వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- June 17, 2026
హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వర్షాకాలంలో నీటి నిల్వలు, పట్టణ వరదలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు చేపడుతున్న చర్యలపై మంగళవారం మల్కం చెరువు వద్ద అత్యవసర సమన్వయ సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశం, క్షేత్రస్థాయి పర్యటనలో రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ , జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన, హైడ్రా కమిషనర్ శ్రీ రంగనాథ్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి, ఇరిగేషన్, హైడ్రా, జీహెచ్ఎంసీ, పోలీస్ శాఖల ఉన్నతాధికారులు, ఇంజనీర్లు మరియు ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డీజీపీ సి.వి.ఆనంద్ మాట్లాడుతూ, వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా పోలీసు శాఖ అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోందన్నారు. నీరు నిల్వ ఉండే ప్రాంతాలను ముందుగానే గుర్తించి, ట్రాఫిక్ అంతరాయాలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసి, ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేయాలని సూచించారు.
నగరంలోని లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ఉన్న ప్రాంతాలు, ప్రధాన కూడళ్లు, రద్దీ మార్గాల్లో పోలీసు సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని డీజీపీ ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా వెంటనే స్పందించేలా పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.
సమావేశంలో అనంతరం మల్కం చెరువు, ఖాజాగూడ సరస్సు, మండికుంట, గురునాథ్ చెరువు, మియాపూర్ పరిసర ప్రాంతాల్లోని చెరువులు, బయోడైవర్సిటీ జంక్షన్ పరిసర ప్రాంతాలు, కొండాపూర్ మరియు ఇతర వరద ప్రభావిత ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ప్రత్యేక ఇంజనీరింగ్ బృందాలను ఏర్పాటు చేశారు.ఈ బృందాలు క్షేత్రస్థాయి పర్యటన చేశాయి. నీటి ప్రవాహ మార్గాలు, ఆక్రమణలు, డ్రైనేజీ అనుసంధానాలు, నీటి నిల్వలకు కారణమవుతున్న అంశాలను సమగ్రంగా పరిశీలించారు.
అదేవిధంగా, తక్షణ చర్యలు అవసరమైన అంశాలను గుర్తించి వెంటనే పరిష్కరించడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా దీర్ఘకాలిక, శాశ్వత పరిష్కారాలపై నివేదికలను సమర్పించనున్నట్లు అధికారులు వివరించారు.
పోలీస్, ఇరిగేషన్, జీహెచ్ఎంసీ, హైడ్రా మరియు ఇతర శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని డీజీపీ సి.వి. ఆనంద్ పేర్కొన్నారు. అన్ని శాఖలు సమిష్టిగా పనిచేసి సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
ఎక్కడా అలసత్వం లేదా నిర్లక్ష్యానికి తావు ఇవ్వకుండా ప్రజల భద్రతను ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలని అధికారులకు స్పష్టం చేశారు. వర్షాకాలం పూర్తయ్యే వరకు రాష్ట్రవ్యాప్తంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించడంలో ఎటువంటి లోటు ఉండకూడదని డీజీపీ ఆదేశించారు.
నీటి నిల్వలు, పట్టణ వరదలు, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజల భద్రత, సౌకర్యాలను పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నాయని పునరుద్ఘాటించారు.
తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్‌లో టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు









