ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్‌లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం

- October 11, 2026 , by Maagulf
ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్‌లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం

-ఉద్యోగుల ఫీజు చెల్లించడానికి, వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయడానికి ముందుకొస్తున్న సంస్థలు

ఒమాన్: గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న తెలుగు వారికి ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రారంభించిన ఆన్‌లైన్ విద్యా కార్యక్రమాలపై  ఒమన్ ‌లో తెలుగు వారు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సామజిక కార్యకర్త బొక్కెన గంగస్వామి అధ్యక్షత వహించగా,  అతిథులుగా గోల్డెన్ ప్యూరిటీ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి షేక్ మదర్, సామాజిక కార్యకర్తలు చిట్టుమల దీపక్, మైదమ్ రామకృష్ణ పాల్గొన్నారు. ప్రత్యేక అతిథులుగా బానోత్ రవి, గుర్రపు మహేందర్, అజిగి శేఖర్, ముంజ మహేష్, షేక్ ఫరూక్, మొహమ్మద్ జమీల్, మొహమ్మద్ సద్దాం, హెచ్ గంగాధర్, మొహమ్మద్ సాజిత్, గూడపాటి మనోజ్ కుమార్ , మైదమ్ వర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గంగస్వామి మాట్లాడుతూ, విద్య మనిషికి జ్ఞానాన్ని అందిస్తుందని, జ్ఞానం బానిసత్వం నుంచి విముక్తిని ప్రసాదిస్తుందని పేర్కొన్నారు. గల్ఫ్‌లోని తెలుగు వారికి ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాన్ని కల్పించిన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి, రిజిస్ట్రార్ డా.ఎల్.విజయకృష్ణ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని సౌదీ అరేబియా నుంచి సమన్వయం చేసిన సమాజ సేవకులు శ్రీనివాస్ మచ్చ, మహేష్ కేపీ, మన గల్ఫ్ ఛానల్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వేణు పెరుమాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

గోల్డెన్ ప్యూరిటీ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి షేక్ మదర్ మాట్లాడుతూ, తన కంపెనీలో పనిచేస్తూ ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే ఉద్యోగులకు మొదటి సంవత్సరం ఫీజును తానే చెల్లిస్తానని, పరీక్షల సమయంలో వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేస్తానని ప్రకటించారు. సామాజిక కార్యకర్తలు దీపక్, రామకృష్ణ కూడా ఒక్కొక్క విద్యార్థికి మొదటి సంవత్సరం ఫీజును చెల్లించేందుకు ముందుకొచ్చారు. ఇతర అతిథులు సైతం తమకు తెలిసినవారికి, మిత్రులకు, బంధువులకు మరియు ఇతర గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న తెలుగు వారికి డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అందిస్తున్న కోర్సులపై విస్తృతంగా ప్రచారం చేస్తామని, మరిన్ని అవగాహనా  కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు..

గల్ఫ్‌లో నివసిస్తున్న తెలుగు వారికి విజ్ఞప్తి: డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అందిస్తున్న ఆన్‌లైన్ విద్యా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని, తమ ఉన్నత విద్యా కలలను సాకారం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. అర్హతలు, అందుబాటులో ఉన్న కోర్సులు, దరఖాస్తు విధానం మరియు చివరి తేదీ వివరాలను యూనివర్సిటీ వెబ్ సైట్ : http://www.braou.ac.in లో పొందొచ్చని లేదా 040-23680333/555/+91 90320 76267/+966 54 150 7276/+968 9345 8337 లో సంప్రదించాలని కోరుతూ ఈ అవకాశాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com