దుబాయ్‌లో కొత్త అల్ ఖుద్రా బ్రిడ్జి ప్రారంభం..
- August 09, 2026
దుబాయ్: దుబాయ్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించే దిశగా రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) కీలక ముందడుగు వేసింది. అల్ ఖుద్రా రోడ్, షేక్ జాయెద్ బిన్ హమ్దాన్ అల్ నహ్యాన్ స్ట్రీట్ కూడలిలో కొత్త నాలుగు లేన్ల బ్రిడ్జిని ఆదివారం ప్రారంభించింది. దీంతో ఈ కీలక కూడలిలో వాహనాల వెయిటింగ్ టైమ్ దాదాపు 85 శాతం తగ్గి, ఏడు నిమిషాల నుంచి ఒక్క నిమిషానికి చేరుకోనుంది.
అల్ ఖుద్రా రోడ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించిన ఈ 700 మీటర్ల పొడవైన బ్రిడ్జి కూడలికి దక్షిణ వైపున ఉంది. అల్ ఖుద్రా రోడ్ నుంచి అల్ ఖుద్రా సిటీ వైపు వెళ్లే వాహనాలకు ఇది ఉపయోగపడుతుంది.
ఇదే కూడలిలో అల్ ఖుద్రా సిటీ నుంచి ఉమ్మ్ సుఖీమ్ వైపు వెళ్లే వాహనాల కోసం నిర్మించిన మరో బ్రిడ్జిని ఫిబ్రవరిలోనే RTA ప్రారంభించింది. తాజాగా కొత్త బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో కూడలిలో ప్రధాన ట్రాఫిక్ వ్యవస్థ పూర్తయింది.
నాలుగో త్రైమాసికంలో మరో రెండు బ్రిడ్జిలు
2026 నాలుగో త్రైమాసికంలో మరో రెండు సైడ్-రాంప్ బ్రిడ్జిలను ప్రారంభించేందుకు RTA ప్రణాళిక సిద్ధం చేసింది. వీటి ద్వారా ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా అన్ని దిశల్లో వాహనాలు సులభంగా ప్రయాణించగలవు.
500 మీటర్ల పొడవైన బ్రిడ్జి అల్ ఖుద్రా రోడ్ నుంచి షేక్ జాయెద్ బిన్ హమ్దాన్ అల్ నహ్యాన్ స్ట్రీట్ మీదుగా జెబెల్ అలీ వైపు వెళ్లే వాహనాలకు సేవలు అందించనుంది. మరో 900 మీటర్ల బ్రిడ్జి డౌన్‌టౌన్ దుబాయ్, దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వైపు వెళ్లే వాహనాలకు ఉపయోగపడుతుంది.
అలాగే షేక్ జాయెద్ బిన్ హమ్దాన్ అల్ నహ్యాన్ స్ట్రీట్‌కు ఇరువైపులా మొత్తం 3 కిలోమీటర్ల సర్వీస్ రోడ్లను అభివృద్ధి చేస్తున్నారు. దీంతో పరిసర ప్రాంతాల్లోని నివాస, వాణిజ్య ప్రాంతాలకు రాకపోకలు మరింత సులభం కానున్నాయి.
ప్రయాణ సమయం 70 శాతం తగ్గింపు
అల్ ఖుద్రా రోడ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత ఈ మార్గంలో ప్రయాణ సమయం 9.4 నిమిషాల నుంచి 2.8 నిమిషాలకు తగ్గుతుందని RTA తెలిపింది. అంటే ప్రయాణ సమయం దాదాపు 70 శాతం తగ్గనుంది.
ఈ ప్రాజెక్టు ద్వారా రోజువారీగా 4 లక్షల మందికి పైగా నివాసితులు, సందర్శకులకు ప్రయోజనం కలగనుంది. అల్ ఖుద్రా రోడ్ దుబాయ్‌లో తూర్పు–పడమర దిశలను అనుసంధానించే కీలక రహదారిగా ఉంది. ఇది షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ రోడ్ నుంచి ఎమిరేట్స్ రోడ్ వరకు విస్తరించి ఉంది.
ఈ మార్గం ద్వారా అరేబియన్ రాంచెస్ 1, 2, దుబాయ్ మోటార్ సిటీ, దుబాయ్ స్టూడియో సిటీ, అకోయా, ముడాన్, డ్యామాక్ హిల్స్, ది సస్టైనబుల్ సిటీ తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగుతున్నాయి.
గంటకు 19,400 వాహనాల సామర్థ్యం
అల్ ఖుద్రా రోడ్, షేక్ జాయెద్ బిన్ హమ్దాన్ అల్ నహ్యాన్ స్ట్రీట్ అభివృద్ధి పనులతో ఈ కూడలి సామర్థ్యం గంటకు 7,800 వాహనాల నుంచి 19,400 వాహనాలకు పెరగనుంది. దీంతో ట్రాఫిక్ ప్రవాహం మెరుగుపడి, రద్దీ తగ్గడంతో పాటు రోడ్డు భద్రత కూడా మెరుగుపడుతుందని RTA పేర్కొంది.
RTA డైరెక్టర్ జనరల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ బోర్డు చైర్మన్ మత్తర్ అల్ తాయర్ మాట్లాడుతూ.. దుబాయ్ జనాభా, పట్టణ ప్రాంతాల విస్తరణకు అనుగుణంగా రహదారి మౌలిక సదుపాయాలను విస్తరించడంలో భాగంగానే అల్ ఖుద్రా రోడ్ ప్రాజెక్టును చేపట్టినట్లు తెలిపారు.
మొత్తం ప్రాజెక్టులో పలు కూడళ్ల అభివృద్ధి, 4 కిలోమీటర్ల బ్రిడ్జిల నిర్మాణం, అల్ ఖుద్రా రోడ్‌లో 11.6 కిలోమీటర్ల మేర విస్తరణ, అభివృద్ధి పనులు ఉన్నాయి.
ఇదిలా ఉండగా, ఈ ఏడాది ప్రారంభంలో అల్ ఖుద్రా రోడ్–అరేబియన్ రాంచెస్–దుబాయ్ స్టూడియో సిటీ అనుసంధాన కూడలిలో 1.2 కిలోమీటర్ల పొడవైన నాలుగు లేన్ల బ్రిడ్జిని RTA ప్రారంభించింది. మే నెలలో ఎమిరేట్స్ రోడ్–అల్ ఖుద్రా రోడ్ కూడలిలో కూడా కొత్త సర్వీస్ రోడ్డు, ఫ్రీ-ఫ్లో లూప్ ర్యాంప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
జెబెల్ అలీ నుంచి ఎమిరేట్స్ రోడ్ మీదుగా అల్ ఖుద్రా రోడ్ ద్వారా ఉమ్మ్ సుఖీమ్ వైపు వెళ్లే వాహనాల కోసం మరో ఫ్రీ-ఫ్లో ర్యాంప్‌ను ఈ నెలలో ప్రారంభించేందుకు RTA ఏర్పాట్లు చేస్తోంది. అదనంగా ఎమిరేట్స్ రోడ్‌లో ఇరువైపులా కలిపి 4.8 కిలోమీటర్ల మేర అదనపు లేన్లను నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- లంక పై భారత్ ఘన విజయం..భారత్‌కు రికార్డు స్థాయిలో ఎనిమిదో మహిళల ఆసియా కప్
- బ్రిక్స్ లో ప్యూర్ వెజ్ డిన్నర్..రాహుల్ కౌంటర్
- యూఏఈ అధ్యక్షుడు, జోర్డాన్ రాజు భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు
- ఏపీ వైద్య రంగానికి కేంద్రం కొత్త భరోసా
- సౌదీ అరేబియాలో భారీ ట్రక్కులకు 6 కీలక నిబంధనలు..!!
- కువైట్‌లో డ్రోన్లకు కొత్త చట్టం.. నిబంధనలు ఉల్లంఘిస్తే 2 ఏళ్ల జైలు..!!
- స్కూల్లో పిల్లలకు తరచూ తలనొప్పా? కంటి పరీక్షలు తప్పనిసరి: డాక్టర్లు
- ఖతార్‌లో రిక్రియేషనల్ స్పేసెస్ విస్తరణ వేగవంతం..!!
- ఒమన్‌లో ఏ వస్తువులు, సేవలకు పన్ను ఉండదో తెలుసా?
- బహ్రెయిన్ రాయబారి–యూఎన్ ఉన్నతాధికారుల భేటీ..!!







