'జై ఆవిష్కరణ్.. జై యువత' నినాదంగా ముందుకు సాగాలి: వెంకయ్యనాయుడు
- September 10, 2026
తెనాలి: పరిశోధనలు కేవలం పత్రాలకే పరిమితం కాకుండా సమాజ సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారాలు చూపేలా ఉండాలని భారత గౌరవ 13వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు పిలుపునిచ్చారు. గురువారం తెనాలిలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో 'శ్రీ యలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్' ఆధ్వర్యంలో డాక్టర్ యలవర్తి నాయుడమ్మ స్మారక పురస్కార ప్రదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రముఖ పారిశ్రామికవేత్త, అమర రాజా గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ గల్లా రామచంద్ర నాయుడుగారికి పురస్కారాన్ని ప్రధానం చేశారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ మన దేశ ఆర్ అండ్ డీ వ్యయంలో ప్రభుత్వ వాటా 60% ఉంటే, ప్రైవేటు పరిశ్రమల వాటా కేవలం 36% నుండి 38% మాత్రమే ఉందని, అభివృద్ధి చెందిన దేశాల్లోలా ప్రైవేట్ రంగాలు 70% కంటే ఎక్కువ నిధులు పరిశోధనలకు కేటాయించేలా కార్పొరేట్లు ముందుకు రావాలన్నారు.
నేటి యువ శాస్త్రవేత్తలు వాతావరణ మార్పులు, తాగునీటి ఎద్దడి, పర్యావరణ కాలుష్యం వంటి సమస్యలను పరిష్కరించే 'మానవతా స్పృహ కలిగిన శాస్త్రవేత్తలుగా' ఎదగాలని సూచించారు. ఒకప్పుడు "నాలెడ్జ్ ఈజ్ పవర్" అని, ఇప్పుడు "ఇన్నోవేషన్ ఈజ్ పవర్!" అని పేర్కొంటూ, కొల్లు రంజిత్ బృందం రూపొందించిన 'కూల్ ఫాబెట్స్' యాప్ తెలుగు లిపిని, మాతృభాషను పిల్లలకు చేరువ చేసేందుకు చేపట్టిన చొరవను అభినందించారు. జై ఆవిష్కరణ్ యువత నినాదం కావాలన్నారు. విజ్ఞాన శాస్త్రం నాలుగు గోడల ప్రయోగశాలలకే పరిమితం కాకూడదని, అది సమాజంలోని చివరి వ్యక్తికి కూడా ఉపయోగపడాలన్నదే "ప్రజా శాస్త్రవేత్త" డాక్టర్ యలవర్తి నాయుడమ్మ గారి ప్రధాన సందేశమని ఉద్ఘాటించారు. సరైన రవాణా వసతులు కూడా లేని సామాన్య గ్రామీణ ప్రాంతం నుండి వచ్చి, నిరంతర శ్రమ, పట్టుదలతో దేశ శాస్త్ర సాంకేతిక రంగానికి దిశానిర్దేశం చేసే స్థాయికి ఎదిగిన నాయుడమ్మ జీవితం అందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. విద్య అనేది వ్యక్తికి, సమాజానికి నడుమ ఒక కొత్త సంబంధాన్ని పెంపొందించాలనే ఆదర్శంతో జీవించిన నాయుడమ్మ, సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CLRI) డైరెక్టర్ జనరల్‌గా ఉన్నప్పుడు తోలు పరిశ్రమలోని దుర్గంధ సమస్యను శాస్త్రీయ పరిశోధనలతో పరిష్కరించారన్నారు. అధునాతన కాంబినేషన్ టానింగ్, పర్యావరణ అనుకూల సాంకేతికతలను టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ ద్వారా సామాన్య కార్మికులకు అందుబాటులోకి తెచ్చారని గుర్తుచేశారు. దీనివల్ల, 1951లో కేవలం 50 వేల మందికే జీవనాధారంగా ఉన్న ఈ రంగం, నేడు రూ. 1,15,000 కోట్ల టర్నోవర్‌తో 45 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోందని, అందులో 40 శాతం మంది మహిళలు ఉండి సాధికారత సాధించడానికి నాయుడమ్మ గారే పునాది అని స్పష్టం చేశారు. ఆయన పరిశోధనలు అంతర్జాతీయ పాఠ్యాంశాల్లో చేరడం విశేషమని పేర్కొన్నారు. అటువంటి మహనీయుడి పేరిట ఏర్పాటు చేసిన పురస్కారాన్ని, నాయుడమ్మ గారి ఆశయాలకు తగ్గట్టుగా గ్రామీణ నేపథ్యం నుండి వచ్చి వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు స్థాపించి సమాజానికి సేవ చేస్తున్న డాక్టర్ గల్లా రామచంద్ర నాయుడుకి అందజేయడం అత్యంత యోగ్యమైన విషయమన్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన గల్లా రామచంద్ర నాయుడు అమర రాజా సంస్థను స్థాపించి, బ్యాటరీ రంగాన్ని విప్లవాత్మకంగా మార్చడమే కాకుండా, పల్లెల్లోనే పరిశ్రమలను నెలకొల్పి స్థానిక యువత వలసపోకుండా వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారని అభినందించారు.
ఆవిష్కరణలు మన సమాజాన్ని దృష్టిలో ఉంచుకోవాలని వెంకయ్యనాయుడు చెబుతూ ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏఐ నమూనాలు పాశ్చాత్య ఆంగ్లో-సాక్సన్ భావజాలం పై ఆధారపడి ఉన్నందున, వాటికి 'భాషా అనువాదం' తెలిసినంతగా మన 'భారతీయ భావానువాదం' తెలియదని, సాంకేతికత విదేశీదైనా దానికి జోడించే 'సంస్కారం', 'డేటా' మన మాతృభాషలు, సంస్కృతి ప్రాతిపదికన ఉన్న భారతీయ ఏఐగా రూపొందాలని ఆకాంక్షించారు. 'జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్' కు తోడు 'జై ఆవిష్కరణ్!' అనే నినాదంతో యువత స్వదేశీ ఆవిష్కరణలు చేపట్టి భారత్‌ను విశ్వగురువుగా నిలబెట్టాలని, నైతిక విలువలతో కూడిన పరిశోధనలే నాయుడమ్మ కి ఇచ్చే నిజమైన నివాళి అని చెప్పారు.
తాజా వార్తలు
- ఒమన్ సుల్తాన్ తో భారత రాయబారి ప్రశాంత్ పిసే భేటీ
- జర్మనీలో 40 బిలియన్ యూరోలు పెట్టుబడికి యూఏఈ ప్రణాళిక..
- క్రికెట్ బ్యాట్‌తో తన బంధాన్ని గుర్తుచేసుకున్న సచిన్
- ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ.. పోస్టల్ స్టాంప్ ఆవిష్కరించిన మంత్రి లోకేశ్
- ఢిల్లీలో BRICS సదస్సుకు సర్వం సిద్ధం.. ప్రధాని మోదీ ట్వీట్
- ఎమిరేట్స్ గ్లోబల్ అల్యూమినియం సీఈఓతో ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ భేటీ
- 'జై ఆవిష్కరణ్.. జై యువత' నినాదంగా ముందుకు సాగాలి: వెంకయ్యనాయుడు
- 8వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో మంత్రి టీజీ భరత్
- ఆస్టర్ ఫార్మసీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను సందర్శించిన షేక్ హమ్దాన్
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31.. ఎఫ్అండ్బీ రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు







