ఫాల్స్ రియల్ ఎస్టేట్ సమాచారం ఇస్తే SR50,000 వరకు ఫైన్..!!

- September 07, 2026 , by Maagulf
ఫాల్స్ రియల్ ఎస్టేట్ సమాచారం ఇస్తే SR50,000 వరకు ఫైన్..!!

రియాద్: రియల్ ఎస్టేట్ లావాదేవీలకు సంబంధించిన తప్పుడు సమాచారం అందించే వారిపై గరిష్ఠంగా SR50,000 వరకు జరిమానా విధించే కొత్త నిబంధనలను సౌదీ అరేబియా జకాత్, ట్యాక్స్ అండ్ కస్టమ్స్ అథారిటీ (ZATCA) ప్రతిపాదించింది. రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్‌కు సంబంధించిన “ఉల్లంఘనలు మరియు జరిమానాల వర్గీకరణ” నిబంధనల్లోని డ్రాఫ్ట్ ఆర్టికల్ 15, పేరా 3పై ప్రజల అభిప్రాయాలను ఆహ్వానించింది. ఈ ముసాయిదాపై సెప్టెంబర్ 3 నుంచి అక్టోబర్ 3 వరకు ఇస్తిత్లా (Istitlaa) ప్రజా సర్వే వేదిక ద్వారా సూచనలు, అభిప్రాయాలు ఇవ్వవచ్చని తెలిపింది.

ప్రతిపాదిత నిబంధనల ప్రకారం, చట్టం లేదా దాని అమలు నిబంధనలను ఉల్లంఘించిన వారికి చెల్లించాల్సిన పన్ను మొత్తానికి సమానమైన లేదా SR50,000 — ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే ఆ మొత్తానికి మించకుండా జరిమానా విధించవచ్చు. రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్‌కు సంబంధించిన ఉల్లంఘనలు, వాటికి వర్తించే జరిమానాలను స్పష్టంగా వర్గీకరించడమే ఈ ముసాయిదా లక్ష్యమని అథారిటీ పేర్కొంది. దీని ద్వారా పన్ను అమలులో మరింత సమర్థవంతమైన పాలన, ఏకరీతి విధానాలు, పారదర్శకత పెరుగుతాయని తెలిపింది.

రిజిస్ట్రేషన్ చేయకపోతే భారీ జరిమానా

నిబంధనల ప్రకారం రియల్ ఎస్టేట్ లావాదేవీని నమోదు చేయడంలో విఫలమైతే SR5,000 నుంచి SR50,000 వరకు జరిమానా విధించవచ్చు. అదేవిధంగా, చట్టపరంగా నిర్ణయించిన గడువులో అవసరమైన పన్ను పత్రాలు, రికార్డులను భద్రపరచడంలో విఫలమైనా SR5,000 నుంచి SR50,000 వరకు జరిమానా ఉంటుంది.

తనిఖీ ప్రక్రియలో అధికారులకు సహకరించకపోవడం లేదా వారు కోరిన సమాచారాన్ని అందించకపోవడం వంటి ఉల్లంఘనలకు SR1,000 నుంచి SR50,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అథారిటీ అధికారులు తనిఖీల కోసం పుస్తకాలు, రికార్డులు, ఇన్‌వాయిస్‌లు, అకౌంటింగ్ పత్రాలను పరిశీలించకుండా అడ్డుకోవడం, వాటి ప్రతులు తీసుకోవడానికి అనుమతించకపోవడం వంటి చర్యలు కూడా శిక్షార్హమైనవేనని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. నిబంధనలు లేదా ఉపనిబంధనల్లోని ఏ నిబంధననైనా ఉల్లంఘించినా SR1,000 నుంచి SR50,000 వరకు జరిమానా విధించవచ్చని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com