వాణిజ్య హంగులున్న చిత్రాలకు చిరునామా... కేఎస్‌ రవికుమార్‌

- August 10, 2016 , by Maagulf
వాణిజ్య హంగులున్న చిత్రాలకు చిరునామా... కేఎస్‌ రవికుమార్‌

 కోలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో వాణిజ్య హంగులున్న చిత్రాలకు చిరునామా... కేఎస్‌ రవికుమార్‌. పంచ్‌లు, పాటలు, ఆకట్టుకునే సెంటిమెంట్‌, ప్రేమ, పోరాటం.. ఇవన్నీ రవికుమార్‌ సినిమాలో ఉండాల్సిందే. 26 ఏళ్లుగా దర్శకుడు, నటుడిగా రాణిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు. 'తలొగ్గని దర్శకుడు' అనే పేరు కూడా తెచ్చుకున్నారు. 'పురియాద పుదిర్‌' సినిమా ద్వారా దర్శకుడిగా అడుగుపెట్టిన ఆయన... రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, శరత్‌కుమార్‌, విజయ్‌, అజిత్‌, సూర్య తదితర హీరోలతో సినిమాలను రూపొందించారు. తెలుగులో చిరంజీవి, నాగార్జునలతోనూ పనిచేశారు. అధికంగా తన డబ్బింగ్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ప్రస్తుతం కన్నడ నటుడు సుదీప్‌ హీరోగా 'ముడింజా ఇవన పుడి' రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా పాత్రికేయుల ప్రశ్నలకు ఆయన ఇచ్చిన సమాధానాలివీ...
ప్ర: వాణిజ్య హంగులున్న సినిమాలనే ఎందుకు ఎంచుకుంటున్నారు? జ: ఒక్కొక్కరికి ఒక్కో శైలి ఉంటుంది. నిజానికి నేను 'పురియాద పుదిర్‌' చిత్రానికి దర్శకుణ్ని అవుతానని ఏ మాత్రం అనుకోలేదు. ఆ సినిమాకు స్క్రీన్‌ప్లే, మాటలు మాత్రమే రాశా. ఉన్నట్టుండి నేనే దర్శకుణ్నని నిర్మాత ఆర్‌బీ చౌదరి చెప్పారు. నేను ఒప్పుకోలేదు. కారణమడిగితే ఈ సినిమా ఇప్పట్లో ఆడటం కష్టమని సమాధానమిచ్చా. ''అదేంకాదు.. నాకు సినిమా నచ్చింది. నువ్వు కాస్త మార్పుచేర్పులు చేసుకుని రా. ఈ సినిమా గురించి పెద్దగా పట్టించుకోకు. నీ తదుపరి సినిమాను కూడా నేనే నిర్మిస్తాన''ని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత నేనే కథ, మాటలు, స్క్రీన్‌ప్లే అందించడంతోపాటు దర్శకత్వం వహించిన 'చేరన్‌ పాండియన్‌' మంచి గుర్తింపు తీసుకొచ్చింది.
ప్ర: సీనియర్‌ దర్శకుడిగా మీ అనుభవాలేంటి? జ: నేను 26 సంవత్సరాలు మాత్రమే సినిమా పరిశ్రమలో ఉన్నట్లు చెబుతున్నారు. అదేం కాదు.. మొత్తం 36 సంవత్సరాలు. సహాయ దర్శకుడిగా పదేళ్లపాటు పనిచేశా. అప్పుడే ఎన్నో అనుభవాలు పొందా. దర్శకుడిగా ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారు.. ముఖ్యంగా నా నుంచి ఏం ఆశిస్తున్నారనే విషయాన్ని ఆరంభంలోనే తెలుసుకున్నా. అందువల్లే నేను అనుకున్నట్టుగానే వాణిజ్య హంగులతో సినిమాలను రూపొందిస్తున్నా.
