ఖతార్‌లో పాఠశాలల పునఃప్రారంభానికి సర్వం సిద్ధం..!!
- August 30, 2026
దోహా: 2026–27 విద్యా సంవత్సరానికి ఖతార్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆగస్టు 30 నుంచి దేశవ్యాప్తంగా విద్యార్థులు తిరిగి తరగతి గదుల్లోకి అడుగుపెట్టనున్నారు. ఈ విద్యా సంవత్సరంలో సుమారు 4,19,373 మంది విద్యార్థులు 649 పాఠశాలలు, కిండర్‌గార్టెన్లలో విద్యను కొనసాగించనున్నారు. విద్యా సంస్థలు, పాఠ్య ప్రణాళికలు, రవాణా సదుపాయాలు, రహదారి భద్రత, ఆరోగ్య సేవలు, విద్యార్థుల సంక్షేమం తదితర అంశాలపై ప్రభుత్వం, సంబంధిత శాఖలు వేసవి కాలం నుంచే విస్తృత ఏర్పాట్లు చేపట్టాయి. కొత్త విద్యా సంవత్సరానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని విద్యాశాఖ వెల్లడించింది.
ఈ ఏడాది ఆరు కొత్త ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. దీంతో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో విద్యార్థుల కోసం మరింత సామర్థ్యం అందుబాటులోకి రానుంది. కొత్త విద్యా సంవత్సరాన్ని పురస్కరించుకుని విద్యాశాఖ ‘బ్యాక్ టు స్కూల్ 2026–27’ ప్రచార కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. ఇందులో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాలల నిర్వాహకులను లక్ష్యంగా చేసుకుని పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొత్తగా మొదటి తరగతిలో చేరుతున్న సుమారు 10,700 మంది విద్యార్థులకు పాఠశాల వాతావరణానికి అలవాటు పడేందుకు ‘ఫస్ట్ స్టెప్’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.
పటిష్టమైన భద్రత
విద్యార్థుల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని పాఠశాలల పరిసరాల్లో రహదారి భద్రతా చర్యలను కూడా పూర్తి చేశారు. పబ్లిక్ వర్క్స్ అథారిటీ (అష్ఘాల్) ప్రకారం, దేశవ్యాప్తంగా 674 పాఠశాలల పరిసరాల్లో ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తయ్యాయి. 2013లో ప్రారంభమైన స్కూల్ జోన్ ట్రాఫిక్ సేఫ్టీ ప్రోగ్రామ్ కింద ఇప్పటివరకు 675 పాఠశాలల పరిసరాలను పరిశీలించి అవసరమైన మార్పులు చేపట్టారు. పాఠశాలల వద్ద గంటకు 30 కిలోమీటర్ల వేగ పరిమితి, స్పీడ్ హంప్స్, కొత్త రహదారి మార్కింగ్స్, పాదచారుల క్రాసింగ్‌లు, రెడ్ రోడ్ సర్ఫేసింగ్, విస్తృత ఫుట్‌పాత్‌లు, రక్షణ బారియర్లు ఏర్పాటు చేశారు. దివ్యాంగ విద్యార్థుల కోసం ప్రత్యేక ర్యాంపులు కూడా అందుబాటులోకి తెచ్చారు.
విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
విద్యా సంవత్సరం ప్రారంభాన్ని పురస్కరించుకుని ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సంస్థ (PHCC) ‘హెల్తీ బాడీస్ బిల్డ్ స్ట్రాంగ్ నేషన్స్’ అనే నినాదంతో బ్యాక్-టు-స్కూల్ ఆరోగ్య ప్రచారాన్ని ఆగస్టు 30 నుంచి ప్రారంభించనుంది. సెప్టెంబర్ 10 వరకు జరిగే ఈ కార్యక్రమంలో ఆరోగ్యకరమైన నిద్ర, అధిక స్క్రీన్ టైమ్ తగ్గించడం, తగినంత నీరు తాగడం, పోషకాహారం, శారీరక వ్యాయామం, మానసిక ఆరోగ్యం, భావోద్వేగ సమతుల్యత, పాఠశాలలో సానుకూల సామాజిక ప్రవర్తన వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు.
