దేశంలో జీవనశైలి వ్యాధులు పెరుగుతున్న ఆందోళనకర పరిస్థితి: గవర్నర్ అబ్దుల్ నజీర్
- June 07, 2026
విశాఖపట్నం: దేశంలో అంటురాని వ్యాధులు (NCDs) మరియు జీవనశైలి సంబంధిత వ్యాధులు మరణాలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖపట్నంలోని ఎన్‌ఆర్‌ఐ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 6వ స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, శారీరక శ్రమలేని జీవనశైలి, అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి, ప్రాసెస్డ్ మరియు అల్ట్రా ప్రాసెస్డ్ ఆహార పదార్థాల వినియోగం, చక్కెర అధికంగా ఉండే పానీయాల తీసుకోవడం వంటి కారణాలు జీవనశైలి వ్యాధుల పెరుగుదలకు దారితీస్తున్నాయని తెలిపారు.
భారత్‌లో అంటురాని వ్యాధులు సాధారణంగా 45 ఏళ్ల వయస్సు నుంచే ప్రారంభమవుతున్నాయని, ఇది అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే దాదాపు పదేళ్లు ముందుగానే జరుగుతోందని గవర్నర్ పేర్కొన్నారు.
వైద్య విద్య గ్రాడ్యుయేషన్‌తో ముగిసిపోదని, అది వైద్యుల వృత్తి జీవితానికి ఆరంభం మాత్రమేనని ఆయన అన్నారు. వైద్య రంగంలో వేగంగా మారుతున్న పరిజ్ఞానం, నూతన వైద్య విధానాలకు అనుగుణంగా వైద్య నిపుణులు నిరంతర అధ్యయనం, వృత్తిపరమైన అభివృద్ధిని కొనసాగించాలని సూచించారు.
ఆధునిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు వైద్య విద్య వెన్నెముకలాంటిదని, సమర్థవంతమైన, మానవతా దృక్పథంతో కూడిన సేవలు అందించేందుకు అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలు, విలువలను వైద్య విద్య అందిస్తుందని గవర్నర్ చెప్పారు.
ఆరోగ్య మౌలిక సదుపాయాలు సమాజ ఆరోగ్యం, సంక్షేమాన్ని ప్రభావితం చేసే కీలక అంశమని పేర్కొన్న ఆయన, దేశంలో మూడు స్థాయిల ఆరోగ్య వ్యవస్థ ఉన్నప్పటికీ అనేక గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో లేవని అన్నారు. ఈ లోటును భర్తీ చేయడంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నేషనల్ డిజిటల్ హెల్త్ కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అనిల్ నీరుకొండ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్‌పర్సన్ పి.సుధా రెడ్డి, సీఈవో డాక్టర్ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి, ఎన్‌ఆర్‌ఐ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎ. భాగ్యలక్ష్మి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!
- జీ20 ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ దేశాల్లో సౌదీకి చోటు..!!
- బహ్రెయిన్ లో విదేశీ వైద్యుల ఆపరేషన్లపై కఠిన నిబంధనలు..!!
- చక్కెర పానీయాల ఎక్సైజ్ పన్నుపై టాక్స్ అథారిటీ క్లారిటీ..!!
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!







