ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..వారానికి ఒక రోజు ‘నో వెహికిల్ డే’!

- May 14, 2026 , by Maagulf
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..వారానికి ఒక రోజు ‘నో వెహికిల్ డే’!

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో గురువారం జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం రాష్ట్ర అభివృద్ధి, ఆర్థిక క్రమశిక్షణే లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సుమారు 4 గంటల పాటు సాగిన ఈ భేటీలో ఇంధన పొదుపు నుంచి భారీ పెట్టుబడుల వరకు పలు కీలక అంశాలకు ఆమోదముద్ర పడింది.

ఆర్థిక పొదుపు–‘నో వెహికిల్ డే’
రాష్ట్రంలో ఆర్థిక నియంత్రణ, ఇంధన పొదుపును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. వారానికి ఒక రోజు రాష్ట్రవ్యాప్తంగా ‘నో వెహికిల్ డే’ అమలు చేయనున్నారు. మంత్రులు, వీవీఐపీలు తమ అధికారిక వాహనాలను పక్కనపెట్టి బస్సులు/మెట్రో వాడాలి. వీలుకాకపోతే ఎలక్ట్రిక్ వాహనాలు లేదా సైకిళ్లను వినియోగించాలని సీఎం ఆదేశించారు. స్వయంగా ముఖ్యమంత్రి తన కాన్వాయ్‌లోని వాహనాలను 50 శాతం తగ్గించుకుని ఆదర్శంగా నిలిచారు. ప్రస్తుతానికి మంత్రుల విదేశీ పర్యటనలను రద్దు చేయాలని నిర్ణయించారు. సాధ్యమైన శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ఇచ్చే అంశంపై కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉంది.

విశాఖకు రిలయన్స్ ఏఐ డేటా సెంటర్
పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా విశాఖపట్నం వేదికగా భారీ ప్రాజెక్టుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖలో రిలయన్స్ సంస్థ భారీ AI డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. దీని కోసం 854 ఎకరాల భూమిని కేటాయించారు. ఇది దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌గా నిలవనుంది. శ్రీ సత్యసాయి జిల్లాలో బ్యాటరీ స్టోరేజ్ సదుపాయంతో కూడిన రిలయన్స్ మెగా సోలార్ ప్రాజెక్టుకు ఆమోదం లభించింది.

భారీ పరిశ్రమలు–పెట్టుబడులు
రాష్ట్రవ్యాప్తంగా మరికొన్ని కీలక పరిశ్రమల ఏర్పాటుకు కేబినెట్ అనుమతులు మంజూరు చేసింది. తిరుపతి జిల్లా సత్యవేడు ప్రాంతంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ తయారీ ప్లాంట్. చిత్తూరులో అపోలో టైర్స్ యూనిట్ విస్తరణ. కర్నూలు జిల్లా ఓర్వకల్ విమానాశ్రయ నిర్వహణను పీపీపీ విధానంలో చేపట్టేందుకు నిర్ణయం. నెల్లూరులో భారీ ఎంజైమ్ తయారీ కేంద్రం, ఓర్వకల్‌లో సోలార్ సెల్ తయారీ యూనిట్‌కు గ్రీన్ సిగ్నల్.

పొదుపు చర్యల పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ‘నాదేశం–నా బాధ్యత’ పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని కేబినెట్ తీర్మానించింది. జిల్లా పర్యటనల్లో కూడా ప్రజాప్రతినిధులు ఆడంబరాలకు పోకుండా పొదుపు పాటించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com