రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!

- September 03, 2026 , by Maagulf
రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!

కువైట్: వాడేసిన టైర్ల నుంచి సేకరించిన రబ్బరును రహదారుల నిర్మాణంలో వినియోగించే సాంకేతికతను విస్తృత స్థాయిలో అమలు చేసేందుకు కువైట్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ (KISR) ప్రభుత్వ అనుమతి కోరింది. సంవత్సరాలుగా నిర్వహిస్తున్న పరీక్షల్లో సానుకూల ఫలితాలు రావడంతో ఈ సాంకేతికతను దేశవ్యాప్తంగా రహదారుల నిర్మాణం, నిర్వహణలో ఉపయోగించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

ఇప్పటికే KISR, పబ్లిక్ వర్క్స్ మంత్రిత్వ శాఖ (MPW) మరియు పబ్లిక్ అథారిటీ ఫర్ ఇండస్ట్రీ (PAI)కి పలు సిఫారసులు సమర్పించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న రహదారి నిర్మాణ నిబంధనల్లో రీసైకిల్ పదార్థాల వినియోగానికి అనుమతి లేకపోవడంతో, ఆయా ప్రమాణాలను సవరించాలని కోరింది.

2019 నుంచి పరిశోధనలు

కువైట్‌లోని తీవ్ర వేసవి వాతావరణ పరిస్థితుల్లో రహదారుల పనితీరును మెరుగుపరచడంతో పాటు భారీగా పేరుకుపోతున్న పాత టైర్లకు వినియోగం కల్పించడమే లక్ష్యంగా KISR పరిశోధనలు చేపట్టింది. సల్మీ ప్రాంతంలో పర్యావరణ సంస్థ కేటాయించిన టైర్ల నిల్వ ప్రదేశంలో 4,000 చదరపు మీటర్లకు పైగా విస్తీర్ణంలో వేలాది పాత టైర్లు పేరుకుపోయి ఉన్నాయి. వీటిని వ్యర్థాలుగా పారవేయకుండా రహదారుల నిర్మాణంలో ఉపయోగించడం ద్వారా పర్యావరణానికి, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రయోజనం కలుగుతుందని పరిశోధకులు భావిస్తున్నారు.

KISR అసోసియేట్ రీసెర్చర్ హయా అల్-ముతైరి మాట్లాడుతూ.. వ్యర్థంగా భావించే పదార్థాన్ని ఉపయోగించడం ద్వారా పర్యావరణానికి ప్రయోజనం చేకూరడంతో పాటు రహదారుల మన్నికను కూడా మెరుగుపరచవచ్చని తెలిపారు. రెండు లేన్లతో కూడిన ఒక కిలోమీటరు రహదారి నిర్మాణానికి వందలాది పాత టైర్లను ఉపయోగించే అవకాశం ఉందని అల్-ముతైరి తెలిపారు.

పాత టైర్లను మెత్తగా పొడిగా చేసి, అధిక ఉష్ణోగ్రత వద్ద బిటుమెన్‌లో కలుపుతారు. అనంతరం ఈ ద్రవ మిశ్రమాన్ని రాళ్లు, ఇసుకతో కలిపి ఆస్ఫాల్ట్ తయారు చేస్తారు. రహదారిలో పదార్థాలను అతికించే ‘గ్లూ’లా పనిచేసే బిటుమెన్‌కు రీసైకిల్ రబ్బరు మరింత గట్టితనాన్ని కల్పిస్తుంది. దీంతో కువైట్‌లోని తీవ్రమైన వేసవి వేడి కారణంగా రహదారులు కరగడం లేదా ఆకారం మారడం వంటి సమస్యలను తగ్గించవచ్చని పరిశోధకులు తెలిపారు. KISR బృందం బిటుమెన్‌లోని 12.5 శాతం భాగాన్ని రీసైకిల్ రబ్బరుతో భర్తీ చేయడంలో విజయవంతమైంది. దీనిని ప్రపంచ స్థాయి ఫలితంగా అల్-ముతైరి అభివర్ణించారు.

పలు రహదారులపై పరీక్షలు

స్థానికంగా సేకరించిన పాత టైర్ల రబ్బరును ఉపయోగించిన తొలి రహదారుల్లో అల్-మంసూరియా, అల్-ఖాద్సియా మధ్య ఖాలెద్ అల్-మర్జూక్ స్ట్రీట్ ఒకటి. 2023 జనవరిలో రోడ్ 106పై కూడా KISR ఈ సాంకేతికతతో పనులు చేపట్టింది. 2024 మార్చిలో ఈ ప్రాజెక్టు పరిశోధన దశ నుంచి రహదారి నిర్వహణ స్థాయికి చేరింది. షువైఖ్‌లోని KISR క్యాంపస్‌లో రబ్బరుతో తయారైన ఆస్ఫాల్ట్‌ను రహదారి నిర్వహణ పనుల్లో ఉపయోగించారు.

ఇప్పటివరకు పరీక్షించిన రహదారుల ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. రబ్బరు మిశ్రమంలో పెద్ద సమస్యలు గుర్తించలేదని పేర్కొన్నారు. ఒక ప్రాంతంలో కనిపించిన స్వల్ప ఉపరితల సమస్య రబ్బరైజ్డ్ ఆస్ఫాల్ట్ వల్ల కాకుండా డ్రైనేజీ సమస్య కారణంగానే ఏర్పడిందని వెల్లడించారు.

ఖతార్ నమూనా అధ్యయనం

రబ్బరైజ్డ్ ఆస్ఫాల్ట్ వినియోగంలో ఎదురవుతున్న కొన్ని సవాళ్లను అధిగమించేందుకు KISR ఖతార్ విధానాలను కూడా అధ్యయనం చేసింది. కువైట్, ఖతార్‌లలో వాతావరణం, రహదారి పరిస్థితులు కొంతవరకు సమానంగా ఉండటంతో ఖతార్ సాంకేతిక ప్రమాణాలను పరిశోధనకు ప్రామాణికంగా ఉపయోగించారు.

ఖతార్‌లో బిటుమెన్‌ను మార్చడం, కలపడం కోసం కేంద్రీకృత విధానం ఉండగా, కువైట్‌లో ప్రతి ఆస్ఫాల్ట్ ప్లాంట్ తనదైన ప్రక్రియను అనుసరిస్తోంది. కేంద్రీకృత మిశ్రమ వ్యవస్థను ప్రవేశపెడితే రబ్బరు-బిటుమెన్ మిశ్రమంలో ఏకరూపత పెరిగి, రహదారి పనితీరు మరింత మెరుగుపడుతుందని పరిశోధకులు భావిస్తున్నారు.

నాణ్యత పరీక్షలకు డ్రోన్లు

రహదారి నిర్మాణ సమయంలో థర్మల్ ఇమేజింగ్ కెమెరాలతో కూడిన డ్రోన్లను కూడా KISR బృందం వినియోగిస్తోంది. ఆస్ఫాల్ట్ ఎంత వేగంగా చల్లబడుతుందో గుర్తించేందుకు ఈ సాంకేతికత ఉపయోగపడుతోంది. ఆస్ఫాల్ట్ చల్లబడకముందే దాన్ని సరైన రీతిలో కుదించాల్సి ఉంటుంది. రబ్బరైజ్డ్ ఆస్ఫాల్ట్ సాధారణ ఆస్ఫాల్ట్ కంటే కొంత వేగంగా చల్లబడుతుందని పరిశోధకులు గుర్తించారు. దీంతో పనులు నిర్వహించే కాంట్రాక్టర్లకు కుదింపు కోసం తక్కువ సమయం లభించే అవకాశం ఉంది. అయితే, వేగంగా చల్లబడటం వల్ల రహదారిని ప్రజల వినియోగానికి త్వరగా అందుబాటులోకి తీసుకురావచ్చని కూడా తెలిపారు.

తక్కువ కాలుష్యం.. దీర్ఘకాలంలో ఖర్చు ఆదా

పరిశోధనల్లో రబ్బరైజ్డ్ ఆస్ఫాల్ట్ సంప్రదాయ ఆస్ఫాల్ట్‌తో పోలిస్తే తక్కువ ఉద్గారాలను విడుదల చేస్తున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా కార్బన్ మోనాక్సైడ్ ఉద్గారాల్లో గణనీయమైన తగ్గుదల నమోదైనట్లు తెలిపారు. ప్రారంభంలో రబ్బరైజ్డ్ ఆస్ఫాల్ట్ తయారీ ఖర్చు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో రహదారి నిర్వహణ అవసరం తగ్గడం వల్ల ఖర్చు ఆదా అవుతుందని అల్-ముతైరి పేర్కొన్నారు.

టైర్ల నుంచి సరైన పరిమాణంలోని రబ్బరు కణాలను సిద్ధం చేయడం కూడా ప్రస్తుతం ఒక సవాలుగా ఉంది. అయినప్పటికీ, పర్యావరణహిత నిర్మాణ సాంకేతికతలపై కాంట్రాక్టర్ల నుంచి మంచి ఆసక్తి కనిపిస్తోందని ఆమె తెలిపారు. కొన్ని ప్రధాన రహదారి పునరుద్ధరణ ప్రాజెక్టుల్లో కాంట్రాక్టర్లు నిర్మాణ వ్యర్థాలను అక్కడికక్కడే రీసైకిల్ చేసి, సబ్‌బేస్ లేదా సబ్‌గ్రేడ్ పదార్థంగా ఉపయోగించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు వెల్లడించారు.

“ఈ సాంకేతికత వినియోగానికి మార్కెట్ సిద్ధంగా ఉంది. అయితే కొన్ని సందర్భాల్లో మార్గదర్శకాలు, ప్రమాణాలు, నిబంధనలే ఈ సాంకేతికతలను అమలు చేయడంలో అడ్డంకిగా మారుతున్నాయి” అని అల్-ముతైరి పేర్కొన్నారు.

రబ్బరైజ్డ్ ఆస్ఫాల్ట్‌తో పాటు పాత రహదారుల నుంచి తిరిగి సేకరించిన ఆస్ఫాల్ట్ పదార్థం ను కూడా కొత్త రహదారి నిర్మాణంలో వినియోగించేలా నిబంధనలను సవరించేందుకు KISR, కువైట్ ప్రభుత్వ సంస్థలతో చర్చలు కొనసాగిస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com