యూఏఈలో త్వరలో స్టార్‌లింక్.. ముందస్తు బుకింగ్ ఎలాగంటే?
- August 30, 2026
షార్జా: యూఏఈలో శాటిలైట్ ఆధారిత హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ సంస్థకు యూఏఈలో సేవలు అందించేందుకు 10 ఏళ్ల లైసెన్స్ లభించింది. దీంతో యూఏఈ నివాసితులు స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలను ముందస్తుగా ప్రీ-ఆర్డర్ చేసుకునే అవకాశం కల్పించారు.
యూఏఈ టెలికమ్యూనికేషన్స్ అండ్ డిజిటల్ గవర్నమెంట్ రెగ్యులేటరీ అథారిటీ (TDRA) స్టార్‌లింక్‌కు జనరల్ శాటిలైట్ సర్వీసెస్ లైసెన్స్ మంజూరు చేసింది. దీని ద్వారా వ్యక్తులు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ సంస్థలతో పాటు సముద్ర, విమానయాన రంగాలకు శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించవచ్చు.
నెలకు Dh300.. అపరిమిత డేటా
యూఏఈలో రెసిడెన్షియల్ స్టార్‌లింక్ ప్లాన్ ధర నెలకు Dh300గా ఉంది. ఇందులో అపరిమిత డేటాతో పాటు 30 రోజుల ట్రయల్ సదుపాయం ఉంటుంది.
స్టార్‌లింక్ హార్డ్‌వేర్ ధర Dh1,465 నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో Wi-Fi 6తో కూడిన Router 3 ఉంటుంది.
ప్రీ-ఆర్డర్ సమయంలో Dh300 డిపాజిట్ కూడా చెల్లించాలి. ఈ మొత్తాన్ని తర్వాత స్టార్‌లింక్ కిట్ ధరలో నుంచి మినహాయిస్తారు.
స్టార్‌లింక్ సేవ ద్వారా 400 Mbpsకు పైగా వేగం అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
2024లో తొలిసారి అనుమతి
స్టార్‌లింక్‌కు యూఏఈలో లైసెన్స్ లభించడం ఇదే మొదటిసారి కాదు. 2024లో సంస్థకు కేవలం మారిటైమ్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు అనుమతి లభించింది. తాజా లైసెన్స్‌తో సేవలను మరింత విస్తృతంగా అందించే అవకాశం ఏర్పడింది.
స్టార్‌లింక్‌ను ఎలా ప్రీ-ఆర్డర్ చేయాలి?
యూఏఈ నివాసితులు స్టార్‌లింక్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా సేవలను ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు.
ప్రీ-ఆర్డర్ ప్రక్రియ:
1. స్టార్‌లింక్ అధికారిక యూఏఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ‘Get started’పై క్లిక్ చేయాలి.
2. మీ ప్రాంతాన్ని ఎంచుకుని సేవ అందుబాటులో ఉందో లేదో చెక్ చేయాలి.
3. ప్రీ-ఆర్డర్ పేజీకి వెళ్లిన తర్వాత సర్వీస్, హార్డ్‌వేర్ వివరాలను పరిశీలించి ‘Checkout’పై క్లిక్ చేయాలి.
4. అనంతరం వ్యక్తిగత వివరాలు, షిప్పింగ్ చిరునామా, చెల్లింపు వివరాలను నమోదు చేయాలి.
5. స్క్రీన్ కుడివైపున చార్జీల పూర్తి వివరాలు కనిపిస్తాయి. ప్రస్తుతం చెక్‌అవుట్ సమయంలో Dh285.71 డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందని సమాచారం.
సేవలు ఎప్పుడు ప్రారంభమవుతాయంటే..
స్టార్‌లింక్ ప్రకారం.. యూఏఈలో సేవలు పూర్తిస్థాయిలో ఎప్పుడు అందుబాటులోకి వస్తాయనే దానిపై ప్రస్తుతం ఖచ్చితమైన సమయాన్ని ప్రకటించలేదు. మరింత సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి తమ బృందాలు పనిచేస్తున్నాయని సంస్థ తెలిపింది.
అందువల్ల ప్రీ-ఆర్డర్ చేసుకున్న వెంటనే సేవలు ప్రారంభమవుతాయని భావించకుండా, అధికారికంగా సర్వీస్ యాక్టివేషన్ తేదీ ప్రకటించే వరకు వేచి చూడాల్సి ఉంటుందని TDRA అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







