స్పెషలైజ్డ్ వింగ్స్ హెచ్‌ఓడీలతో డీజీపీ సి.వి.ఆనంద్

- August 20, 2026 , by Maagulf
స్పెషలైజ్డ్ వింగ్స్ హెచ్‌ఓడీలతో డీజీపీ సి.వి.ఆనంద్

హైదరాబాద్: సైబర్ క్రైమ్, మాదక ద్రవ్యాలు, ఆహార కల్తీ, ట్రాఫిక్ తదితర సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ పోలీస్ శాఖలోని స్పెషలైజ్డ్ వింగ్స్‌ను మరింత బలోపేతం చేశారు. ఇప్పటికే ఉన్న ప్రత్యేక విభాగాలను బలోపేతం చేయడంతో పాటు, కొత్తగా ఏర్పాటు కానున్న విభాగాలకు సిబ్బందిని కేటాయించే ప్రక్రియ రెండు నెలల అనంతరం పూర్తయింది.

ఆక్టోపస్, గ్రేహౌండ్స్, ఎస్‌ఐబీ నుంచి ఎంపికైన 513 మంది సిబ్బంది తెలంగాణ పోలీస్ అకాడమీ (TGPA)లో రిఫ్రెషర్ శిక్షణ పూర్తి చేశారు. దీంతో పాటు వారు విధులు నిర్వర్తించనున్న ప్రత్యేక విభాగాలకు సంబంధించిన అంశాల్లోనూ ప్రత్యేక శిక్షణ పొందారు. దీంతో కొత్త బాధ్యతలు చేపట్టేందుకు వారు పూర్తి సంసిద్ధతతో ఉన్నారని పోలీస్ శాఖ తెలిపింది.

ఈ నేపథ్యంలో గురువారం TGPAలో స్పెషలైజ్డ్ వింగ్స్ హెచ్‌ఓడీలతో డీజీపీ సి.వి.ఆనంద్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రత్యేక విభాగాలకు సిబ్బంది కేటాయింపును ఆయన సమీక్షించారు.

వివిధ విభాగాలకు కేటాయింపు
మొత్తం 513 మంది సిబ్బందిని వివిధ విభాగాలకు కేటాయించారు. ఇందులో TG-SAFEకు 80 మంది, V&Eకు 79 మంది, CIDకు 25 మంది, CSBకు 25 మంది, ACBకు 25 మంది, TG-SPARKకు 27 మంది, సివిల్ సప్లైస్‌కు 28 మంది కేటాయించారు.

అలాగే త్వరలో ఏర్పాటు కానున్న ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరోలకు 224 మంది సిబ్బందిని కేటాయించారు.

ఈ సందర్భంగా సిబ్బందితో మాట్లాడిన డీజీపీ సి.వి.ఆనంద్.. కొత్త బాధ్యతలకు త్వరగా అలవాటు పడాలని సూచించారు. నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు.

కొత్తగా కేటాయించిన సిబ్బంది ఈ శుక్రవారం నుంచి తమకు కేటాయించిన ప్రత్యేక విభాగాల్లో విధుల్లో చేరనున్నారు. తాజా సిబ్బంది కేటాయింపుతో తెలంగాణలో ప్రత్యేక నేరాలు, ప్రజా భద్రత, ట్రాఫిక్ నిర్వహణ వంటి కీలక రంగాల్లో పోలీస్ శాఖ సామర్థ్యం మరింత పెరగనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com