యూఏఈలో షాపింగ్ పై ఇంధన ధరల ప్రభావం..!!
- October 08, 2026
దుబాయ్: యూఏఈలో ఇంధన ధరలు పెరగడంతో కొంతమంది వినియోగదారులు తమ షాపింగ్ విధానాన్ని మార్చుకుంటున్నారు. ఒకేసారి పెద్ద మొత్తంలో సరుకులు కొనుగోలు చేయడం కంటే చిన్న మొత్తాల్లో, తరచుగా షాపింగ్ చేయడానికి మొగ్గు చూపుతున్నట్లు రిటైలర్లు తెలిపారు. అక్టోబర్‌లో ఇంధన ధరలు లీటర్‌కు Dh0.60 పెరగడంతో నాలుగేళ్లకు పైగా గరిష్ఠ స్థాయికి చేరాయి. ప్రస్తుతం సూపర్ 98 ధర Dh4.40, స్పెషల్ 95 ధర Dh4.28, ఈ-ప్తస్ ధర Dh4.21గా ఉంది. గత నెలతో పోలిస్తే ఇవి సుమారు 16 శాతం పెరిగాయి.
ధరలు పోల్చి చూసి..
వినియోగదారులు తమ ఖర్చుల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని Choithrams సీఈఓ మార్క్ మోర్టిమర్-డేవిస్ చెప్పారు. ధరలు, ఆఫర్లు, ప్రమోషన్లను పోల్చి చూసిన తర్వాత కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఇంధన ధరల పెరుగుదల కారణంగా చిన్న బాస్కెట్లతో తరచుగా షాపింగ్ చేసే ధోరణి కనిపిస్తోందన్నారు.
ప్రజలు తప్పనిసరిగా తక్కువసార్లు షాపింగ్ చేయడం లేదని, అయితే ఏ వస్తువులు కొనాలి అనే విషయంలో మరింత ఎంపిక చేసుకుంటున్నారని అధిల్ గ్రూప్ ఎండీ డాక్టర్ ధనంజయ్ దాతర్ చెప్పారు. అవసరమైన వస్తువులకు ప్రాధాన్యం ఇస్తూ, ధరలను పోల్చి చూస్తున్నారని తెలిపారు.
రవాణా, లాజిస్టిక్స్ ఖర్చులపై ప్రభావం
ఇంధన ధరల పెరుగుదల రిటైల్ రంగంలోని రవాణా, సరఫరా వ్యవస్థలపై కూడా ప్రభావం చూపుతోంది. సరఫరాదారుల నుంచి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు, అక్కడి నుంచి స్టోర్లకు వస్తువులను తరలించేందుకు రవాణా, లాజిస్టిక్స్ కీలకం కావడంతో ఖర్చులు పెరుగుతున్నాయని రిటైలర్లు తెలిపారు. ముఖ్యంగా పెద్ద డెలివరీ వాహనాల ఫ్లీట్లు నిర్వహించే సంస్థలు, తరచుగా స్టాక్‌ను తిరిగి నింపాల్సిన వ్యాపారాలపై ఇంధన ధరల పెరుగుదల ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.
ఖర్చులను తగ్గించే చర్యలు
పెరుగుతున్న ఖర్చులను నియంత్రించేందుకు రిటైలర్లు రూట్ ఆప్టిమైజేషన్, మెరుగైన ఇన్వెంటరీ ప్లానింగ్, వాహనాల సమర్థవంతమైన వినియోగం వంటి చర్యలు చేపడుతున్నారు. ఇంధన ధరలు ఎక్కువ కాలం ఇదే స్థాయిలో కొనసాగితే లాజిస్టిక్స్, ఆపరేటింగ్ ఖర్చులపై మరింత ఒత్తిడి తప్పదని డాతర్ పేర్కొన్నారు.అయితే అన్ని కిరాణా వస్తువుల ధరలు వెంటనే లేదా ఒకే స్థాయిలో పెరిగే అవకాశం లేదని, రానున్న నెలల్లో వినియోగదారులు మరింత ధరలపై దృష్టి పెట్టే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
ఇంధన ధరల పెరుగుదలతో వచ్చిన అదనపు ఖర్చులను రిటైలర్లు కొంతవరకు భరిస్తుండగా, మరికొంత భాగాన్ని ధరల్లోకి బదిలీ చేసే పరిస్థితి ఉందని డాతర్ తెలిపారు. అయితే కిరాణా రంగంలో ధరలపై వినియోగదారుల స్పందన ఎక్కువగా ఉండటంతో మొత్తం ఖర్చును వెంటనే వినియోగదారులపై మోపడం లేదన్నారు.
హోం డెలివరీకి ప్రాధాన్యం
రవాణా ఖర్చులు పెరగడంతో ఇంటికి లేదా కార్యాలయానికి దగ్గర్లోని స్టోర్లలో చిన్న మొత్తాల్లో కొనుగోళ్లు చేసే ధోరణి పెరిగే అవకాశం ఉందని రిటైలర్లు భావిస్తున్నారు. అయితే పెద్ద సూపర్‌మార్కెట్లు వివిధ రకాల ఉత్పత్తులు, పోటీ ధరలు, ప్రమోషన్ల కారణంగా వినియోగదారులను ఆకర్షిస్తూనే ఉన్నాయని తెలిపారు.
అదే సమయంలో హోం డెలివరీకి కూడా ప్రాధాన్యం పెరుగుతోంది. సమయం, రవాణా ఖర్చులు ఆదా చేసుకోవాలనుకునే వినియోగదారులు ఆన్‌లైన్ డెలివరీ వైపు మొగ్గు చూపుతున్నారని రిటైలర్లు తెలిపారు. అయితే తాజా కూరగాయలు, ఇతర తాజా ఉత్పత్తుల కోసం భౌతిక స్టోర్లకు వినియోగదారుల ప్రాధాన్యం కొనసాగుతోందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంఖ్య 73 శాతం తగ్గింది..!!
- ఖతార్‌లో జాతీయ ఫ్లూ టీకా క్యాంపెయిన్.. ఉచితంగా వ్యాక్సిన్..!!
- బహ్రెయిన్‌లో వెటర్నరీ నమూనాల ఎగుమతి సులభతరం..!!
- యూఏఈలో షాపింగ్ పై ఇంధన ధరల ప్రభావం..!!
- కువైట్‌లో 8 కార్మిక చట్ట ఉల్లంఘనలపై ఫిర్యాదు.. ఇక ఆన్లైన్లోనే..!!
- జెడ్డా ఎయిర్పోర్ట్ టెర్మినల్ 4లో పాస్‌పోర్ట్ కౌంటర్ల తనిఖీలు..!!
- దుబాయ్ రాయల్ ఫామిలీకు సిరిసిల్ల చేనేత కళాకారుడి అరుదైన కానుక
- ఖతార్‌లో ఇంపౌండ్ వాహనాల ఆన్‌లైన్ వేలం..!!
- గల్ఫ్ దేశాల భద్రతపై జీసీసీ పోలీస్ చీఫ్‌ల కీలక సమావేశం..!!
- దుబాయ్ ట్యాక్సీ డ్రైవర్ నిజాయితీ.. యూఏఈకి మకాం మార్చిన భారతీయ వ్యాపారి..!!







