శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- July 23, 2026
రియాద్: శాంతియుత అణుశక్తి వినియోగంలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అమెరికా మరియు సౌదీ అరేబియా కీలక అణుశక్తి సహకార ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ విషయాన్ని సౌదీ ఇంధన మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది.
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో మాట్లాడుతూ, సౌదీ అరేబియా అమెరికాకు అత్యంత కీలక వ్యూహాత్మక భాగస్వామి అని, రియాద్‌తో అణుశక్తి సహకార ఒప్పందం కుదుర్చుకోవడం సముచితమైన నిర్ణయమని అన్నారు.
ఈ ఒప్పందం ద్వారా శాంతియుత, పౌర అవసరాల కోసం మాత్రమే అణుశక్తి కార్యక్రమం అమలు చేయబడుతుందని, అణ్వాయుధాల అభివృద్ధికి ఎలాంటి అవకాశం లేకుండా కఠిన భద్రతా నిబంధనలు అమలులో ఉంటాయని రుబియో స్పష్టం చేశారు.
ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరిగిన ఆగ్నేయాసియా శిఖరాగ్ర సమావేశం సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రపంచంలోని ఏ దేశంతోనైనా అమెరికా పౌర అణుశక్తి సహకార ఒప్పందం కుదుర్చుకున్నా, అది ఆయుధాల తయారీకి దారితీయకుండా తగిన భద్రతా చర్యలతోనే ఉంటుందని చెప్పారు.
సౌదీ అరేబియా కూడా శాంతియుత పౌర అణుశక్తి కార్యక్రమాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోందని పేర్కొన్న రుబియో, ఇలాంటి ఒప్పందం ఇప్పటికే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో కూడా అమలులో ఉందని గుర్తు చేశారు.
అమెరికా చట్టాల ప్రకారం విదేశీ దేశాలతో అణుశక్తి సహకారం కోసం అవసరమైన "123 అగ్రిమెంట్" కింద ఈ ఒప్పందం కుదిరింది. సౌదీ ఇంధన మంత్రి ప్రిన్స్ అబ్దులజీజ్ బిన్ సల్మాన్ మరియు అమెరికా ఇంధన శాఖ కార్యదర్శి క్రిస్ రైట్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. దీనితో పాటు ద్వైపాక్షిక భద్రతా (Bilateral Safeguards Agreement) ఒప్పందం కూడా కుదిరింది.
సౌదీ ఇంధన మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో, ఈ ఒప్పందం అమెరికా–సౌదీ మధ్య ఉన్న చారిత్రాత్మక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని పేర్కొంది. గత ఏడాది నవంబర్‌లో అమెరికా పర్యటన సందర్భంగా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ ప్రకటించిన శాంతియుత అణుశక్తి సహకార చర్చల విజయవంతమైన ముగింపుకు ఇది కొనసాగింపుగా నిలిచిందని తెలిపింది.
ఈ ఒప్పందం ద్వారా ఇంధన రంగం, అధునాతన సాంకేతికతలలో పరస్పర సహకారం విస్తరించడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాల మార్పిడి మరింత వేగవంతం కానుంది. అలాగే అణు భద్రత, అణు సెక్యూరిటీ, అణ్వాయుధాల వ్యాప్తి నిరోధక చర్యల్లో అత్యున్నత అంతర్జాతీయ ప్రమాణాలను పాటించేందుకు ఈ భాగస్వామ్యం దోహదపడుతుందని అధికారులు తెలిపారు.
అమెరికా ఇంధన శాఖ కార్యదర్శి క్రిస్ రైట్ మాట్లాడుతూ, ఈ ఒప్పందాలు అమెరికా–సౌదీ వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడమే కాకుండా, ఇరు దేశాల ఆర్థికాభివృద్ధికి, మిత్రదేశాల భద్రతకు కూడా తోడ్పడతాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో ప్రత్యేక వాహన రిజిస్ట్రేషన్ నంబర్లకు దరఖాస్తులు ఆహ్వానం..!!
- అక్టోబర్ 1 నుంచి ఒమన్‌లో 1,546 వస్తువులపై జీరో వ్యాట్..!!
- ఒమన్ లో కన్జుమర్ కాన్ఫిడెన్స్ సర్వే నిర్వహిస్తున్న ఎన్సీఎస్ఐ..!!
- అల్ షహీద్ పార్క్ మూడో దశ ప్రారంభోత్సవం.. రెండు రోజుల కార్నివాల్..!!
- అక్టోబర్ 21న రియాద్ సీజన్ 2026 ప్రారంభం..!!
- బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ లో ఆకట్టుకున్న పీస్ డే ప్రోగ్రామ్స్..!!
- 48 గంటల్లో ఐరిష్ క్రైమ్ బాస్ అరెస్ట్.. 82 ప్రాపర్టీలు సీజ్..యూఏఈ మంత్రి..!!
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్







