దుబాయ్‌లో అద్దె చెల్లింపులకు ఇక లోన్లు అవసరం లేదు.. నెలవారీగా చెల్లించే అవకాశం..!!
- August 17, 2026
దుబాయ్: దుబాయ్‌లో ఇళ్ల అద్దె చెల్లించేందుకు భారీ మొత్తంలో అప్పులు చేయాల్సిన పరిస్థితికి త్వరలో చెక్ పడనుంది. దుబాయ్ ల్యాండ్ డిపార్ట్‌మెంట్ (DLD) తీసుకొచ్చిన ఫ్లెక్సీ రెంట్ పథకం ద్వారా అద్దెదారులు నెలవారీ, త్రైమాసిక లేదా వార్షిక వాయిదాల్లో అద్దె చెల్లించే అవకాశం పొందుతున్నారు. ఇప్పటివరకు దుబాయ్‌లో చాలా మంది అద్దెదారులు ఏడాది అద్దె కోసం పెద్ద మొత్తంలో ముందుగానే చెక్కులు ఇవ్వాల్సి వచ్చేది. ఆ మొత్తాన్ని సమకూర్చుకునేందుకు కొందరు వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డులను ఆశ్రయించేవారు. దీంతో ఇంటి అద్దెతో పాటు వడ్డీ భారం కూడా పడేది.
నెలనెలా చెల్లించే అవకాశం
ఫ్లెక్సీ రెంట్ పథకం ద్వారా అద్దెదారులు తమకు అనుకూలమైన చెల్లింపు విధానాన్ని ఎంచుకోవచ్చు. నెలవారీ, మూడు నెలలకు ఒకసారి లేదా ఆరు నెలలకు ఒకసారి చెల్లించే అవకాశం ఉంటుంది. ఏడాది మొత్తంలో చెల్లించాల్సిన అద్దె మొత్తం మాత్రం మారదు. మెర్లిన్ రియల్ ఎస్టేట్ సహ వ్యవస్థాపకుడు రోహిత్ బచాని మాట్లాడుతూ.. పెద్ద మొత్తంలో అద్దె చెక్కు కోసం వ్యక్తిగత రుణాలు లేదా క్రెడిట్ కార్డులపై ఆధారపడే అవసరాన్ని ఈ పథకం తగ్గిస్తుందని తెలిపారు.
కొత్తగా ఇల్లు అద్దెకు తీసుకునే వారికి భారీ మొత్తాన్ని ముందుగానే చెల్లించడం పెద్ద సమస్యగా ఉంటుందని స్ప్రింగ్‌ఫీల్డ్ ప్రాపర్టీస్ సీఈఓ ఫరూక్ సయ్యద్ చెప్పారు. నెలవారీ జీతంపై ఆధారపడే ఉద్యోగులకు ఇది ఆర్థికంగా భారంగా మారుతుందని తెలిపారు. ఈ కారణంగా కొందరు నాలుగు నుంచి ఆరు నెలలు డబ్బు కూడబెట్టే వరకు తాత్కాలిక ఇళ్లలో ఎక్కువ అద్దె చెల్లించాల్సి వస్తోందన్నారు.
సెప్టెంబర్‌లో ‘రెంట్ నౌ, పే లేటర్’
దుబాయ్ ల్యాండ్ డిపార్ట్‌మెంట్ జూన్ 23న ఫ్లెక్సీ రెంట్ పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా పాల్గొనే రియల్ ఎస్టేట్ సంస్థల ద్వారా ఇళ్లు అద్దెకు తీసుకునే వారు తమకు అనుకూలమైన చెల్లింపు విధానాన్ని ఎంచుకోవచ్చు. అంతేకాకుండా సెప్టెంబర్‌లో ‘రెంట్ నౌ, పే లేటర్’ సేవను ప్రారంభించేందుకు దుబాయ్ సిద్ధమవుతోంది. దీని ద్వారా ఏడాది అద్దెను వడ్డీ లేకుండా గరిష్ఠంగా 12 నెలల వరకు విభజించి చెల్లించే అవకాశం కల్పించనున్నారు. ఈ సేవను దుబాయ్ ల్యాండ్ డిపార్ట్‌మెంట్ ఓ స్థానిక బ్యాంకుతో కలిసి అభివృద్ధి చేస్తోంది.
అద్దె ధరలు తగ్గుతాయా?
ఫ్లెక్సీ రెంట్ పథకం వల్ల నేరుగా అద్దె ధరలు తగ్గే అవకాశం తక్కువేనని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు చెబుతున్నారు. అద్దె ధరలను ప్రధానంగా డిమాండ్, సరఫరా, ప్రాంతం, ఆస్తి నాణ్యత వంటి అంశాలే నిర్ణయిస్తాయని పేర్కొన్నారు. అయితే నెలవారీ చెల్లింపులను ఎంచుకునే అద్దెదారుల నుంచి కొందరు యజమానులు అదనపు మొత్తాన్ని వసూలు చేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దుబాయ్‌లో అద్దె మార్కెట్‌లో పోటీ పెరుగుతున్న నేపథ్యంలో యజమానులు అద్దె తగ్గించడం కంటే సౌకర్యవంతమైన చెల్లింపు విధానాలను అందించేందుకు మొగ్గుచూపే అవకాశం ఉందని రోహిత్ బచాని తెలిపారు. మొత్తంగా చూస్తే.. ఫ్లెక్సీ రెంట్ పథకం దుబాయ్‌లో ఇల్లు అద్దెకు తీసుకునే సమయంలో ఎదురయ్యే భారీ ముందస్తు ఆర్థిక భారాన్ని తగ్గించడంతో పాటు.. కుటుంబాల నెలవారీ నగదు ప్రవాహానికి ఊరట కల్పించనుంది.
తాజా వార్తలు
- ఖతార్‌లో ప్రమాద బాధితుల ఫొటోలు తీస్తే జైలు.. QR10,000 వరకు ఫైన్..!!
- నేటితో అమెరికా-ఇరాన్ 60 రోజుల ఒప్పందం పూర్తి
- ఒమన్‌లో టెలికాం ప్రమోషనల్ మెసేజ్‌లపై ఆంక్షలు..!!
- నాగబాబుకు కీలక పదవి.. గ్రీన్ కమిటీ ఛైర్మన్‌గా నియామకం..
- విశాఖపట్నం టు భోగాపురం ఆర్టీసీ ఏరో ఎక్స్‌ప్రెస్‌లు ప్రారంభం..
- దుబాయ్‌లో అద్దె చెల్లింపులకు ఇక లోన్లు అవసరం లేదు.. నెలవారీగా చెల్లించే అవకాశం..!!
- కువైట్‌లో పొగాకు, నికోటిన్ ఉత్పత్తుల విక్రయంపై ఆంక్షలు..!!
- ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. నెలకు BD15 ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ప్రతిపాదన..!!
- సముద్రంలో ఐదుగురు సౌదీ పౌరులను రక్షించిన బోర్డర్ గార్డ్..!!
- యాదగిరిగుట్ట భక్తులకు గుడ్ న్యూస్







