సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌తో ట్రంప్ కీలక చర్చలు.
- August 02, 2026
సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌తో ట్రంప్ కీలక చర్చలు.. ఇరాన్‌పై దాడి నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడి ప్రకటన
రియాద్/వాషింగ్టన్: మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సౌదీ అరేబియా యువరాజు, ప్రధానమంత్రి మహ్మద్ బిన్ సల్మాన్‌తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెలిఫోన్లో కీలకంగా చర్చించారు. ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించి శాంతి స్థాపన దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరంపై ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు.
సౌదీ ప్రెస్ ఏజెన్సీ (SPA) ప్రకారం, యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ మాట్లాడుతూ, ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు సంభాషణలకు ప్రాధాన్యం ఇవ్వాలని, కాల్పుల విరమణకు దారితీసే అన్ని ప్రయత్నాలను ముమ్మరం చేయాలని సూచించారు. దౌత్యపరమైన పరిష్కారాలకు మార్గం సుగమం చేసేలా అన్ని పక్షాలు వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రస్తుత పరిస్థితులు మరింత తీవ్రమై విస్తృత యుద్ధానికి దారితీయకుండా నిరోధించడం అత్యంత అవసరమని, లేకపోతే ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని యువరాజు హెచ్చరించారు.
ఇదిలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం రాత్రి ఇరాన్‌పై కొత్తగా సైనిక దాడులు చేపట్టే నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. మధ్యప్రాచ్య మిత్రదేశాలు యుద్ధానికి ముగింపు పలికే ఒప్పందానికి సంబంధించిన కీలక అంశాలపై అవగాహనకు వచ్చాయని ఆయన పేర్కొన్నారు.
హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవడం, ఇరాన్ అణు ముప్పును ముగించడం వంటి అంశాలు ప్రతిపాదిత ఒప్పందంలో భాగంగా ఉంటాయని ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ద్వారా వెల్లడించారు. ప్రపంచ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, అలాగే ఇరాన్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దాడిని రద్దు చేయడానికి అంగీకరించినట్లు తెలిపారు. ఈ ఒప్పందానికి ఇజ్రాయెల్ కూడా మద్దతు ఇస్తోందని ఆయన పేర్కొన్నారు.
అయితే ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలను ఇరాన్ ఖండించింది. ఇరాన్ అధికారిక మెహర్ న్యూస్ ఏజెన్సీ కథనం ప్రకారం, అమెరికాను దాడులు నిలిపివేయాలని ఇరాన్ ఎలాంటి అభ్యర్థన చేయలేదని స్పష్టం చేసింది. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని, ఇరాన్ సాయుధ బలగాలు అత్యంత అప్రమత్తంగా ఉండి ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయని సైనిక అధికారులు వెల్లడించినట్లు తెలిపింది.
ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై దాడులు ప్రారంభించినప్పటి నుంచి ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్ క్షిపణి సామర్థ్యాన్ని దెబ్బతీయడం, అణ్వాయుధాల అభివృద్ధిని అడ్డుకోవడం, మిత్ర సాయుధ గ్రూపులకు మద్దతును నిలిపివేయడం లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు అమెరికా ప్రకటించినప్పటికీ, యుద్ధ పరిస్థితులు పలు మార్లు మారుతూ వస్తున్నాయి.
ఇక హోర్ముజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలపై ఇరాన్ కఠిన నియంత్రణ కొనసాగిస్తోందని అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి. అనుమతి లేకుండా ప్రయాణించే నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో హోర్ముజ్ మార్గంలో సముద్ర వాణిజ్య రాకపోకలు గణనీయంగా తగ్గినట్లు అంతర్జాతీయ సముద్ర వాణిజ్య విశ్లేషణ సంస్థలు వెల్లడించాయి.
అదే సమయంలో మిడిల్లో ఈస్ట్ లోని అమెరికా రాయబార కార్యాలయాలు తమ పౌరులకు అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉన్నందున అవసరమైతే వెంటనే అక్కడి నుంచి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సూచించాయి. ఈ పరిణామాలు మధ్యప్రాచ్యంలో భద్రతా పరిస్థితులపై అంతర్జాతీయ ఆందోళనను మరింత పెంచుతున్నాయి.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో కొత్త సముద్ర మార్గంపై ఇరాన్–ఒమాన్ ఒప్పందం దిశగా కీలక పురోగతి
- 2026 తొలి ఆరు నెలల్లో దుబాయ్ ప్రజా రవాణాలో 34.81 కోట్ల ప్రయాణాలు..
- సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌తో ట్రంప్ కీలక చర్చలు.
- కూటమి సర్కార్ పై జగన్ ఫైర్
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన బహ్రెయిన్, జోర్డాన్ రాజులు..
- ఆపదలో అండగా హరీష్ రావు..పేద విద్యార్థిని చదువుకు చేయూత
- పర్యాటకులకు ఒమాన్ గుడ్ న్యూస్..
- అదనపు పన్నుల వాటా కేటాయింపు..కేంద్రానికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు
- మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్
- తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) అధ్యక్షుడిగా నల్ల భాస్కర్ గుప్త ఏకగ్రీవ ఎన్నిక







