ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!

- September 03, 2026 , by Maagulf
ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!

దోహా: ఖతార్‌లో ఆర్థిక సాంకేతిక రంగం (ఫిన్‌టెక్) వేగంగా విస్తరిస్తోంది. డిజిటల్ సేవల వినియోగం పెరగడం, బలమైన సాంకేతిక మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ నియంత్రణ సంస్థల ప్రోత్సాహక విధానాలు ఈ రంగం వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.

పరిశోధన, కన్సల్టెన్సీ సంస్థ IMARC తాజా నివేదిక ప్రకారం..  ఖతార్ ఫిన్‌టెక్ మార్కెట్ 2034 నాటికి 2.07 బిలియన్ డాలర్లు (సుమారు QR7.55 బిలియన్లు) చేరనుంది. 2026 నుంచి 2034 మధ్య ఈ మార్కెట్ సగటున సంవత్సరానికి(CAGR) 15.96 శాతంతో వృద్ధి చెందుతుందని అంచనా వేసింది.

గత ఏడాది ఖతార్ ఫిన్‌టెక్ రంగం విలువ 526.6 మిలియన్ డాలర్లు (సుమారు QR1.9 బిలియన్లు)గా నమోదైంది. మొబైల్ వాలెట్లు, కాంటాక్ట్‌లెస్ చెల్లింపులు, బ్లాక్‌చైన్ టెక్నాలజీ, ఓపెన్ బ్యాంకింగ్, ఇస్లామిక్ ఫిన్‌టెక్‌కు సంబంధించి స్పష్టమైన నియంత్రణ విధానాలు ఈ రంగం వేగవంతమైన అభివృద్ధికి దోహదపడుతున్నాయని పరిశోధకులు తెలిపారు.

నగదు నుంచి డిజిటల్ చెల్లింపుల వైపు..

ఖతార్‌లో వినియోగదారులు సౌకర్యవంతమైన చెల్లింపు పద్ధతులకు ప్రాధాన్యం ఇవ్వడంతో డిజిటల్ పేమెంట్ల వినియోగం గణనీయంగా పెరుగుతోంది. చెల్లింపు మౌలిక సదుపాయాలపై కొనసాగుతున్న పెట్టుబడులు కూడా ఈ మార్పును వేగవంతం చేస్తున్నాయి. 2024 మార్చి నెలలోనే పాయింట్ ఆఫ్ సేల్ (POS) లావాదేవీలు 3.2 కోట్లను అధిగమించడం నగదు ఆధారిత చెల్లింపుల నుంచి డిజిటల్ విధానాల వైపు ప్రజలు వేగంగా మారుతున్నారనడానికి నిదర్శనమని నివేదిక పేర్కొంది. QR కోడ్ ఆధారిత చెల్లింపులు, ఈ-వాలెట్లు, తక్షణ నగదు బదిలీ వ్యవస్థలు సంప్రదాయ కార్డు చెల్లింపులకు ప్రత్యామ్నాయంగా వేగంగా విస్తరిస్తున్నాయి. దేశవ్యాప్తంగా రిటైల్ దుకాణాలు, రవాణా సేవలు, చిన్న వ్యాపార సంస్థలు కాంటాక్ట్‌లెస్ చెక్‌అవుట్ విధానాలను స్వీకరిస్తున్నాయి.

స్టార్టప్‌లకు ప్రోత్సాహం

ఖతార్‌లో ఫిన్‌టెక్ వ్యవస్థ అభివృద్ధిలో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఖతార్ ఫిన్ టెక్ హబ్ (Qatar FinTech Hub), ఖతార్ సెంట్రల్ బ్యాంక్ ఏర్పాటు చేసిన రెగ్యులేటరీ శాండ్‌బాక్స్‌లు, సులభతర లైసెన్సింగ్ విధానాలు కొత్త ఫిన్‌టెక్ స్టార్టప్‌లకు రంగంలోకి ప్రవేశించడం మరింత సులభం చేస్తున్నాయి.

రిటైల్ చెల్లింపులతో పాటు చిన్న, మధ్యతరహా సంస్థల (SMEs) అభివృద్ధికి కూడా ఖతార్ ఫిన్‌టెక్‌ను విస్తృతంగా వినియోగిస్తోంది. ప్రభుత్వ సంస్థలు ఫిన్‌టెక్ సేవల సంస్థలతో కలిసి ప్రత్యేక కమర్షియల్ వాలెట్లు, భారీ స్థాయి చెల్లింపు వ్యవస్థలు, సులభమైన ఖాతా నిర్వహణ సేవలను వ్యాపారాలకు అందిస్తున్నాయి.

డిజిటల్ చెల్లింపు మౌలిక సదుపాయాల అభివృద్ధి, నియంత్రణ సంస్థల మద్దతు కారణంగా గతంలో ఆర్థిక సేవలను పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొన్న చిన్న సంస్థలకు కూడా ఫిన్‌టెక్ సేవలు చేరువవుతున్నాయని నివేదిక తెలిపింది.

బలమైన నియంత్రణ వ్యవస్థ

ఖతార్ సెంట్రల్ బ్యాంక్ 2024 డిసెంబర్‌లో డిజిటల్ బ్యాంక్స్ రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ ను విడుదల చేసింది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు, మొబైల్ యాప్‌ల ద్వారా పూర్తి స్థాయి ఆర్థిక సేవలు అందించే డిజిటల్ బ్యాంకుల అభివృద్ధిని ప్రోత్సహించడమే దీని లక్ష్యమని నివేదిక పేర్కొంది. ఈ నియంత్రణ వ్యవస్థ ద్వారా భద్రత, ఆర్థిక సమగ్రతకు ఉన్నత ప్రమాణాలను ఏర్పాటు చేయడంతో పాటు రియల్‌టైమ్ పేమెంట్లు, ఎంబెడెడ్ ఫైనాన్స్, తదుపరి తరం డిజిటల్ వాలెట్లు వంటి ఆధునిక ఆర్థిక సేవలకు మార్గం సుగమం కానుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com