ఘనంగా డైరెక్టర్స్ డే ....

- May 05, 2026 , by Maagulf
ఘనంగా డైరెక్టర్స్ డే ....

హైదరాబాద్: దర్శకరత్న దాసరి నారాయణరావు పుట్టిన రోజు (మే 4)ని డైరెక్టర్స్ డేగా తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFDA) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.  కలయిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సోమవారం నాడు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి భారత చలన చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులెంతో మంది హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో పలు భాషలకు చెందిన ప్రముఖ దర్శకులెందరినో సత్కరించారు. 

ఈ కార్యక్రమంలో.మోహన్ బాబు మాట్లాడుతూ .. ‘తండ్రి లాంటి దాసరి లేరనే లోటు నాకు ఈ జీవితాంతం ఉంటుంది. ఓ సాధారణ వ్యక్తిని తీసుకు వచ్చి మోహన్ బాబుగా మార్చారు. హిందీ చిత్ర దర్శకుడు బాల్కి కి ఈ అవార్డుని ఇవ్వడం ఆనందంగా ఉంది. దర్శకుడు అనే పదానికి అర్థం చెప్పిన ఏకైక వ్యక్తి దాసరి. తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని దర్శకులంతా కలిసి ఇలాంటి ఈవెంట్ నిర్వహిస్తుండటం ఆనందంగా ఉంది. ఈ స్టేజ్ మీదున్న వారంతా గొప్ప దర్శకులే. ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఆదిత్య బృందంకు హ్యాట్సాఫ్. ఈ కార్యక్రమాలు అవార్డుల్ని ఎంచుకున్న, ఇచ్చిన తీరు అద్భుతంగా ఉంది. మా యూనివర్సిటీలో అక్కయ్య పేరు మీద గోల్డ్ మెడల్స్ ఇస్తుంటాను. దాసరి గారి పేరు మీద ఆడిటోరియంను కట్టాం. తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFDA)కి పదిహేను లక్షలు ఆర్థిక విరాళాన్ని అందిస్తాను. చిత్ర సీమ ఉన్నంత వరకు దాసరి పేరు చిరస్థాయిగా నిలబడుతుంది’ అని అన్నారు.

తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ.. ‘దాసరి మన అందరినీ అనాథల్ని చేసి వెళ్లిపోయారు. కె. విశ్వనాథ్ సలహాతో మే 4న దాసరి పుట్టిన రోజుని డైరెక్టర్స్ డే గా నిర్వహిస్తున్నాం. ఓ డైరెక్టర్ 150కి పైగా చిత్రాలకు దర్శకత్వం, 250కి పైగా చిత్రాలకు మాటలు రాయడం, ఐదారు వందల పాటలు రాయడం మామూలు విషయం కాదు. 50 చిత్రాలపైకు పైగా నిర్మించారు, ఎన్నో గొప్ప పాత్రల్ని పోషించారు, ‘ఉదయం’ పేపర్‌ను కూడా ప్రారంభించారు. ఆయన మేధస్సు చాలా గొప్పది. ఇన్ని  పనుల మధ్య సేవా కార్యక్రమాలు, కార్మికుల సమస్యల్ని తీర్చేవారు. ఆయన అంతటి గొప్పవారు కాబట్టే ఆయన బర్త్ డేకి ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు’ అని అన్నారు.

జయప్రద మాట్లాడుతూ .. ‘గురువు దాసరి పుట్టిన రోజుని ఇలా సెలెబ్రేట్ చేయడం, ఇలాంటి కార్యక్రమానికి మమ్మల్ని పిలవడం ఆనందంగా ఉంది. దాసరి మాకు నటనలో అక్షరాభ్యాసం చేయించారు. ఆయన ఎప్పుడూ మన గుండెల్లోనే ఉంటారు. జయసుధ, నేను దాసరి తో ఎన్నో చిత్రాల్ని చేశాం. మేం ఇద్దరం అక్కాచెల్లెళ్లుగా ఎన్నో చిత్రాల్లో నటించాం. ఆర్. నారాయణమూర్తి ఎప్పుడూ ప్రజా సమస్యలపై గొప్ప చిత్రాల్ని రూపొందించారు. నాకు గురువు, తండ్రి లాంటి వారు కె. విశ్వనాథ్. ఎన్నో గొప్ప పాత్రల్ని ఇచ్చి నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన గురువు దాసరి కి ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఆయనతో పని చేయడం ఎంతో అదృష్టంగా, గర్వకారణంగా భావిస్తున్నాను’ అని అన్నారు.

జయసుధ మాట్లాడుతూ .. ‘గురువు దాసరి వల్లే నేను ఈ రోజు ఇలా నిలబడగలిగాను. ఆయన లేని లోటు ఇప్పటికీ, ఎప్పటికీ గుర్తుకు వస్తూనే ఉంటుంది. నా సినీ ప్రయాణంలో ఆయనది చెరగని ముద్ర. అన్ని అవార్డులకంటే ఈ అవార్డు చాలా గొప్పది. ఎంతో మంది గొప్ప దర్శకులు చిత్ర సీమలోకి వస్తున్నారు. మున్ముందు నిర్వహించే ఈ క్రియేటర్స్ ఫీస్ట్‌లో అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

వీర శంకర్ మాట్లాడుతూ.. ‘ప్రపంచంలో ఏ చిత్ర పరిశ్రమ కూడా ఇలాంటి ఓ రోజుని నిర్వహించుకోదు. దాసరి పుట్టిన రోజున డైరెక్టర్స్ డే చేయాలని ప్రపోజల్ ఇచ్చిన మహనీయులు కళాతపస్వీ కె. విశ్వనాథ్, ఎన్. శంకర్  ఎన్నికైన వెంటనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంత గొప్పగా ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తున్న టీంకు ప్రత్యేక అభినందనలు’ అని అన్నారు.

ఎన్ శంకర్ మాట్లాడుతూ .. ‘సినీ ప్రపంచంలో దాసరి గారి లాంటి వారు మళ్లీ పుట్టరు. ఆయన పుట్టిన రోజుని ఇలా సెలెబ్రేట్ చేసుకోవడం మా అందరికీ గర్వకారణంగా ఉంది. ఈ కార్యక్రమం ఎప్పటికీ ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ.. ‘సర్వేపల్లి పుట్టిన రోజున ఉపాధ్యాయ దినోత్సవంగా చేసుకుంటున్నాం. అలానే దాసరి  పుట్టిన రోజుని డైరెక్టర్స్ డేని సెలెబ్రేట్ చేసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది.ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహిస్తున్న ప్రతీ ఒక్కరికీ నా నమస్కారాలు. మా గురువు దాసరి నాకు అన్నం పెట్టి హీరోని చేశారు. ఇప్పుడు హీరోలు, దర్శకులు ఎక్కువ సినిమాలు చేస్తూ ఉంటేనే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది’ అని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com