నిబంధనలు ఉల్లంఘించిన కార్ల డీలర్‌కు భారీ జరిమానా.. లైసెన్స్ సస్పెన్షన్..!!
- August 10, 2026
రియాద్: వినియోగదారుల హక్కులను ఉల్లంఘించిన ఓ కార్ల డీలర్‌షిప్‌పై సౌదీ అరేబియా వాణిజ్య మంత్రిత్వ శాఖ కఠిన చర్యలు తీసుకుంది. సంబంధిత డీలర్‌కు చెందిన వాహనాల దిగుమతి లైసెన్స్‌ను సస్పెండ్ చేయడంతో పాటు SR 8.12 మిలియన్ల (81.2 లక్షల రియాల్స్) జరిమానా విధించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
కమర్షియల్ ఏజెన్సీస్ చట్టం, దాని అమలు నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు వినియోగదారుల హక్కులను కాపాడడంలో విఫలమైనందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. దర్యాప్తులో డీలర్‌షిప్‌కు సంబంధించి 175 ఉల్లంఘనలు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. వీటిలో విడిభాగాల (స్పేర్ పార్ట్స్) అందుబాటులో లేకపోవడం, వాహనాలు మరమ్మతుల కోసం వర్క్‌షాప్‌లో ఉన్న సమయంలో వినియోగదారులకు ప్రత్యామ్నాయ వాహనాలు అందించకపోవడం వంటి అంశాలు ఉన్నాయి.
అలాగే నిర్వహణ సేవలు, విడిభాగాల లభ్యత, తయారీ నాణ్యత హామీలు, అమ్మకాల అనంతర సేవల (ఆఫ్టర్-సేల్స్ సర్వీసెస్) విషయంలో కూడా నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించారు. వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన ప్రత్యేక బృందం ఫిర్యాదులను పరిశీలించి, వినియోగదారులతో నేరుగా సంప్రదింపులు జరిపింది. బాధితులకు తగిన పరిహారం అందేలా చూడటంతో పాటు అవసరమైన చోట ప్రత్యామ్నాయ వాహనాలు కూడా అందజేసినట్లు తెలిపింది.
ఈ వ్యవహారంలో వాహన తయారీ సంస్థ ప్రతినిధులను కూడా పిలిపించి, డీలర్‌షిప్‌లో లోపాల సవరణకు సూచించిన చర్యలు అమలవుతున్నాయా లేదా అన్నదానిపై పర్యవేక్షణ చేపట్టినట్లు వెల్లడించింది. రీకాల్ కార్యక్రమాల అమలును కూడా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. అలాగే, సంబంధిత బ్రాండ్‌ను మరో ఏజెంట్‌కు బదిలీ చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. వినియోగదారులకు అవసరమైన సేవలు అందించే సామర్థ్యం, సన్నద్ధత ఉన్నట్లు పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే కొత్త ఏజెంట్‌ను ఎంపిక చేస్తామని పేర్కొంది.
వినియోగదారుల పట్ల తమ బాధ్యతలను విస్మరించే ఏ ఏజెంట్‌పైనా చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంలో వెనుకాడబోమని వాణిజ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. అవసరమైతే తుది న్యాయ తీర్పు ఆధారంగా ఉల్లంఘనల వివరాలను బహిరంగంగా ప్రకటించే చర్యలు కూడా తీసుకుంటామని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి
- మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!







