అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- July 19, 2026
తిరుమల: అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని, వన్యప్రాణుల సంచారాన్ని సమర్థవంతంగా నియంత్రించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి అధికారులను సూచించారు. శనివారం తిరుమల పద్మావతి విశ్రాంతి భవనంలోని సుధర్మ సమావేశ మందిరంలో టీటీడీ, అటవీ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ, గత కొన్నేళ్లుగా చోటుచేసుకున్న వన్యప్రాణుల ఘటనలు, వాటి ధోరణులపై సమగ్ర డేటా విశ్లేషణ చేపట్టి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత ప్రణాళిక రూపొందించాలని సూచించారు. తిరుమల పరిసర ప్రాంతాల్లో వన్యప్రాణుల సంచార మార్గాలు, వాటి కదలికల తీరును శాస్త్రీయంగా అధ్యయనం చేసి, భక్తులకు ప్రమాదం కలిగించే ప్రాంతాలను గుర్తించి తగిన నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.
అలాగే వన్యప్రాణుల సంచారానికి సంబంధించి ఇప్పటికే గుర్తించిన మూడు ప్రధాన ప్రమాద కారకాలను (రిస్క్ పారామీటర్లు) సమగ్రంగా పరిశీలించి, వాటి ప్రభావాన్ని తగ్గించే కార్యాచరణను రూపొందించాలని సూచించారు. తిరుమల అటవీ ప్రాంతంలోని వన్యప్రాణుల సంఖ్య, పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన నియంత్రణ చర్యలు చేపట్టాలని తెలిపారు.
అలిపిరి నడక మార్గంలోని దుకాణాల నిర్వహణ వల్ల వన్యప్రాణుల సంచారంపై, భక్తుల భద్రతపై ఎలాంటి ప్రభావం పడుతోందో సమగ్రంగా అధ్యయనం చేసి, అవసరమైతే తగిన నియంత్రణ చర్యలు చేపట్టాలని అధికారులను సూచించారు.
అడవిలో వ్యర్థాల నిర్వహణను మరింత పటిష్టం చేసి, ఆహార వ్యర్థాలు లేదా ఇతర చెత్త కారణంగా వన్యప్రాణులు నడక మార్గానికి ఆకర్షితులు కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సున్నితమైన ప్రాంతాల్లో భద్రతా, రక్షణ చర్యలను మరింత బలోపేతం చేయడంతో పాటు, భక్తుల భద్రతకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించాలని సూచించారు.
వన్యప్రాణుల సంచారాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు టీటీడీ, అటవీ శాఖ, విజిలెన్స్, ఇంజినీరింగ్, ఆరోగ్య శాఖలతో పాటు సంబంధిత అన్ని విభాగాల మధ్య సమన్వయాన్ని మరింత మెరుగుపరచి, సమర్థవంతమైన మానిటరింగ్, సమాచార మార్పిడి, అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన స్పందనకు చర్యలు చేపట్టాలని సూచించారు.
శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ప్రత్యేక ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించిన అదనపు ఈవో, ఈ బృందానికి అవసరమైన సిబ్బంది, ఆధునిక పరికరాలు, వాహనాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో ఉంచి, వన్యప్రాణుల ఘటనలు చోటుచేసుకున్న వెంటనే తక్షణమే స్పందించేలా శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు.
అంతకు ముందు టీటీడీ డీఎఫ్ఓ ఫణికుమార్ నాయుడు మాట్లాడుతూ, గత రెండేళ్లలో చిరుతలు ఎక్కువగా సంచరించిన ప్రాంతాలు, ట్రాప్ కెమెరాలు, సోలార్ కెమెరాల పనితీరు, వన్యప్రాణుల సంచార ధోరణులు తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ సమావేశంలో చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ శ్రీనివాసరెడ్డి, డీఎఫ్ఓ సాయిబాబా, టీటీడీ చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణ, ఆరోగ్య విభాగం డిప్యూటీ ఈవో సోమన్నారాయణ, తిరుమల విజిలెన్స్ అధికారి సురేంద్ర తదితర అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!







