శ్వాస విధానం నిర్ణయాలపై ప్రభావం చూపుతుందా? ఆసక్తికర అధ్యయనం..!!
- September 06, 2026
దోహా: మనం ఎలా శ్వాస తీసుకుంటామన్నది కేవలం శరీరాన్ని రిలాక్స్ చేయడానికే పరిమితం కాదని ఓ కొత్త అధ్యయనం సూచిస్తోంది. నెమ్మదిగా, ముఖ్యంగా ఎక్కువసేపు శ్వాసను బయటకు వదిలే విధానం.. మనుషులు లాభనష్టాలను అంచనా వేసే తీరుపై, రిస్క్ తీసుకునే నిర్ణయాలపై కూడా ప్రభావం చూపవచ్చని పరిశోధకులు గుర్తించారు. జర్మన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ న్యూట్రిషన్ పట్స్‌డామ్-రెబ్రూక్ (DIfE), చారిటే – యూనివర్సిటేట్స్‌మెడిజిన్ బెర్లిన్ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ పరిశోధన ఫలితాలు‘Neuron’ అనే శాస్త్రీయ జర్నల్‌లో పబ్లిష్ చేశారు.
ఈ అధ్యయనంలో సగటున 25 ఏళ్ల వయసున్న 41 మంది పాల్గొన్నారు. వారికి డబ్బు గెలిచే లేదా కోల్పోయే అవకాశాలతో కూడిన పలు నిర్ణయాలు తీసుకునేలా చేశారు. ఈ సమయంలో వారి మెదడు కార్యకలాపాలను fMRI ద్వారా పరిశీలించారు.పాల్గొనేవారు రెండు రకాల శ్వాస విధానాలను అనుసరించారు. మొదట సహజమైన శ్వాస తీసుకునే విధానం, రెండోది 2 సెకన్ల పాటు శ్వాస లోపలికి తీసుకుని, 8 సెకన్ల పాటు నెమ్మదిగా బయటకు వదిలే విధానంలో డబ్బులకు సంబంధించిన నిర్ణయాలను పరిశీలించారు.
ఎక్కువసేపు శ్వాస బయటకు వదిలితే రిస్క్ ఎక్కువ?
ఎక్కువసేపు శ్వాసను బయటకు వదిలినప్పుడు పాల్గొనేవారు రిస్క్ ఉన్న ఎంపికలను ఎక్కువగా అంగీకరించినట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే దీనికి కారణం వారు నష్టాల గురించి తక్కువగా ఆలోచించడం కాదని అధ్యయనం చెబుతోంది. దానికి బదులుగా లాభాలు వారి నిర్ణయాలపై మరింత బలమైన ప్రభావం చూపినట్లు తేలింది. అంటే.. నష్ట భయం తగ్గడం కంటే, గెలిచే అవకాశం మరింత ఆకర్షణీయంగా అనిపించడం వల్ల రిస్క్ తీసుకునే ధోరణి పెరిగినట్లు పరిశోధకులు భావిస్తున్నారు.
గుండె-మెదడు మధ్య సంబంధం
పరిశోధకులు శ్వాసతో పాటు గుండె కార్యకలాపాలు, చర్మ స్పందన, కంటి పాపల కదలికలు, మెదడు కార్యకలాపాలను కూడా పరిశీలించారు.ఎక్కువసేపు శ్వాసను బయటకు వదిలే విధానం పారాసింపథటిక్ నర్వస్ సిస్టమ్ కార్యకలాపాలను పెంచింది. ఇది సాధారణంగా శరీరం ప్రశాంత స్థితిలో ఉన్నప్పుడు చురుకుగా ఉంటుంది. ఈ సమయంలో గుండె సంబంధిత పారాసింపథటిక్ మార్పులు ఎక్కువగా కనిపించిన వారిలో మెదడులోని వెంట్రోమీడియల్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ (vmPFC), ప్రీక్యూనియస్ ప్రాంతాల్లో రివార్డ్‌కు సంబంధించిన స్పందనలు కూడా బలంగా కనిపించాయి.
రిస్క్‌కు ప్రోత్సాహం కాదు
ఈ అధ్యయనాన్ని ఆధారంగా చేసుకుని నెమ్మదిగా శ్వాస తీసుకుంటే ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యంగా లేదా ఎక్కువ రిస్క్ తీసుకుంటారని చెప్పలేం అని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. కేవలం 41 మందితో, ప్రధానంగా యువకులపై ఈ ప్రయోగం నిర్వహించారు. అంతేకాకుండా ఇది నియంత్రిత పరిస్థితుల్లో డబ్బుకు సంబంధించిన ఒక ప్రత్యేక నిర్ణయ పరీక్ష మాత్రమే. అందువల్ల రోజువారీ జీవితంలోని నిర్ణయాలకు ఇదే ప్రభావం ఉంటుందా అనేది ఇంకా నిర్ధారించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. భవిష్యత్ పరిశోధనల్లో మరింత సమతుల్యమైన లాభ-నష్ట పరిస్థితులను ఉపయోగించి ఈ ప్రభావాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.మొత్తంగా చూస్తే.. శ్వాస విధానం మన శరీర స్థితినే కాకుండా, మన మెదడు లాభాలను ఎలా అంచనా వేస్తుందో కూడా ప్రభావితం చేసే అవకాశం ఉందని ఈ అధ్యయనం సూచిస్తోంది.
తాజా వార్తలు
- ప్రపంచ సుందరిగా జొహైరీ మోలా..
- వాట్సాప్‌లో అదిరిపోయే AI ఫీచర్..!
- సౌదీలో వారం రోజుల్లో 12,363 మంది నివాసితులపై బహిష్కరణ వేటు..!!
- కింగ్ ఫహద్ కాజ్‌వేపై బహ్రెయిన్–సౌదీ ట్యాక్సీలకు అనుమతి..!!
- శ్వాస విధానం నిర్ణయాలపై ప్రభావం చూపుతుందా? ఆసక్తికర అధ్యయనం..!!
- మస్కట్ విమానాశ్రయంలో ఒమానీ ప్రయాణికులే టాప్..!!
- కువైట్‌లో 48 శాతం తగ్గిన జువైనల్ క్రైమ్స్..!!
- యూఏఈ లాటరీ లక్కీ డే డ్రా ఫలితాలు.. ఇద్దరికి దక్కిన Dh100,000..!!
- సౌదీ అరేబియాకు చేరుకున్న విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- బహ్రెయిన్ రాజుతో యూఏఈ అధ్యక్షుడి భేటీ







