బైక్ చోరీ కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలుశిక్ష..!!

- October 07, 2026 , by Maagulf
బైక్ చోరీ కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలుశిక్ష..!!

మనామా: డెలివరీ కంపెనీకి చెందిన మోటార్‌సైకిల్‌ను కత్తితో బెదిరించి ఎత్తుకెళ్లిన 43 ఏళ్ల వ్యక్తికి బహ్రెయిన్ హై క్రిమినల్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ ఘటన ఇసా టౌన్‌లో చోటుచేసుకుంది.

2026 ఏప్రిల్ 14న సాయంత్రం 4 గంటల సమయంలో 21 ఏళ్ల డెలివరీ ఉద్యోగి ఒక ఆర్డర్ అందించేందుకు వెళ్లాడు. అయితే కస్టమర్ ఇచ్చిన చిరునామా తప్పుగా ఉండటంతో అక్కడ ఆగి, కస్టమర్‌ను సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నాడు.

అదే సమయంలో నిందితుడు అక్కడికి వచ్చి.. డెలివరీ ఉద్యోగిని మోటార్‌సైకిల్‌ను కొద్దిసేపు నడపడానికి ఇవ్వాలని కోరాడు. అందుకు ఉద్యోగి నిరాకరించడంతో నిందితుడు కత్తిని బయటకు తీసి బెదిరించాడు. తనపై దాడి చేస్తానని హెచ్చరించడంతో భయపడిన ఉద్యోగి పక్కకు తప్పుకున్నాడు. దీంతో నిందితుడు మోటార్‌సైకిల్‌ను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.

ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారంతో నిందితుడిని గుర్తించారు. అనంతరం అతడి ఫొటోను డెలివరీ ఉద్యోగికి చూపించగా.. అతడే బైక్‌ను దోచుకెళ్లిన వ్యక్తి అని బాధితుడు గుర్తించాడు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారణ సమయంలో నిందితుడి రూపురేఖలతో బాధితుడు ఇచ్చిన గుర్తింపు కూడా సరిపోలినట్లు అధికారులు తెలిపారు. దీంతో బైక్ దోపిడీకి పాల్పడిన నిందితుడికి బహ్రెయిన్ హై క్రిమినల్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com