ఖతార్‌లో వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫోరం 2026..!!
- August 30, 2026
దోహా: 9వ వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫోరం (WIF) 2026 నిర్వహణకు ఖతార్ సిద్ధమవుతోంది. ఇది అక్టోబర్ 25 నుంచి 27 వరకు దోహాలో జరగనుంది. ఐక్యరాజ్యసమితికి చెందిన UN ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ (UNCTAD) ఆధ్వర్యంలో మూడు రోజులపాటు ఈ సదస్సును నిర్వహించనున్నారు. ‘Investing in the Future’ అనే థీమ్‌తో జరిగే ఈ ఫోరంలో పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు.
వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫోరంలో ఏఐ, మౌలిక వసతులు, ఇంధనం, కీలక ఖనిజాలు, సస్టైనబుల్ ఫైనాన్స్, పర్యాటకం, సంస్కృతి, అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ వంటి రంగాల్లో పెట్టుబడి అవకాశాలపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. పెట్టుబడి విధానాలు, ఆర్థిక వృద్ధికి దోహదపడే కీలక రంగాలు, భవిష్యత్ పెట్టుబడి వ్యూహాలపై ప్రత్యేక సెషన్లు నిర్వహించనున్నారు.
UNCTAD ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం.. WIF 2026లో గ్లోబల్ లీడర్స్ ప్లీనరీలు, పెట్టుబడులు–వ్యవస్థాపకతపై మంత్రుల రౌండ్‌టేబుల్ సమావేశాలు, సస్టైనబుల్ స్టాక్ ఎక్స్ఛేంజెస్ డైలాగ్, గల్ఫ్ ప్రాంతంలో పెట్టుబడులపై ఉన్నతస్థాయి సమావేశం, అంతర్జాతీయ పెట్టుబడి ప్రోత్సాహక సదస్సు వంటి కార్యక్రమాలు జరగనున్నాయి. ఇప్పటికే సుమారు 20 మంది ప్రభుత్వ మంత్రులు, 20 మంది అంతర్జాతీయ సంస్థల అధిపతులు ఈ ఫోరంలో పాల్గొనేందుకు అంగీకరించినట్లు UNCTAD వెల్లడించింది.
అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ITU) సెక్రటరీ జనరల్ AI ట్రాక్‌కు సహ-అధ్యక్షత వహించనున్నారు. అలాగే UN టూరిజం సెక్రటరీ జనరల్ పర్యాటక పెట్టుబడుల సెషన్‌కు సహ-నాయకత్వం వహించనున్నారు.
ఖతార్ కీలక భాగస్వామిగా..
UNCTAD డైరెక్టర్ (డివిజన్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎంటర్ప్రైజ్) నాన్ లీ కాలిన్స్ మాట్లాడుతూ.. దోహాను ప్రధాన ప్రాంతీయ, అంతర్జాతీయ పెట్టుబడి కేంద్రంగా నిలబెట్టడంలో Invest Qatar కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ఖతార్ నుంచి ఇతర దేశాలకు పెట్టుబడులను ప్రోత్సహించడంలో ఈ సంస్థ కీలకంగా వ్యవహరిస్తోందని చెప్పారు. ప్రపంచంలోని ప్రముఖ సావరిన్ వెల్త్ ఫండ్లలో ఒకటైన Qatar Investment Authority (QIA) WIF 2026కు ప్రధాన భాగస్వామిగా వ్యవహరిస్తోందని ఆమె తెలిపారు.
ఇంధన భద్రత, ఇంధన మార్పిడి, వాతావరణ ఆర్థిక సహాయం వంటి ప్రధాన అంశాలతో పాటు ప్రత్యేక విభాగాల కోసం 15కు పైగా ఖతార్ సంస్థలతో భాగస్వామ్యం ఏర్పరచుకున్నట్లు UNCTAD వెల్లడించింది.
2025లో ప్రపంచ FDI 6 శాతం పెరుగుదల
WIF 2026లో World Investment Report 2026 తాజా నివేదికలోని అంశాలను కూడా చర్చించనున్నారు.
నివేదిక ప్రకారం.. 2025లో ప్రపంచ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) 6 శాతం పెరిగి 1.6 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అయితే ఈ వృద్ధి అన్ని దేశాలకు సమానంగా అందలేదు. అభివృద్ధి చెందిన దేశాల్లో FDI ప్రవాహాలు 11 శాతం పెరగగా, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కేవలం 2 శాతం మాత్రమే పెరిగాయి.
ప్రపంచ FDIలో 80 శాతానికి పైగా కేవలం 20 అతిపెద్ద పెట్టుబడి స్వీకర్త దేశాలకు వెళ్లినట్లు నివేదిక పేర్కొంది. అలాగే 2025లో ప్రపంచ గ్రీన్‌ఫీల్డ్ పెట్టుబడి ప్రాజెక్టుల విలువలో 44 శాతం కొన్ని వ్యూహాత్మక పరిశ్రమలకే దక్కింది. 2020లో ఈ వాటా 16 శాతంగా ఉండేది.
UNCTAD ఇన్వెస్ట్మెంట్ పాలసీ అండ్ అగ్రిమెంట్స్ లీగల్ ఆఫీసర్ విన్సెంట్ బేయర్ మాట్లాడుతూ.. గల్ఫ్ సహకార మండలి (GCC) ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. 2024 నుంచి 2025 మధ్య ఖతార్ నమోదు చేసిన పెట్టుబడి వృద్ధి ఆకట్టుకునేలా ఉందని, ప్రస్తుతం అమలు చేస్తున్న విధానాలు భవిష్యత్తుపై ఆశలు పెంచుతున్నాయని చెప్పారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను మరింతగా ఆకర్షించే సామర్థ్యం ఖతార్‌కు ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, సరఫరా గొలుసుల్లో మార్పులు, ఆర్థిక విభజన, సాంకేతిక రంగంలో వేగవంతమైన మార్పుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడుల ప్రవాహాలు మారుతున్నాయి. ఈ పరిస్థితుల్లో WIF 2026 ప్రపంచ పెట్టుబడి వ్యవస్థను పునరాలోచించేందుకు కీలక వేదికగా నిలవనుంది. వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలకు పెట్టుబడులు మరింత విస్తృతంగా అందేలా చేయడం, స్థిరమైన దీర్ఘకాలిక అభివృద్ధికి పెట్టుబడులను ఉపయోగించుకోవడం ఈ ఫోరం ప్రధాన లక్ష్యాల్లో ఒకటిగా ఉండనుంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం
- యూఏఈలో త్వరలో స్టార్‌లింక్.. ముందస్తు బుకింగ్ ఎలాగంటే?
- ఖతార్‌లో వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫోరం 2026..!!
- బహ్రెయిన్‌లోని రిఫాలో ట్రాఫిక్ రద్దీకి చెక్..!!
- గల్ఫ్ పౌరుడి హత్య కేసులో బంగ్లాదేశీయుడు అరెస్ట్..!!
- సౌదీలో ఉరుములు.. భారీ వర్షాలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ఒమన్ అక్రాస్ ఏజెస్ మ్యూజియంలో అరుదైన ఘనత..!!
- వరద ముంచుకొస్తున్న వేళ..1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన నేపాల్ పాఠశాల ప్రిన్సిపాల్
- దోహాలో ICBF ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
- నేపాల్-టిబెట్ వరదల్లో 750కు చేరిన మృతుల సంఖ్య.. 3,044 మంది గల్లంతు