ప్ర: తొలి చిత్రం తర్వాత ప్రయోగాల జోలికి వెళ్లలేదే? జ: ఆర్ట్‌ సినిమాలను మాత్రమే ప్రయోగాత్మక, సృజనాత్మక సినిమాలని భావిస్తారు. ఆ ముద్ర ఎందుకు పడిందో నాకు అర్థం కావడం లేదు. ఎలాంటి చిత్రానికైనా ప్రయోగం, సృజనాత్మకత అవసరమే. వాణిజ్య సినిమాకైనా ఇవి ముఖ్యమే. శీర్షిక పెట్టడం నుంచి ప్రతి ఫ్రేమును చిత్రీకరించడంలోనూ ఎంతో శ్రమపడాలి. నిజం చెప్పాలంటే ఓ కమర్షియల్‌ దర్శకుడు మంచి ఆర్ట్‌ఫిల్మ్‌ను రూపొందించగలరు. కానీ ఆర్ట్‌ డైరెక్టర్‌ అలా చేయడం చాలా కష్టం.
ప్ర: ఇటీవల నటనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారెందుకు? జ: నా కెరీర్‌ ఆరంభం నుంచి ఇప్పటి వరకు.. ఎవర్నీ నేను అవకాశం అడగలేదు. అన్నీ వాటంతట అవే వచ్చాయి. అంతెందుకు సహాయ దర్శకుడిగా చేరడానికి కూడా నేను ఎవరినీ అడగలేదు. దర్శకుడైన తర్వాత హీరోల కాల్షీట్‌ కోసం ప్రయత్నాలు చేయలేదు. ఒకప్పుడు నా అసిస్టెంట్‌ డైరెక్టర్లు, మిత్రులు రూపొందించే సినిమాల్లో చిన్నాచితకా పాత్రలు పోషించేవాణ్ని. పారితోషికం కూడా తీసుకునేవాణ్ని కాదు. అలాంటి అనివార్య అభ్యర్థనలు ఎక్కువయ్యాయి. దీంతో అన్నింటినీ ఆపేశా. ఈ మధ్య తప్పకుండా మీరు నటించాలని కొందరు పట్టుబడుతున్నారు. అందుకే ఒప్పుకుంటున్నా. 'తంగమగన్‌'లో నటించడం కోసం ధనుష్‌ చాలా సార్లు నా కార్యాలయానికి వచ్చారు. ప్రస్తుతం శివకార్తికేయన్‌ నటించిన 'రెమో'లో, విజయ్‌ సేతుపతి హీరోగా వస్తున్న 'రెక్క'లోనూ నటించా. విశాల్‌, లారెన్స్‌ కూడా అడిగారు.
ప్ర: తెలుగులో నేరుగా సినిమా చేసే అవకాశముందా? జ: చిరంజీవి, నాగార్జునలతో కలిసి సినిమాలు చేశా. అక్కడ కూడా మంచి గుర్తింపు లభించడం ఆనందంగా ఉంది. ఆ తర్వాత తమిళ సినిమాల్లో బిజీ అయిపోవడంతో నేరు సినిమాలను చేయలేకపోయా. కానీ ఇటీవల చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇంటికి వెళ్లా. చాలా సంతోషించారు. 'మనం మళ్లీ ఓ సినిమా చేయాల'ని పేర్కొన్నారు. తప్పకుండా చేద్దామని చెప్పా. అన్నీ కుదిరితే మంచి చిత్రంతో తెలుగు ప్రేక్షకులను త్వరలోనే పలుకరిస్తా.
ప్ర: మీ చిత్రాల్లో దేనికైనా సీక్వెల్‌ చేస్తారా? జ: 'పంచతంత్రం' రెండోభాగం చేయాలని ఎప్పుడో అనుకున్నాం. అందుకు కమల్‌ కూడా వన్‌లైన్‌ కథ చెప్పారు. అంతేకాదు.. ఆ మధ్య కమల్‌ పుట్టినరోజు సందర్భంగా ఆ సినిమా జట్టు మొత్తం ఛాయాచిత్రం తీసుకుంటూ 'పంచతంత్రం 2' అని సందడి చేశారు. దాంతోపాటు మరికొన్ని సినిమాలు కూడా చేయాలన్న ఆలోచన ఉంది. దానికి తగిన సందర్భం కోసం ఎదురుచూస్తున్నా.
ప్ర: 'కబాలి' చూశారా? జ: చూశా. ఆ వెంటనే రజనీసార్‌కు ఫోన్‌ చేసి కూడా మాట్లాడా. 'సర్‌ ఇది మీ శైలి సినిమా కాదు. అలాగే రంజిత్‌ సినిమా కూడా కాదు. మంచి డాన్‌ చిత్రంలో అద్భుతంగా నటించార'ని చెప్పా.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com