాని ఇంత చక్కగా తెరకెక్కించినందుకు నిజంగా సాంకేతిక వర్గాన్ని మెచ్చుకొని తీరాల్సిందే. కామెడీ హారర్ జోనర్ అనేకన్నా.. ఫాంటసీ కామెడీ అనడం సబబు ఈ సినిమాని. సాధారణంగానే ఈ తరహా సినిమాల కోసం ఓ కోట.. ఆ కోటలోనే నటీనటులందర్నీ ఇరికించి వారి మధ్య కామెడీ కథనం నడిపించేయడం కామన్. అయితే, ఆ కథనాన్ని ఎంత చాకచక్యంగా నడిపించావ్.. తన కథనంలోకి ప్రేక్షకుల్ని ఎలా తీసుకెళ్లి ఎంగేజ్ చేయగలిగావ్.? అన్నదే పాయింట్. ఆ పాయింట్లో లేడీ డైరెక్టర్ మానస శర్మ మంచి మార్కులేయించుకుంది. ఫస్టాఫ్ ఊరు, అమెరికా రిటర్న్ వీరూ, ప్రియురాలి పెళ్లి చెడగొట్టే పనిగా స్నేహితులతో కలిసి అతను చేసిన అల్లరి చిల్లరి వేషాలు ఒకింత నవ్వులు పూయిస్తాయ్. కానీ, రొటీన్ రొట్ట కొట్టుడు కామెడీనే తలపిస్తాయ్. సెకండాఫ్‌లో స్టోరీ మొత్తం కోటలోకి మారిపోతుంది. లిమిటెడ్ బడ్జెట్లో వేసిన ఆ కోట సెట్టింగూ.. ఆ ఫాంటసీ ప్రపంచంలోకి ప్రేక్షకుడ్ని ఎత్తుకెళ్లే తీరు ఆకట్టుకుంటుంది. చక్కటి చందమామ కథల్లా ఆ కోటకు సంబంధించిన రహస్యాలు, అందులోని రాక్షసుడి చరిత్ర ఒక్కొక్కటిగా రివీల్ చేసే విధానం ఓ సగటు ప్రేక్షకుడ్ని అలరిస్తుంది. పిల్లలనయితే బాగా ఎట్రాక్ట్ చేస్తుంది. సన్నివేశానికి తగ్గట్లుగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. మ్యూజిక్ జస్ట్ ఓకే. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయ్.
ప్లస్ పాయింట్స్:
సంగీత్ శోభన్, కామడీ సన్నివేశాలు, సెకండాఫ్‌లోని ఫాంటసీ సీన్లు, రాజకోట, క్లైమాక్స్ సన్నివేశాలు..
మైనస్ పాయింట్స్:
ఫస్టాఫ్ రొట్ట కొట్టుడు కామెడీ, కథ మొదలైనవి..
చివరిగా:
‘రాకాస’.. వేసవి సెలవుల్లో పిల్లలు మెచ్చే ఓ ట్రెండీ ఫాంటసీ అండ్ కూల్ చందమామ కథ. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళితే, సెకండాఫ్ చూసి ఫస్టాఫ్ మర్చిపోయి ఫాంటసీ వరల్డ్ నుంచి ఫుల్ శాటిస్ఫేక్షన్తో ఇంటికి తిరిగొచ్చేయొచ్చంతే.!
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్‌లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్‌లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









