ఇంధన పొదుపు, విదేశీ మారకద్రవ్యం ఆదాకు ప్రజలు సహకరించాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

- May 14, 2026 , by Maagulf
ఇంధన పొదుపు, విదేశీ మారకద్రవ్యం ఆదాకు ప్రజలు సహకరించాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

హైదరాబాద్: అమెరికా–ఇరాన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్న వేళ, ఇంధన వినియోగాన్ని తగ్గించి విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

గురువారం లోక్ భవన్ విడుదల చేసిన వీడియో సందేశంలో గవర్నర్ మాట్లాడుతూ, దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రధాని మోదీ ప్రజలకు ఇచ్చిన సూచనలను తానే ముందుగా ఆచరణలో పెట్టారని పేర్కొన్నారు. భద్రతా కారణాలు ఉన్నప్పటికీ ప్రధాని తన కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను తగ్గించారని గుర్తుచేశారు.

తాను తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే వాహనాల వినియోగాన్ని తగ్గించానని, ఇప్పుడు ప్రధాని పిలుపు మేరకు మరింతగా తగ్గించి 50 శాతం వరకు పరిమితం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ శాఖల్లో కూడా వాహనాల వినియోగాన్ని తగ్గించేలా ముఖ్యమంత్రి, మంత్రివర్గ సభ్యులు, ఉన్నతాధికారులకు సూచనలు ఇవ్వాలని కోరనున్నట్లు వెల్లడించారు.

రాజకీయ నాయకులు కూడా అవసరానికి మించిన భారీ కాన్వాయ్‌ల వినియోగాన్ని తగ్గించాలని గవర్నర్ సూచించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి, రక్షణ మంత్రిలా ప్రజాప్రతినిధులు కూడా ఆదర్శంగా నిలిస్తే ప్రజల్లో అవగాహన పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.

డాలర్, పెట్రో డాలర్ల వినియోగాన్ని తగ్గించడం ద్వారా విదేశీ మారకద్రవ్యాన్ని దేశంలోనే నిల్వ ఉంచవచ్చని, దేశ కరెన్సీ విలువను కాపాడటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని గవర్నర్ పిలుపునిచ్చారు.

“నషా ముక్త తెలంగాణ” కోసం ప్రత్యేక ఉద్యమం అవసరం

మాదకద్రవ్యాల నిర్మూలనపై కూడా గవర్నర్ ప్రత్యేకంగా స్పందించారు. హిమాచల్ ప్రదేశ్‌లో తాను చేపట్టిన డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమం గ్రామస్థాయికి చేరుకుని విజయవంతమైందని పేర్కొన్నారు. అదే తరహాలో తెలంగాణలో కూడా “నషా ముక్త తెలంగాణ” కార్యక్రమాన్ని చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.

పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల అడ్మిషన్ ఫారమ్‌లలోనే ‘మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటాం, ఇతరులను కూడా దూరంగా ఉంచుతాం’ అనే ప్రతిజ్ఞ చేర్చాలని సూచించారు. యువత ద్వారా సమాజంలో చైతన్యం తీసుకురావచ్చని చెప్పారు.

డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమంలో మీడియా కీలక పాత్ర పోషించాలని కోరిన గవర్నర్, హిమాచల్‌లో మీడియా సహకారంతో ఉద్యమం విజయవంతమైందని, తెలంగాణలో కూడా మీడియా చురుకుగా ముందుకు వస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com