కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- July 28, 2026
న్యూఢిల్లీ: నిజామాబాద్ లోక్‌సభ సభ్యుడు అర్వింద్ ధర్మపురి మంగళవారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పెండింగ్‌లో ఉన్న రైల్వే అభివృద్ధి ప్రాజెక్టులు, మౌలిక వసతుల కల్పనపై విస్తృతంగా చర్చించారు.
పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులకు త్వరితగతిన పరిపాలనా, ఆర్థిక అనుమతులు మంజూరు చేయాలని, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని ఎంపీ అర్వింద్ ధర్మపురి కేంద్ర మంత్రిని కోరారు.
ఈ సందర్భంగా నవీపేట రైల్వే క్రాసింగ్ వద్ద రోడ్డు ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబీ) నిర్మాణానికి అనుమతి మంజూరు చేయాలని, అలాగే డిచ్‌పల్లి రైల్వే క్రాసింగ్ వద్ద రోడ్డు అండర్ బ్రిడ్జి (ఆర్‌యూబీ) నిర్మాణాన్ని చేపట్టాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గడంతో పాటు, రైల్వే క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలు నివారించబడి ప్రజల ప్రయాణ భద్రత మరింత మెరుగుపడుతుందని ఆయన వివరించారు.
ఎంపీ వినతిపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ప్రతిపాదనలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకునేలా సంబంధిత అధికారులను ఆదేశిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
అదేవిధంగా, ఇటీవల ఇందల్వాయి, జానకంపేట ప్రాంతాల్లో కొత్త రోడ్డు ఓవర్ బ్రిడ్జిలు (ఆర్‌ఓబీలు) మంజూరు చేసినందుకు కేంద్ర రైల్వే మంత్రికి ఎంపీ అర్వింద్ ధర్మపురి కృతజ్ఞతలు తెలిపారు.
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధి, ప్రయాణికుల భద్రత, రవాణా సౌకర్యాల మెరుగుదల కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులు తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తానని ఎంపీ అర్వింద్ ధర్మపురి తెలిపారు.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !
- ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
- తిరుమలలో 32 ఉచిత ఈవీ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- హైదరాబాద్‌లోనే తొలి మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్
- గాజా సిటీలో విషాదం..భవనం కూలి 16 మంది మృతి
- అబుదాబిలో మూడు ఘటనలు..కార్ల ఢీకొనడంతో పాదచారులకు గాయాలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ నాలుగో కారిడార్







