దుబాయ్ హోటల్ ధరలకు రెక్కలు..175 శాతం వరకు పెంపు..!!
- September 06, 2026
దుబాయ్: అంతర్జాతీయ ప్రదర్శనలు, సమావేశాలు, వ్యాపార కార్యక్రమాలతో సెప్టెంబర్ నెలలో దుబాయ్‌లో హోటల్ గదులకు డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో కొన్ని తేదీల్లో హోటల్ గదుల ధరలు భారీగా పెరిగాయి. కొన్ని హోటళ్లలో ధరలు ఏకంగా 175 శాతం వరకు పెరిగినట్లు తాజా వివరాలు వెల్లడించాయి.
నోవోటెల్ దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో గది ధర దిర్హామ్ 300 నుంచి దిర్హామ్ 825కు పెరిగింది. ఇది సుమారు 175 శాతం పెరుగుదలకు సమానం. అలాగే ఐబిస్ దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో గది ధర దిర్హామ్ 233 నుంచి దిర్హామ్ 618కు పెరిగి సుమారు 165 శాతం పెరుగుదల నమోదైంది. ఐబిస్ దుబాయ్ వన్ సెంట్రల్లో ధర దిర్హామ్ 200 నుంచి దిర్హామ్ 484కు చేరి దాదాపు 142 శాతం పెరిగింది. కోర్ట్‌యార్డ్ బై మారియట్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో కూడా గది ధరలు దిర్హామ్ 231 నుంచి దిర్హామ్ 558కు పెరిగాయి.
ఇతర హోటళ్లలోనూ పెరుగుదల
కొన్ని ఇతర హోటళ్లలో ధరల పెరుగుదల తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ.. జుమైరా లివింగ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో గది ధర దిర్హామ్ 669 నుంచి దిర్హామ్ 1,299కు చేరగా, ది హెచ్ దుబాయ్లో ధర దిర్హామ్ 501 నుంచి దిర్హామ్ 961కు పెరిగింది. పలు హోటళ్లలో గది ధరలు సుమారు దిర్హామ్ 600 నుంచి 900 దిర్హామ్‌లకు పైగా చేరినట్లు వెల్లడైంది. యావరేజీగా హోటల్ ప్రాపర్టీలలో సగటు రూమ్ ధర సుమారు దిర్హామ్ 372 నుంచి దిర్హామ్ 689కు పెరిగింది. ఇది దాదాపు 86 శాతం పెరుగుదలకు సమానం అని మార్కెట్ రంగ నిపుణులు తెలిపారు. అయితే ఈ ధరలు బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లో ప్రజలకు కనిపించే రేట్ల ఆధారంగా ఉన్నాయని, గది రకం, అందుబాటు, బుకింగ్ నిబంధనల ఆధారంగా ధరలు మారవచ్చని స్పష్టం చేశారు.
సెప్టెంబర్‌లో డిమాండ్
సాంప్రదాయంగా వేసవి కాలం ముగియడంతో సెప్టెంబర్‌లో హోటల్ ఆక్యుపెన్సీకి సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయని హోటల్ రంగ ప్రతినిధులు తెలిపారు. ఖమాస్ హాస్పిటాలిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రతీక్ కచ్రూ మాట్లాడుతూ.. ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్‌లో హోటల్ ఆక్యుపెన్సీకి ఇప్పటికే మెరుగైన సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు. దుబాయ్ పర్యాటకం, మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ కార్యక్రమాలపై నిరంతరం పెట్టుబడులు పెట్టడం వల్ల హోటల్ రంగంలో డిమాండ్ మరింత బలపడుతోందని ఆయన పేర్కొన్నారు.
భారీ అంతర్జాతీయ ఈవెంట్ల ప్రభావం
సెప్టెంబర్‌లో దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ ఎనర్జీ, AIM కాంగ్రెస్, ఇంటర్నేషనల్ ప్రాపర్టీ షో, దుబాయ్ డెర్మా, క్రిప్టో ఎక్స్‌పో దుబాయ్, అరేబియన్ ట్రావెల్ మార్కెట్, GISEC గ్లోబల్, సీమ్లెస్ మిడిల్ ఈస్ట్ వంటి పలు ప్రధాన అంతర్జాతీయ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాల్లో అనేకం దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో జరుగుతుండటంతో ట్రేడ్ సెంటర్, షేక్ జాయెద్ రోడ్, DIFC, డౌన్‌టౌన్ ప్రాంతాల్లోని హోటళ్లకు వేలాది మంది ఎగ్జిబిటర్లు, ప్రతినిధులు, వ్యాపార సందర్శకులు చేరుకునే అవకాశం ఉంది.
వేసవి కాలంలో సాధారణంగా హోటల్ గది ధరలు పీక్ టూరిజం సీజన్‌తో పోలిస్తే తక్కువగా ఉంటాయని హోటల్ రంగ ప్రతినిధులు తెలిపారు. IHG హోటల్స్ అండ్ రిసార్ట్స్‌కు చెందిన కమర్షియల్ విభాగం అధికారి తారెక్ లబీబ్ మాట్లాడుతూ.. వేసవిలో కూడా యూఏఈలో స్టేకేషన్లు, కుటుంబ ప్రయాణాలు, రిసార్ట్ అనుభవాల కారణంగా హోటల్ డిమాండ్ ఆరోగ్యకరంగా కొనసాగిందని పేర్కొన్నారు.
అయితే ప్రస్తుతం వేసవి ధరల నుంచి భారీ వ్యాపార కార్యక్రమాల సీజన్‌కు దుబాయ్ మారుతుండటంతో ప్రధాన ప్రదర్శన వేదికల సమీపంలోని హోటళ్లలో గది ధరల పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు తెలిపారు. సెప్టెంబర్ తర్వాత కూడా దుబాయ్‌లో పర్యాటక సీజన్ మరింత ఊపందుకునే అవకాశం ఉందని హోటల్ రంగం భావిస్తోంది. వింటర్ ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించే ప్రధాన నగరాల్లో దుబాయ్ ఒకటిగా కొనసాగుతుందని హోటల్ రంగ ప్రతినిధులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!
- దుబాయ్ హోటల్ ధరలకు రెక్కలు..175 శాతం వరకు పెంపు..!!
- ఒమన్ లో స్కూల్ బస్సు డ్రైవర్లకు పోలీసుల కీలక సూచనలు..!!
- బహ్రెయిన్‌లో మత బోధన, కార్యకలాపాలకు కొత్త నిబంధనలు..!!
- ప్రపంచ సుందరిగా జొహైరీ మోలా..
- వాట్సాప్‌లో అదిరిపోయే AI ఫీచర్..!
- సౌదీలో వారం రోజుల్లో 12,363 మంది నివాసితులపై బహిష్కరణ వేటు..!!
- కింగ్ ఫహద్ కాజ్‌వేపై బహ్రెయిన్–సౌదీ ట్యాక్సీలకు అనుమతి..!!







