ఏపీలో సాంకేతిక పర్యాటకానికి పెద్దపీట:మంత్రి కందుల దుర్గేష్
- October 08, 2026
అమరావతి/స్పెయిన్:ఏపీ పర్యాటక రంగంలో కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత సాంకేతికతను తీసుకువచ్చి ప్రభుత్వం చారిత్రాత్మక అడుగు వేసిందని రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. స్పెయిన్‌లోని సెవిల్లె-ఫిబెస్ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగుతోన్న అంతర్జాతీయ 'టూరిజం ఇన్నోవేషన్ సమ్మిట్-2026'లో ప్రసంగించిన మంత్రి దుర్గేష్ 'ఎక్స్‌ప్లర్జర్' (Explurger) సంస్థ రూపొందించిన ‘నివు ఏఐ’ (NiVU AI) (NiVU AI- Neural Intelligence Vernacular Unified Model) ప్లాట్‌ఫారమ్ సేవలతో రాష్ట్ర పర్యాటక రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని తద్వారా ప్రాచీన చారిత్రక కథలు అత్యాధునిక సాంకేతికత ద్వారా ప్రపంచానికి సులభంగా అందుబాటులోకి వస్తున్నాయని వెల్లడిస్తూ ఏఐ (AI) సాంకేతికత ఆధారిత పర్యాటక విప్లవాన్ని ప్రపంచం ముందు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అడుగడుగునా విస్మయపరిచే ప్రకృతి సౌందర్యానికి, వైవిధ్యానికి ప్రతీక అయిన ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగ గొప్పదనాన్ని, భౌగోళిక వైవిధ్యాన్ని కళ్లకు కట్టినట్లుగా వివరించారు. అంతకుముందు మంత్రి దుర్గేష్ పర్యాటక శాఖ అధికారులు ఏర్పాటు చేసిన స్టాల్ తో పాటు వివిధ దేశాల స్టాల్స్ ను సందర్శించారు.ఈ నేపథ్యంలో వేదిక వద్దకు చేరుకున్న మంత్రి దుర్గేష్ కు, ఏపీటీఏ డిప్యూటీ సీఈవో శ్రీనివాస్ కు సెవిల్లె-ఫిబెస్ డైరెక్టర్లు, ప్రాంతీయ అధికారులు ఐరీన్ మునోజ్ ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ...తిరుమల దివ్య పుణ్యక్షేత్రం నుంచి ఆరంభమై, అమరావతి ప్రాచీన బౌద్ధ వారసత్వాన్ని స్పృశిస్తూ, గండికోట అద్భుతమైన క్యానియన్ ప్రకృతి దృశ్యాలను దాటుకుంటూ, మారేడుమిల్లి అరణ్యాలు, అరకు లోయల సౌందర్యంలో సాగి, బంగాళాఖాతపు హోయలొలికించే విశాఖ తీరంలో పరిపూర్ణమయ్యే ఒక అద్భుతమైన అనుభూతుల సమ్మేళనమే ఆంధ్రప్రదేశ్ అని అభివర్ణించారు. పవిత్ర పుణ్యక్షేత్రాలు, బౌద్ధ చరిత్ర, స్థానిక సంప్రదాయాలు, సజీవ కళలు, ప్రత్యేకమైన వంటకాలు, అడవులు, నదులు, సముద్రతీరాలు, ఆప్యాయంగా స్వాగతించే ప్రజల సమ్మేళనంగా ఉన్న ఏపీ ఒకే ప్రయాణంలో ఇంతటి వైవిధ్యాన్ని అందించడంలో సాటిలేని గమ్యస్థానమని కొనియాడారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచస్థాయి 'క్వాంటం టెక్నాలజీ' కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని, క్వాంటం కంప్యూటింగ్ వంటి అత్యాధునిక సాంకేతిక ఆవిష్కరణల ద్వారా యువతకు నూతన ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు, ప్రజల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుస్తామని తెలిపిన మంత్రి దుర్గేష్ పర్యాటక రంగంలోనూ సాంకేతికతకు పెద్దపీట వేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో నివు ఏఐని ప్రవేశపెట్టేందుకు ఏపీ ప్రభుత్వం 'ఎక్స్‌ప్లర్జర్' సంస్థతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుందని తద్వారా రాష్ట్రంలోని 100కు పైగా ప్రముఖ పర్యాటక, పుణ్యక్షేత్రాలలో ASK AI పేరుతో ఉన్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయడం ద్వారా పర్యాటకులకు 130 భాషలకు పైగా సమాచారం పొందవచ్చన్నారు. దీని వల్ల పర్యాటకులకు ఎలాంటి ఖర్చు లేదని, ఇది పూర్తిగా ఉచితమని, ఎలాంటి ప్రత్యేక యాప్ లు డౌన్ లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. ఇప్పటికే మంగళగిరిలోని శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఈ ప్రక్రియ విజయవంతమైందని, రాష్ట్రవ్యాప్త కార్యక్రమం కింద మొదటి దశలో 30 ప్రధాన గమ్యస్థానాల్లో ఈ సేవలు అందించనున్నామన్నారు. ఇది అంతర్జాతీయ ప్రయాణికులకు ఎంతగా ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు.ఈ భాగస్వామ్యం ద్వారా ఆంధ్రప్రదేశ్ వారసత్వపు లోతును, ప్రపంచ స్థాయి భారతీయ సాంకేతికతను ఒకే వేదికపైకి తీసుకువచ్చామన్నారు.
