అమెరికాలో 11 ఏళ్ల తెలుగు బాలిక అద్భుత ఘనత..

- June 18, 2026 , by Maagulf
అమెరికాలో 11 ఏళ్ల తెలుగు బాలిక అద్భుత ఘనత..

ప్రతిష్టాత్మక పోటీలో విజేతగా నిలిచిన నిత్య తమ్మన!

ఫ్లింట్, మిచిగాన్: చిన్న వయసులోనే పెద్ద ఆలోచనతో అడుగులు వేస్తే అద్భుతాలు సృష్టించవచ్చని 11 ఏళ్ల మన తెలుగమ్మాయి నిత్య తమ్మన నిరూపించింది. అమెరికాలోనే ఎంతో గుర్తింపు ఉన్నయువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల పోటీ 'మోట్ మిలియన్ డాలర్ ఛాలెంజ్' లో జాతీయ విజేతగా నిలిచి నిత్య సరికొత్త చరిత్ర సృష్టించింది. అమెరికాలోని ఐదవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి విద్యార్ధులు దేశంలోని మొత్తం 50 రాష్ట్రాల నుండి ఈ పోటీలో పాల్గొన్నారు. ఐదు వేల మూడు వందల మందికి పైగా పోటీదారులతో తలపడి, పలు రౌండ్ల కఠినమైన వడపోత తర్వాత మిచిగాన్ లో జరిగిన చివరి రౌండ్ ముఖాముఖి పోటీల్లో నిత్య అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ పోటీల ద్వారా ఆమె మొత్తం 40250 డాలర్లు (సుమారు ముప్పై మూడు లక్షల రూపాయలకు పైగా) బహుమతి మొత్తాన్ని సొంతం చేసుకుంది.  
ప్రపంచవ్యాప్తంగా వస్తున్న నీటి ఎద్దడి సమస్యకు పరిష్కారం చూపేందుకు నిత్య 'సేవ్ డ్రాప్' అనే పేరుతో పిల్లలందరినీ చేర్చుకుని ఒక గొప్ప ఉద్యమాన్ని మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ప్రకృతిని చూసి నేర్చుకున్న విషయాలతో ఆమె స్వయంగా ఒక సరికొత్త నీటి శుద్ధి పరికరాన్ని తయారుచేసింది. ప్రయోగశాల పరీక్షల్లో నీటిలోని ప్రమాదకరమైన సీసం వంటి విష పూరిత లోహాలను ఇది పూర్తిగా తొలగించి, నీటిని స్వచ్ఛంగా మారుస్తుందని రుజువైంది. కేవలం పరికరాల తయారీకే పరిమితం కాకుండా, హోటళ్లు మరియు రెస్టారెంట్లలో నీటి వృథాను అరికట్టేందుకు 'సగం గ్లాసు నీరు మాత్రమే ఇవ్వండి' అనే సామాజిక ప్రచారాన్ని కూడా ఆమె విజయవంతంగా నడుపుతోంది. దీనితో పాటు నీటి పొదుపును పెంచేలా మోటార్ పంపుల వాడకంపై చట్టపరమైన నిబంధనలు తేవడానికి కూడా ఆమె తన వంతు ప్రయత్నం చేస్తోంది.
చిన్న వయసులోనే పర్యావరణం పట్ల, సమాజం పట్ల నిత్య చూపిన బాధ్యత, సాధించిన ఈ ఘన విజయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ ఎంతో గర్వకారణంగా నిలిచింది. ఒక పక్క సైన్స్ ఆవిష్కరణ, మరోపక్క సామాజిక మార్పును కలిపి నిత్య సాగిస్తున్న ఈ ప్రయాణం రేపటి తరానికి ఒక గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com