గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: డీజీపీ సీవీ ఆనంద్

- September 26, 2026 , by Maagulf
గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: డీజీపీ సీవీ ఆనంద్

హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా గణేష్ విగ్రహాల ఊరేగింపులు, నిమజ్జనాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయని రాష్ట్ర డీజీపీ సి.వీ.ఆనంద్ తెలిపారు. శుక్రవారం రాత్రి 7 గంటలకు నిర్వహించిన మీడియా సమావేశంలో నిమజ్జనాల పరిస్థితి, పోలీసుల భద్రతా ఏర్పాట్లపై ఆయన వివరాలు వెల్లడించారు.

గణేష్ నిమజ్జన పోర్టల్‌లో నమోదైన వివరాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో సుమారు 1.24 లక్షల గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసినట్లు డీజీపీ తెలిపారు. వీటి ఊరేగింపులు, నిమజ్జనాల కోసం ట్రాఫిక్ నియంత్రణతో పాటు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఇప్పటివరకు సుమారు 80 వేల విగ్రహాల నిమజ్జనం పూర్తయిందని వెల్లడించారు.

ఉదయం నుంచి నిమజ్జనం కోసం కదిలిన సుమారు 32 వేల విగ్రహాల్లో 6,350 విగ్రహాల నిమజ్జనం పూర్తయిందని డీజీపీ తెలిపారు. అపార్ట్‌మెంట్లు, కమ్యూనిటీలు, వ్యక్తిగత ఇళ్లలో ఏర్పాటు చేసిన విగ్రహాలను కూడా కలుపుకుంటే రాష్ట్రవ్యాప్తంగా మొత్తం గణేష్ విగ్రహాల సంఖ్య సుమారు 3.5 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉండొచ్చని అంచనా వేశారు.

భారీగా ప్రజలు శోభాయాత్రల్లో పాల్గొంటున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్లు సీవీ ఆనంద్ తెలిపారు. శుక్రవారం ప్రార్థనలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది గణేష్ ఊరేగింపులు కొంత ఆలస్యంగా ప్రారంభమయ్యాయని, సాయంత్రం 5 గంటల నుంచి నిమజ్జనాల వేగం గణనీయంగా పెరిగిందని చెప్పారు.

భద్రత, పర్యవేక్షణ కోసం 13 డ్రోన్లు, హై-రైజ్ కెమెరాలు, వేలాది సీసీ కెమెరాలను వినియోగిస్తున్నట్లు డీజీపీ వెల్లడించారు. భారీ సంఖ్యలో పోలీసు సిబ్బందితో పాటు క్రేన్ ఆపరేటర్లు, ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బందిని కూడా విధుల్లో మోహరించినట్లు తెలిపారు.

గరిష్ఠ సంఖ్యలో నిమజ్జనాలు పూర్తయ్యేలా పోలీసు బృందాలు రాత్రంతా విధుల్లో కొనసాగుతాయని చెప్పారు. రేపు ఉదయం 11 గంటలలోగా ట్యాంక్‌బండ్, ఖైరతాబాద్ ఫ్లైఓవర్‌పై ట్రాఫిక్‌ను పునరుద్ధరించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

ఇప్పటివరకు గణేష్ ఊరేగింపులు, నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని డీజీపీ పేర్కొన్నారు. మండపాల నిర్వాహకులు, భక్తులు, ప్రజలందరూ పోలీసులకు సహకరించి వీలైనంత త్వరగా నిమజ్జనాలను పూర్తి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

అయితే గత పది రోజులుగా నిమజ్జనాలకు సంబంధించిన ఘటనల్లో ఒక ఎస్‌ఐతో పాటు 12 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా, 26 మంది గాయపడినట్లు డీజీపీ తెలిపారు. ఈ ఘటనలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇటీవల కురిసిన వర్షాలు, రోడ్లపై పేరుకుపోయిన వ్యర్థాల కారణంగా రహదారులు జారే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ప్రయాణించాలని సీవీ ఆనంద్ సూచించారు. నిమజ్జనాల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించి సురక్షితంగా ఇంటికి చేరుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com