పిల్లల స్కూల్ లంచ్ బాక్స్‌ల విషయంలోనూ కుటుంబాలకు మున్సిపాలిటీ శాఖ పలు సూచనలు చేసింది. భోజనాన్ని ముందురోజు రాత్రి కాకుండా ఉదయమే సిద్ధం చేయాలని, శుభ్రమైన, సురక్షితమైన లంచ్ బాక్స్‌లను ఉపయోగించాలని సూచించింది. ఖతార్‌లోని అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే ఆహార పదార్థాలను ఎంచుకోవాలని తెలిపింది.పండ్లు, కూరగాయలు, ప్రోటీన్ పదార్థాలు, సంపూర్ణ ధాన్యాలతో సమతుల్య ఆహారం అందించాలని, పిల్లల అవసరానికి తగిన పరిమాణంలో ఆహారం పెట్టాలని సూచించింది. పునర్వినియోగ నీటి బాటిళ్లను ఉపయోగించాలని కూడా కోరింది.
‘వాక్ యువర్ కిడ్స్ టు స్కూల్’ ప్రచారం
పిల్లలతో తల్లిదండ్రుల అనుబంధాన్ని పెంచే లక్ష్యంతో సామాజిక అభివృద్ధి, కుటుంబ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ‘వాక్ యువర్ కిడ్స్ టు స్కూల్’ ప్రచారాన్ని ప్రారంభించింది. పాఠశాలకు వెళ్లే ప్రయాణాన్ని పిల్లలతో మాట్లాడేందుకు, వారి అభిప్రాయాలను తెలుసుకునేందుకు తల్లిదండ్రులు ఉపయోగించుకోవాలని ఈ కార్యక్రమం సూచిస్తోంది. అదే విధంగా ఖతార్ నేషనల్ లైబ్రరీ ‘రెడీ ఫర్ స్కూల్’ వర్క్‌షాప్‌లను నిర్వహిస్తోంది. పిల్లల సామాజిక, భావోద్వేగ సిద్ధత, స్వతంత్రంగా నేర్చుకునే నైపుణ్యాలు, పిల్లల తొలి ఉపాధ్యాయులుగా తల్లిదండ్రుల పాత్ర వంటి అంశాలపై ఈ కార్యక్రమాల్లో అవగాహన కల్పిస్తున్నారు. వేసవి సెలవుల అనంతరం ఇకపై దేశవ్యాప్తంగా మళ్లీ తెల్లవారుజామునే ప్రారంభమయ్యే స్కూల్ ప్రయాణాలు, తరగతులు, హోంవర్క్, పాఠశాల కార్యకలాపాలతో ఖతార్‌లో విద్యార్థుల దైనందిన జీవనం సందడిగా మారనుంది.
తాజా వార్తలు
- గ్రీన్ కార్డు కోసం 10 లక్షల మంది ఇండియన్ల ఎదురుచూపులు
- నేపాల్‌లో జలప్రళయం..675కి చేరిన మృతుల సంఖ్య
- ఖతార్‌లో పాఠశాలల పునఃప్రారంభానికి సర్వం సిద్ధం..!!
- మహ్బౌలాలో పోలీసుల తనిఖీలు.. 221 మంది అరెస్ట్..!!
- యూఏఈ లాటరీలో ఒకరికి Dh1 లక్ష జాక్‌పాట్..!!
- సౌదీ బార్డర్ దాటేందుకు ప్రయత్నించిన 1,450 మంది అరెస్ట్..!!
- ఐసీఆర్ఎఫ్ సమ్మర్ డ్రైవ్.. 4500 మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ప్రమాదంలో భారతీయుడికి గాయాలు.. ఎయిర్ అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలింపు..!!
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు







