కువైట్ లో సబ్‌లీజింగ్‌.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!

- September 04, 2026 , by Maagulf
కువైట్ లో సబ్‌లీజింగ్‌.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!

కువైట్ సిటీ: అక్రమంగా లైసెన్స్‌ను ఇతరులకు సబ్‌లీజ్ ఇచ్చి, మూడో వ్యక్తుల ద్వారా క్లినిక్ నిర్వహిస్తున్నట్లు తనిఖీల్లో తేలడంతో ఒక ప్రైవేట్ ఆరోగ్య క్లినిక్ లైసెన్స్‌ను రద్దు చేస్తూ ఆరోగ్య మంత్రి డాక్టర్ అహ్మద్ అబ్దుల్‌వహాబ్ అల్-అవాధి ఉత్తర్వులు జారీ చేశారు.

ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన హెల్త్ లైసెన్సింగ్ విభాగం నిర్వహించిన తనిఖీలు, ఆడిట్‌లో క్లినిక్ లైసెన్స్‌కు సంబంధించిన నిబంధనల ఉల్లంఘన వెలుగులోకి వచ్చాయి. లైసెన్స్‌దారు సమర్పించిన పెట్టుబడి ఒప్పందాన్ని పరిశీలించగా, ఆ ఆరోగ్య కేంద్రాన్ని ఇతర వ్యక్తులు పెట్టుబడి పెట్టి నిర్వహిస్తున్నట్లు సూచించే ఏర్పాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇది 2024 మంత్రిత్వ తీర్మానం నం. 36లోని ఆర్టికల్ 15కు విరుద్ధమని అధికారులు తెలిపారు. ఈ నిబంధన ప్రకారం ఆరోగ్య సంస్థల లైసెన్స్‌లను సబ్‌లీజ్‌కు ఇవ్వడం లేదా మూడో వ్యక్తుల పెట్టుబడికి వినియోగించడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు.

అలాగే, 2020 చట్టం నం. 70లోని ఆర్టికల్ 63 ప్రకారం, ఆరోగ్య సంస్థ యజమాని లేదా నిర్వాహకుడు లైసెన్స్‌ను ఇతరులకు సబ్‌లీజ్ చేసినా లేదా మూడో వ్యక్తుల ద్వారా పెట్టుబడి పెట్టించినా సంబంధిత సంస్థ లైసెన్స్‌ను రద్దు చేసే అధికారం ఉందని మంత్రిత్వ శాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

ప్రైవేట్ ఆరోగ్య సంస్థలపై తనిఖీలు, పర్యవేక్షణను కొనసాగిస్తామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. నిబంధనలను ఉల్లంఘించే సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

పేషంట్ల హక్కులను పరిరక్షించడం, ఆరోగ్య సేవల భద్రత మరియు నాణ్యతను నిర్ధారించడం, అలాగే వైద్య రంగంలో వృత్తిపరమైన, చట్టపరమైన ప్రమాణాలను కాపాడటమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com