దుబాయ్ డ్యూటీ ఫ్రీలో $1 మిలియన్ గెలిచిన భారతీయుడు..!!

- September 24, 2026 , by Maagulf
దుబాయ్ డ్యూటీ ఫ్రీలో $1 మిలియన్ గెలిచిన భారతీయుడు..!!

దుబాయ్: దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ డ్రాలో ఓ భారతీయ ప్రవాసి ఏకంగా $1 మిలియన్ (Dh3,672,500) గెలుచుకున్నారు. ఐదేళ్లుగా డ్యూటీ ఫ్రీ ప్రమోషన్‌లో టికెట్లు కొనుగోలు చేస్తున్న 40 ఏళ్ల భాను సోభానికి ఈసారి అదృష్టం వరించింది.

భాను సోభాని దుబాయ్‌లో గత 10 ఏళ్లుగా** నివసిస్తున్నారు. బుర్ దుబాయ్‌లో టెక్స్‌టైల్, గార్మెంట్ ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నారు. భార్య, ఇద్దరు కుమార్తెలు, తల్లితో కలిసి ఆయన నివసిస్తున్నారు.

పోలాండ్ ప్రయాణంలో కొనుగోలు చేసిన టికెట్

వ్యాపార పనిమీద పోలాండ్‌కు వెళ్తున్న సమయంలో సెప్టెంబర్ 2న భాను రెండు డ్యూటీ ఫ్రీ టికెట్లు కొనుగోలు చేశారు. వాటిలో ఒకటి మిలీనియం మిలియనీర్ డ్రా, మరొకటి రేంజ్ రోవర్ డ్రా కోసం తీసుకున్నారు. బుధవారం ఉదయం 11.30 గంటలకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ నుంచి ఫోన్ రావడంతో మొదట ఏదైనా ప్రమోషన్ గురించి చెబుతారని భావించారు. అయితే టికెట్ నంబర్ అడిగి, ‘‘ఈ రోజు మీకు డబ్బులు కావాలా? కారు కావాలా?’’ అని అడిగిన తర్వాత తాను మిలియనీర్ డ్రాలో గెలిచినట్లు చెప్పారని భాను తెలిపారు.

మొదట నమ్మలేకపోయిన ఆయన, దుబాయ్ డ్యూటీ ఫ్రీ ఫేస్‌బుక్ పేజీలో ఫలితాలను చూసిన తర్వాతే తనకు నిజంగా $1 మిలియన్ బహుమతి వచ్చినట్లు నమ్మారు.

 భార్యకు సమాధానం దొరికింది

ఈ వార్తను మొదట తన తల్లికి చెప్పగా ఆమె భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారని భాను తెలిపారు. ఆ తర్వాత భార్యకు ఫోన్ చేసి విషయం చెప్పారు. గతంలో ప్రతిసారి డ్రా టికెట్లు కొనుగోలు చేయడంపై భార్య తనను ప్రశ్నించేదని ఆయన చెప్పారు. తాను మాత్రం ‘‘ఇది పెట్టుబడి’’ అని చెప్పేవాడినని వివరించారు.

2021 నుంచి దుబాయ్ డ్యూటీ ఫ్రీ ప్రమోషన్లలో పాల్గొంటున్న భాను.. ప్రయాణించే సమయంలో సంవత్సరానికి సగటున 5 నుంచి 10 టికెట్లు కొనుగోలు చేసేవారు. ఈసారి ఆయన కొనుగోలు చేసిన టికెట్ Millennium Millionaire Series 557లో 0489 నంబర్‌ది. పోలాండ్‌కు వెళ్లే సమయంలో కాంకోర్స్ బీలో ఈ టికెట్ కొనుగోలు చేశారు.

 డబ్బును పెట్టుబడిగా పెట్టనున్న భాను

ప్రస్తుతం భానుకు దుబాయ్‌లో ఇప్పటికే నాలుగు విల్లాలు ఉన్నాయి. తాజాగా వచ్చిన బహుమతి మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఇతర పెట్టుబడులతో పాటు మంచి అవకాశం లభిస్తే మరిన్ని ఆస్తులు కొనుగోలు చేసేందుకు ఉపయోగించనున్నట్లు తెలిపారు. అదే సమయంలో కొంత మొత్తాన్ని చారిటీ కార్యక్రమాలకు ఇవ్వాలని కూడా భావిస్తున్నట్లు చెప్పారు. భారత్‌లోని ఒక ఆలయానికి ప్రతి సంవత్సరం ఆర్థిక సహాయం అవసరమవుతుందని, వారికి సహాయం చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు.

283వ భారతీయ విజేత

1999 నుంచి దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ ప్రమోషన్‌లో $1 మిలియన్ గెలిచిన భారతీయుల సంఖ్య 283కు చేరింది. ఈ ప్రమోషన్‌లో అత్యధికంగా టికెట్లు కొనుగోలు చేసే జాతీయతల్లో భారతీయులు ముందంజలో ఉన్నారని సమాచారం. ఇక భవిష్యత్తులోనూ డ్యూటీ ఫ్రీ డ్రా టికెట్లు కొనుగోలు చేస్తారా అని అడిగినప్పుడు భాను ‘‘తప్పకుండా కొనుగోలు చేస్తాను’’ అని తెలపడం విశేషం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com