గల్ఫ్ దేశాల భద్రతపై జీసీసీ పోలీస్ చీఫ్‌ల కీలక సమావేశం..!!

- October 08, 2026 , by Maagulf
గల్ఫ్ దేశాల భద్రతపై జీసీసీ పోలీస్ చీఫ్‌ల కీలక సమావేశం..!!

మనామా: గల్ఫ్ దేశాల మధ్య భద్రతా సహకారం, సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడంపై జీసీసీ (GCC) దేశాల పోలీస్ ఉన్నతాధికారులు చర్చించారు. సౌదీ అరేబియాలోని రియాద్‌లో జీసీసీ జనరల్ సెక్రటేరియట్ ప్రధాన కార్యాలయంలో పబ్లిక్ సెక్యూరిటీ చీఫ్‌ల ఏడో సమావేశం జరిగింది. బహ్రెయిన్ పోలీస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ తారిఖ్ అల్ హసన్ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రి జనరల్ షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా తరఫున పాల్గొన్న అధికారులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.

గల్ఫ్ ప్రాంతంలో మారుతున్న భద్రతా పరిస్థితులు, కొత్తగా ఎదురవుతున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు భద్రతా సంస్థల సన్నద్ధతను పెంచాల్సిన అవసరంపై సమావేశంలో చర్చించారు. అలాగే నిపుణుల అనుభవాలు, సమాచారాన్ని పరస్పరం పంచుకోవడం, ఉత్తమ విధానాలను అమలు చేయడం వంటి అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. జీసీసీ దేశాల ఉమ్మడి భద్రతా కార్యక్రమాలకు సంబంధించిన గత నిర్ణయాలు, సిఫారసుల అమలు పురోగతిని అధికారులు సమీక్షించారు. జీసీసీ భద్రతా ప్రాజెక్టుల పరిస్థితి, ప్రత్యేక భద్రతా కమిటీల పనితీరు, భద్రతా సంస్థల మధ్య సహకారం, సమన్వయాన్ని పెంచేందుకు చేపట్టిన కార్యక్రమాలపై కూడా చర్చించారు.

అదే విధంగా ప్రాంతీయ భద్రత, స్థిరత్వాన్ని మరింత బలోపేతం చేసేందుకు సమన్వయ వ్యవస్థలను అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని సమావేశంలో ప్రస్తావించారు. ఇప్పటికే సాధించిన పురోగతిని మరింత ముందుకు తీసుకెళ్లడంతో పాటు సంయుక్త భద్రతా కార్యక్రమాలు, ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని లెఫ్టినెంట్ జనరల్ తారిఖ్ అల్ హసన్ సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com