వికసిత భారత్ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర–పూర్వ ఉపరాష్ట్రపతి పిలుపు
- August 17, 2026
• విదేశీ శక్తుల జోక్యంతో జరుగుతున్న ఉద్యమాల విషయంలో యువత అప్రమత్తంగా ఉండాలని సూచన
• ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ హిందీలో రచించిన “జనప్రియ నేత–వెంకయ్య నాయుడు” జీవిత చరిత్ర గ్రంథావిష్కరణ
• కార్యక్రమానికి హాజరైన కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తదితరులు
న్యూఢిల్లీ: దేశ భవిష్యత్తు, వికసిత భారత్ @ 2047 లక్ష్య సాధన యువత చేతుల్లోనే ఉందని, దేశ ఘనమైన వారసత్వాన్ని కాపాడుతూ సమగ్ర అభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలని భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. విశ్వహిందీ పరిషత్ అధ్యక్షులు, రాజ్యసభ పూర్వ సభ్యులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ హిందీలో రచించిన వెంకయ్యనాయుడు జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో న్యూఢిల్లీలోని డా. అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ వేదికగా భీం ఆడిటోరియంలో జరిగింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, ఈ పుస్తకాన్ని ఆవిష్కరించగా, కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్త సహా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పలువురు ప్రముఖులు, పూర్వ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... "నా జీవితంలోని ప్రధాన ఘట్టాలను, అనుభవాలను గ్రంథస్థం చేసిన ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కి హృదయపూర్వక అభినందనలు. ఈ పుస్తకం నా జీవిత ప్రయాణాన్ని సమీక్షించుకోవడానికి అద్దంలా నిలుస్తుంది. నాకు లభించిన ప్రతి బాధ్యతనూ ఈశ్వర ఆరాధనగా భావించి నిబద్ధతతో నిర్వహించాను. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రేరణతో 'చరైవేతి-చరైవేతి' (నిరంతరం ముందుకు సాగడం) సిద్ధాంతాన్ని ఆచరిస్తూ జీవించాను. ఉపరాష్ట్రపతి పదవీకాలం ముగిసినా, దేశ సేవలో విశ్రాంతి అనేది ఉండదు" అని తెలిపారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) శాఖ ద్వారా చిన్ననాటి నుంచే తనకు జాతీయవాద సంస్కారం, సామాజిక సమరసత, సేవా భావం అలవడ్డాయని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. విద్యార్థి దశలో జయప్రకాశ్ నారాయణ్ చేపట్టిన ‘సంపూర్ణ క్రాంతి’ ఉద్యమంలో పాల్గొనడం, ఎమర్జెన్సీ కాలంలో జైలు జీవితం ద్వారా సీనియర్ నాయకుల నుండి పాఠాలు నేర్చుకోవడం తన రాజకీయ ఎదుగుదలకు బలమైన పునాదిగా మారిందన్నారు.
నేటి యువతరం ఉద్యమాలు సోషల్ మీడియా వేదికగా సాగుతున్నాయని, అయితే విదేశీ శక్తుల జోక్యం, వాటి ప్రభావం పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. స్వతంత్ర విదేశాంగ విధానం, స్వదేశీ రక్షణ ఉత్పత్తులు, రికార్డు స్థాయి కొవిడ్ వ్యాక్సినేషన్, నిరంతర ఆర్థిక ప్రగతితో ఎదుగుతున్న భారతదేశ పురోగతిని కొన్ని శక్తులు అడ్డుకునే ప్రమాదం ఉందని, మన పొరుగు దేశాల్లో వచ్చిన రాజకీయ అస్థిరతలను గమనించి యువత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
స్వామి వివేకానంద చెప్పినట్లు యువత శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా బలంగా ఉండాలని సూచించారు. ఆధునిక జీవనశైలి వ్యాధుల బారిన పడకుండా యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలని, సంప్రదాయ భారతీయ ఆహార పద్ధతులు, శ్రీ అన్నం (మిల్లెట్స్) వంటి పోషకాహారాన్ని స్వీకరించాలని కోరారు. యువతరం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను అర్థం చేసుకుని, నిర్మాణాత్మక పరిష్కారాలతో రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షించారు.
తన పార్లమెంటరీ, ప్రజా ప్రయాణంలో మార్గదర్శనం చేసిన, సహకరించిన మిత్రులు, శ్రేయోభిలాషులు, ప్రజలందరికీ ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.
తాజా వార్తలు
- ఇరాన్‌తో తాత్కాలిక ఒప్పందం పొడిగింపుపై ఆసక్తి లేదు: ట్రంప్
- డిగ్రీ విద్యార్థులకు ఎస్బీఐ ప్రత్యేక స్కాలర్షిప్
- భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా NATS వినూత్న కార్యక్రమం
- వికసిత భారత్ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర–పూర్వ ఉపరాష్ట్రపతి పిలుపు
- దుబాయ్ ఎయిర్‌పోర్టులో ఉబర్, కరీమ్ ప్రయాణికుల కోసం ప్రత్యేక వెయిటింగ్ లాంజ్
- తెలంగాణలో సర్ ముసాయిదా విడుదల..
- తమిళనాడులో విజయ్ 100రోజుల పాలన పూర్తి..
- 2026 తొలి ఆరు నెలల్లో షేక్ జాయెద్ గ్రాండ్ మసీదుకు 31.27 లక్షల మంది సందర్శకులు
- జెడ్డాలో ఘనంగా భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్‌తో ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ భేటీ







