దుబాయ్‌లో ప్రతిభావంతులైన ఉపాధ్యాయులకు గోల్డెన్ వీసాలు

- October 06, 2026 , by Maagulf
దుబాయ్‌లో ప్రతిభావంతులైన ఉపాధ్యాయులకు గోల్డెన్ వీసాలు

దుబాయ్: ప్రైవేట్ విద్యా రంగానికి విశేష సేవలు అందిస్తున్న ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు, విద్యావేత్తలకు దుబాయ్ గోల్డెన్ వీసాలను అందిస్తోంది. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి, దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్ షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.

ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించారు. చిన్నారుల విద్యా కేంద్రాలు, పాఠశాలలు, ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో విశేష కృషి చేస్తున్న విద్యావేత్తలను గౌరవించడంతో పాటు వారికి మద్దతు అందించడమే ఈ కార్యక్రమం లక్ష్యంగా ఉంది.

దుబాయ్ ఎడ్యుకేషన్ 33 (E33) వ్యూహానికి అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ప్రతిభావంతులైన ఉపాధ్యాయులను ఆకర్షించడం, వారిని దుబాయ్‌లో కొనసాగించడం, విద్యార్థుల అభ్యసన అనుభవాలను మెరుగుపరచడం ద్వారా ఎమిరేట్ విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేయడం E33 వ్యూహం ప్రధాన ఉద్దేశం.

2024 అక్టోబర్ 5న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 835 మందికి పైగా విద్యావేత్తలు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థుల ఎంపికలో విద్యార్హతలు, అత్యుత్తమ విజయాలు, విద్యా రంగానికి మరియు సమాజానికి చేసిన సేవలు, తల్లిదండ్రులు-విద్యార్థుల నుంచి వచ్చిన సానుకూల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు.

ప్రైవేట్ ఎర్లీ చైల్డ్‌హుడ్ సెంటర్లు, పాఠశాలలు, ఉన్నత విద్యా సంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులు ఈ గోల్డెన్ వీసాకు అర్హులు. విద్యా రంగంలో విశేష ప్రతిభ, సృజనాత్మక సేవలు, విద్యా నాణ్యతను మెరుగుపరిచిన అనుభవం, విద్యార్థుల ఫలితాలను మెరుగుపరిచిన కృషి వంటి అంశాలను అర్హతగా పరిగణిస్తారు.

అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను దుబాయ్ నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ అథారిటీ (KHDA) వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com