ఈ సందర్భంగా స్పెయిన్ నుండి వచ్చిన ఒక సందర్శకుడు ఆంధ్రప్రదేశ్‌లోని ఒక ప్రాచీన కట్టడం లేదా పవిత్ర స్థలానికి చేరుకుని, కోడ్‌ను స్కాన్ చేసి స్పానిష్ భాషలో సంభాషణను ప్రారంభించవచ్చని ఉదహరించారు. తద్వారా ఆ ప్రదేశం యొక్క కథను వినడంతో పాటు దాని చరిత్ర, సాంస్కృతిక ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చని అంతేగాక సమీపంలోని ఇతర పర్యాటక ప్రాంతాల విశేషాలను సైతం తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ఇది కేవలం డిజిటల్ వివరణ మాత్రమే కాదని, ఒక గమ్యస్థానానికి, అక్కడికి వచ్చే ప్రతి పర్యాటకుడికి మధ్య వారధిని సృష్టించే ప్రయత్నమని వివరించారు. అలాగే పర్యాటకుల ప్రాధాన్యతలు, భాషలు, ప్రవర్తనా సరళిని విశ్లేషించి భవిష్యత్తు ప్రణాళికలు రచించడానికి ఏపీటీఏకు రియల్-టైమ్ అనలిటిక్స్ లభిస్తాయన్నారు.
పర్యాటక రంగంలో ఆవిష్కరణలంటే కేవలం సాంకేతికతను జోడించడం మాత్రమే కాదని, పర్యాటకులకు ఎదురయ్యే ప్రతిబంధకాలను తొలగించి స్థానిక సంస్కృతిని మరింత లోతుగా ఆస్వాదించేలా చేయడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. కేవలం సమాచార సేకరణకే పరిమితం కాకుండా.. ప్రయాణం పట్ల ఆసక్తి కలగడం, ప్రణాళిక రూపకల్పన నుంచి మొదలుకుని, విశేషాలను అర్థం చేసుకోవడం, రవాణా సౌకర్యాలు, స్థానిక విశేషాలను గుర్తించడం మరియు పర్యటన అనంతర మధురానుభూతుల వరకు ప్రయాణికుడి సమగ్ర యాత్రకు సాంకేతికత సంపూర్ణంగా తోడ్పడాలని మంత్రి దుర్గేష్ ఆకాంక్షించారు.అలాగే ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), వర్చువల్ రియాలిటీ (వీఆర్), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డిజిటల్ ట్విన్స్ వంటి అత్యాధునిక సాంకేతిక వ్యవస్థల సహాయంతో, ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఆంధ్రప్రదేశ్ అడవులు, ప్రకృతి వనరుల సమగ్ర సమాచారాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకునే వీలు కల్పిస్తున్నామన్నారు. తద్వారా పర్యాటకులలో రాష్ట్ర సందర్శనపై మరింత ఆసక్తిని పెంపొందిస్తూ, వారిని ఆంధ్రప్రదేశ్‌కు సాదరంగా ఆహ్వానిస్తున్నామని తెలిపారు. పర్యాటక ఆలోచనలు కేవలం ఆలోచనలకే పరిమితం కాకుండా ఆచరణలోకి వచ్చే ఒక సజీవ ప్రయోగశాలగా ఆంధ్రప్రదేశ్ మారుతుందని ధీమా వ్యక్తం చేశారు.ఒక 'స్మార్ట్ డెస్టినేషన్' అంటే కేవలం సమాచారాన్ని లేదా డేటాను పోగుచేసుకోవడం మాత్రమే కాదు వినూత్న ఆవిష్కరణల ద్వారా మెరుగైన పర్యాటక అనుభవాలను సృష్టించడం, స్థానిక ఉపాధి అవకాశాలను పెంపొందించడం,బాధ్యతాయుతమైన పర్యాటకాన్ని ప్రోత్సహించడం అని తెలిపారు. ట్రావెల్-టెక్ సంస్థలు, స్టార్టప్‌లు, విశ్వవిద్యాలయాలు, పర్యాటక ఆపరేటర్లు, పెట్టుబడిదారులు, కంటెంట్ క్రియేటర్లు, గమ్యస్థాన నిపుణులతో కలిసి భాగస్వామ్యంతో పనిచేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంసిద్ధంగా మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు.
కేవలం పర్యాటకులుగా కాకుండా భాగస్వాములుగా ఆంధ్రప్రదేశ్‌కు రావాలని పర్యాటక నిపుణులను మంత్రి దుర్గేష్ ఆహ్వానించారు. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ఆధారిత పర్యాటక సేవలు, డిజిటల్ సాధనాలు, స్మార్ట్ డెస్టినేషన్ మేనేజ్‌మెంట్, అనుభవాల అన్వేషణ వంటి వినూత్న రంగాలలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. సమాజానికి నిజమైన ప్రయోజనాలను చేకూర్చే ఆవిష్కరణల కోసం తాము ఎదురుచూస్తున్నామని తెలిపారు. 'ఇప్పటికే భారతదేశాన్ని చూసేశామని నమ్మితే, ఒకసారి ఆంధ్రప్రదేశ్‌కు రండి.. మిమ్మల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తాము' అని పేర్కొన్న ఆయన వారసత్వం, సంస్కృతి, ఆధునికతల సంగమంగా ఉన్న సెవిల్లె నగర ప్రత్యేకతలను ఈ సందర్భంగా ప్రశంసించారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







