లోక్ భవన్‌లో 77వ టీబీ సీల్ విక్రయ కార్యక్రమాన్ని ప్రారంభించిన గవర్నర్ అబ్దుల్ నజీర్

- October 08, 2026 , by Maagulf
లోక్ భవన్‌లో 77వ టీబీ సీల్ విక్రయ కార్యక్రమాన్ని ప్రారంభించిన గవర్నర్ అబ్దుల్ నజీర్

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మరియు ఆంధ్రప్రదేశ్ టీబీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఎస్. అబ్దుల్ నజీర్, బుధవారం లోక్ భవన్‌లోని దర్బార్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో 77వ టీబీ సీల్ విక్రయ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ, 144 ఏళ్ల క్రితం సర్ రాబర్ట్ కోచ్ క్షయ (టీబీ) వ్యాధి కారక క్రిమిని కనుగొన్నారని, దీని నియంత్రణకు గణనీయమైన పురోగతి సాధించినప్పటికీ, ఇది ఇప్పటికీ ప్రాణాంతక వ్యాధిగానే కొనసాగుతోందని పేర్కొన్నారు. టీబీ అనేది కేవలం వైద్యపరమైన సవాలు మాత్రమే కాదని, వ్యక్తులు, కుటుంబాలు మరియు సమాజాలపై ప్రభావం చూపే సామాజిక మరియు ఆర్థిక సవాలు అని ఆయన అన్నారు. టీబీపై మన స్పందన కేవలం చికిత్సకే పరిమితం కాకుండా అవగాహన కల్పించడం, వ్యాధిని ముందుగానే గుర్తించడం, నివారణ, పోషకాహారం, సామాజిక మద్దతు మరియు సామాజిక భాగస్వామ్యాన్ని కూడా కలిగి ఉండాలని ఆయన ఉద్ఘాటించారు.

ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన ప్రపంచ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల (SDG) గడువు 2030 కంటే ముందే భారతదేశం నుండి టీబీని నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'టీబీ ముక్త్ భారత్ అభియాన్' కార్యక్రమం, ప్రభుత్వం మరియు సమాజం సమష్టిగా కృషి చేసి విజయవంతం చేయాలని గవర్నర్ తెలిపారు. ప్రజల భాగస్వామ్య౦ ద్వారా క్షయ వ్యాధిఫై అవగాహన కల్పించేందుకు టీబీ సీల్ విక్రయ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా టీబీ సీల్ విక్రయాల కోసం ఉదారంగా విరాళాలు అందించాలని పౌరులు, విద్యాసంస్థలు, పరిశ్రమలు, కార్పొరేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు మరియు దాతలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ టీబీ అసోసియేషన్ తరపున డాక్టర్ అరుణ్ కుమార్ కాంతి మొహంతి, డాక్టర్ పి.ఎస్. శర్మ; డాక్టర్ కొడాలి రామకృష్ణ, డాక్టర్ బి. మసిలామణి; డాక్టర్ పి. జయకర్ బాబు; జాయింట్ డైరెక్టర్ మరియు గౌరవ కార్యదర్శి డాక్టర్ టి. రమేష్; గవర్నర్  జాయింట్ సెక్రటరీ పి.ఎస్. సూర్య ప్రకాష్ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com