ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి

- September 06, 2026 , by Maagulf
ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి

దోహా: బహిరంగ ప్రదేశాలకు వెళ్లే సమయంలో ఖతార్ పౌరులు, నివాసితులు తప్పనిసరిగా ఖతార్ ఐడీ (QID) వెంట ఉంచుకోవాలని ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MOI) సూచించింది. అలాగే పోలీసులమంటూ సాధారణ దుస్తుల్లో వచ్చేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, వారి గుర్తింపును నిర్ధారించుకున్న తర్వాతే వ్యక్తిగత సమాచారం ఇవ్వాలని హెచ్చరించింది.

అల్ ఫజా పోలీస్, సెంట్రల్ ఆపరేషన్స్ డిపార్ట్‌మెంట్ పాత్రపై నిర్వహించిన వెబినార్‌లో ఈ సూచనలు చేశారు. లెఫ్టినెంట్ అబ్దుల్రహ్మాన్ అబ్దుల్లా అల్ ముతావా మాట్లాడుతూ, చెల్లుబాటు అయ్యే QID లేదా దాని డిజిటల్ కాపీ వెంట ఉంచుకోవడం వల్ల ప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల్లో వ్యక్తుల గుర్తింపును అధికారులు త్వరగా నిర్ధారించేందుకు వీలవుతుందని తెలిపారు.

QID లేకపోతే వ్యక్తులను వేలిముద్రల ద్వారా గుర్తించే అవకాశం ఉందన్నారు. అయినప్పటికీ ఒక వ్యక్తి గుర్తింపును నిర్ధారించలేని పరిస్థితుల్లో అతడిని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CID)కు అప్పగించే అవకాశం ఉంటుందని వివరించారు.

నకిలీ పోలీసుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

సాధారణ దుస్తుల్లో పోలీసు అధికారులమంటూ ఎవరైనా సంప్రదించినప్పుడు వారి గుర్తింపును ముందుగా నిర్ధారించుకోవాలని MOI సూచించింది. ముఖ్యంగా పోలీసు ఐడీ కార్డును చూపించాలని అడగాలని అధికారులు తెలిపారు.

ఎవరైనా పోలీసు అధికారిగా నటిస్తున్నారని అనుమానం వచ్చినా, పోలీసు ఐడీ చూపించడానికి నిరాకరించినా లేదా చూపించలేకపోయినా వెంటనే 999కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు.

అసలైన పోలీసు గుర్తింపు కార్డు చూడటానికి QID తరహాలోనే ఉంటుందని అధికారులు తెలిపారు. అందులో అధికారి పేరు, ఫొటో, పనిచేస్తున్న విభాగం వివరాలు ఉంటాయని, వెనుక భాగంలో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సంబంధించిన సమాచారం ముద్రించి ఉంటుందని వివరించారు.

24 గంటలూ సేవలందిస్తున్న అల్ ఫజా పోలీస్

ఖతార్‌లో అల్ ఫజా పోలీస్ ఫస్ట్ రెస్పాండర్‌గా పనిచేస్తూ 24 గంటలూ భద్రతా, మానవతా సహాయ సేవలను అందిస్తోంది. అవసరాన్ని బట్టి ఇతర ప్రత్యేక విభాగాలతో సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వహిస్తోంది.

దేశవ్యాప్తంగా రహదారులు, హైవేలపై అల్ ఫజా పోలీస్ పెట్రోలింగ్ బృందాలు విధులు నిర్వహిస్తున్నాయి. నేరాల నివారణ, గుర్తింపు, భద్రత పరిరక్షణ, ట్రాఫిక్ ఉల్లంఘనలను తగ్గించడం, రహదారిపై అత్యవసర సహాయం అందించడం వంటి బాధ్యతలను నిర్వహిస్తున్నాయి.

అవసరమైనప్పుడు ఇతర భద్రతా విభాగాలకు కూడా అల్ ఫజా పోలీస్ సిబ్బంది సహకరిస్తున్నారు.

అత్యవసర పరిస్థితుల్లో పోలీసు సహాయం కోసం ప్రజలు 999కు కాల్ చేయవచ్చని MOI తెలిపింది. అవసరాన్ని బట్టి సమీపంలోని అల్ ఫజా పోలీస్ పెట్రోలింగ్ బృందాన్ని కూడా సంప్రదించి సహాయం పొందవచ్చని అధికారులు సూచించారు.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com