మంత్రి లోకేష్‌ను ముట్టడించిన స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు!

- June 09, 2026 , by Maagulf
మంత్రి లోకేష్‌ను ముట్టడించిన స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు!

విశాఖపట్నం: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (SMS-1) ఘోర ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, కేంద్రమంత్రి శ్రీనివాసవర్మలకు ఊహించని అనుభవం ఎదురైంది. విశాఖ కేజీహెచ్ (KGH) ఆసుపత్రి వేదికగా బాధితులను పరామర్శిస్తున్న తరుణంలో.. అక్కడకు చేరుకున్న స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలు మంత్రి లోకేష్ ఎదుట భారీ ఆందోళనకు దిగారు. యాజమాన్యం నిర్లక్ష్యంపై నిలదీస్తూ గట్టిగా నినాదాలు చేయడంతో అక్కడ కాసేపు తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

కార్మిక సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే

స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మరియు ప్రైవేట్ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్లే 9 మంది కార్మికులు సజీవ దహనమయ్యారంటూ కార్మిక సంఘాల నేతలు మంత్రుల వద్ద గర్జించారు. ప్లాంట్ యాజమాన్యం ప్రకటించిన రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఏమాత్రం సరిపోదని.. చనిపోయిన ప్రతి కార్మికుడి కుటుంబానికి రూ. 1 కోటి చొప్పున భారీ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. గతంలో హెచ్చరించినా భద్రతా చర్యలు తీసుకోని విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీ (CMD) ని తక్షణమే విధుల నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.

కార్మిక నేతలపై మంత్రి లోకేష్ అసహనం

బాధిత కుటుంబాలను ఓదారుస్తున్న సమయంలో కార్మిక సంఘాల నేతలు గట్టిగా అరుస్తూ ఆందోళన చేయడంతో మంత్రి నారా లోకేష్ తీవ్ర అసహనానికి గురయ్యారు. “ఎందుకు అలా అరుస్తున్నారు? నేను ఇక్కడ చనిపోయిన వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నాను. మీ కుటుంబంలో ఎవరూ చనిపోలేదు కదా! దయచేసి గొడవ ఆపండి” అంటూ కార్మిక నేతలపై మండిపడ్డారు. దీంతో అక్కడ కాసేపు ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం నడిచింది.

బాధిత కుటుంబాలకు భరోసా – ప్రభుత్వ హామీలు

ఉద్రిక్తతల నడుమే కేజీహెచ్‌ బెడ్లపై చికిత్స పొందుతున్న క్షతగాత్రులను, మృతుల బంధువులను లోకేష్, కేంద్రమంత్రి శ్రీనివాసవర్మలు పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకుని వారిని ఓదార్చారు. “మేము రాజకీయాలు చేయడానికి ఇక్కడికి రాలేదు. ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన కుటుంబాలకు అండగా నిలబడేందుకు వచ్చాం. కూటమి ప్రభుత్వం ఈ బాధిత కుటుంబాలకు జీవితాంతం తోడుగా ఉంటుంది” అని లోకేష్ హామీ ఇచ్చారు. గతంలో అందరం కలిసి పోరాడటం వల్లే స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోగలిగామని గుర్తుచేసిన లోకేష్.. ఈ ఘోర ప్రమాదంపై ఉన్నత స్థాయి కమిటీని వేస్తున్నామని, కమిటీ నివేదిక (Inquiry Report) వచ్చిన వెంటనే బాధ్యులైన ఎంతటి వారిపైనైనా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com