తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష

- September 06, 2026 , by Maagulf
తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష

హైదరాబాద్: తెలంగాణలో కొత్త జాతీయ క్రిమినల్ చట్టాల అమలు, వాటికి సంబంధించిన వివిధ పోర్టల్స్ పనితీరుపై నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) డైరెక్టర్ అమిత్ గార్గ్ సమీక్ష నిర్వహించారు. డీజీపీ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన..సంబంధిత అధికారులతో కీలక అంశాల పై చర్చించారు.

కొత్త క్రిమినల్ చట్టాల అమలులో భాగంగా ICJS, న్యాయ శ్రుతి, న్యాయ సంహిత తదితర పోర్టల్స్ సమన్వయం, వాటి అమలులో ఎదురవుతున్న సమస్యలపై సమావేశంలో చర్చించారు. అలాగే న్యాయవ్యవస్థ, జైళ్లు, ప్రాసిక్యూషన్, ఫోరెన్సిక్ సంస్థలు వంటి కీలక భాగస్వామ్య విభాగాల పాత్రపైనా సమీక్ష జరిగింది.

కొత్త విధానాల అమలుకు అవసరమైన బడ్జెట్ కేటాయింపులు, ఢిల్లీ నుంచి అందాల్సిన సాంకేతిక మరియు ఇతర సహకారం వంటి అంశాలను కూడా అధికారులు చర్చించారు. తెలంగాణ పోలీసు వ్యవస్థను అధునాతన CCTNS 2.0కు మార్చే ప్రక్రియపై కూడా సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు.

ప్రస్తుతం తెలంగాణ 34వ ర్యాంక్‌లో ఉందని, రానున్న రోజుల్లో రాష్ట్రం మెరుగైన ర్యాంకింగ్ సాధించాలని డీజీపీ సి.వి.ఆనంద్ ఆశాభావం వ్యక్తం చేశారు. అవసరమైన మార్పులు, మెరుగుదలలు సాధించేలా సంబంధిత అధికారులతో తాను నిరంతరం సమీక్షిస్తూ, ఫాలోఅప్ చేస్తున్నట్లు డీజీపీ ఆనంద్ తెలిపారు.

కొత్త క్రిమినల్ చట్టాల సమర్థవంతమైన అమలు, వివిధ విభాగాల మధ్య మెరుగైన సమన్వయం, సాంకేతిక వ్యవస్థల ఆధునీకరణ ద్వారా తెలంగాణ పోలీసు వ్యవస్థ పనితీరును మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ సమీక్ష కొనసాగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com