దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- October 11, 2026
దుబాయ్: దుబాయ్‌లో షేరింగ్ హోమ్స్ లో నివసించే వారికి మరింత స్థలం, మెరుగైన సౌకర్యాలు కల్పించేలా కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. గదుల్లో ఎంతమంది ఉండాలి, బాత్‌రూమ్‌లు ఎన్ని ఉండాలి, వంటగది ఎంత విస్తీర్ణంలో ఉండాలి వంటి అంశాలపై అధికారులు స్పష్టమైన ప్రమాణాలు విధించారు. అయితే ఈ మార్పుల వల్ల కొన్ని ప్రాంతాల్లో బెడ్ స్పేస్ అద్దెలు కూడా పెరిగే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ రంగానికి చెందినవారు అంచనా వేస్తున్నారు. కొత్త నిబంధనలు 2026 సెప్టెంబర్ 8 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే షేరింగ్ వసతి కోసం ఉపయోగిస్తున్న భవనాలు, విల్లాల యజమానులు నిబంధనలను పాటించేందుకు 2027 సెప్టెంబర్ 8 వరకు గడువు ఇచ్చారు.
ఒక్కొక్కరికి కనీసం 5 చదరపు మీటర్ల స్థలం
కొత్త మార్గదర్శకాల ప్రకారం షేరింగ్ వసతి గృహాల్లో ప్రతి వ్యక్తికి పడుకునే గదిలో కనీసం 5 చదరపు మీటర్ల స్థలం ఉండాలి. గది విస్తీర్ణాన్ని బట్టి అందులో ఉండే వ్యక్తుల సంఖ్యను నిర్ణయించాలి. దీంతో ప్రస్తుతం ఒకే గదిలో ఎక్కువ మంది ఉంటున్న కొన్ని వసతి గృహాల్లో నివాసితుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది.
టాయిలెట్లు, షవర్ల వినియోగానికి కూడా నిర్దిష్ట ప్రమాణాలు విధించారు. టాయిలెట్, షవర్ వేర్వేరుగా ఉంటే ప్రతి నలుగురికి కనీసం ఒక టాయిలెట్ ఉండాలి. ప్రతి ఆరుగురికి కనీసం ఒక షవర్ ఉండాలి. టాయిలెట్, షవర్ ఒకే బాత్‌రూమ్‌లో ఉంటే ప్రతి నలుగురికి కనీసం ఒక బాత్‌రూమ్ ఉండాలి. ఈ నిబంధనలతో ఉదయం పనులకు వెళ్లే సమయంలో బాత్‌రూమ్‌ల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు తగ్గుతాయని భావిస్తున్నారు.
వంటగదిలో ప్రతి నివాసితుడికి కనీసం ఒక చదరపు మీటరు స్థలం ఉండాలి. అలాగే ప్రజారోగ్యం, భద్రతకు సంబంధించిన ప్రమాణాలను పాటించాలి. వ్యక్తిగత షేరింగ్ వసతి గృహాల్లో బట్టలు ఉతకడానికి, ఆరబెట్టడానికి సదుపాయాలు ఉండాలి. నివాసితుల సంఖ్యకు తగిన విధంగా బహుళ ప్రయోజన గదులను కూడా ఏర్పాటు చేయాలి. కుటుంబాల కోసం ఏర్పాటు చేసే షేరింగ్ వసతుల్లో ప్రతి కుటుంబానికి ప్రత్యేక బెడ్‌రూమ్ ఉండాలి. ప్రతి గదికి అనుబంధంగా అంతర్గత బాత్‌రూమ్ ఉండాలని మార్గదర్శకాలు పేర్కొంటున్నాయి.
అనుమతి ఉన్న ప్రాంతాల్లోనే..
దుబాయ్ మున్సిపాలిటీ అనుమతించిన ప్రాంతాల్లోనే షేరింగ్ వసతి గృహాలను నిర్వహించాలి. యజమానులు సంబంధిత అనుమతులు పొందడం తప్పనిసరి. అంతేకాకుండా, ఒక భవనం లేదా విల్లాను పూర్తిగా వ్యక్తుల షేరింగ్ వసతి కోసం లేదా కుటుంబాల షేరింగ్ వసతి కోసం మాత్రమే ఉపయోగించాలి. ఒకే భవనంలో ఈ రెండు రకాల వసతులను కలిపి నిర్వహించకూడదు. ఇంజినీరింగ్ కన్సల్టెంట్లు గదుల విస్తీర్ణం, నివాసితుల సంఖ్యతో పాటు అగ్నిమాపక భద్రత, పారిశుద్ధ్యం, పర్యావరణం, భద్రత, విద్యుత్ వ్యవస్థలను పరిశీలించి సంబంధిత వివరాలను సమర్పించాలి.
బెడ్ స్పేస్ అద్దెలు Dh200–Dh300 పెరగవచ్చా?
కొత్త నిబంధనల ప్రభావంపై రియల్ ఎస్టేట్ రంగానికి చెందినవారు అంచనాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక గదిలో ఉండే వ్యక్తుల సంఖ్య తగ్గితే, అద్దె మరియు ఇతర ఖర్చులను మిగిలిన నివాసితులు ఎక్కువగా భరించాల్సి రావచ్చని చెబుతున్నారు. కరామాలో పనిచేస్తున్న రియల్ ఎస్టేట్ ఏజెంట్ అబ్దుల్ గఫార్ అంచనా ప్రకారం.. కొన్ని ప్రాంతాల్లో బెడ్ స్పేస్ అద్దె ఒక్కొక్కరికి Dh200 నుంచి Dh300 వరకు పెరిగే అవకాశం ఉంది. అయితే ఇది ప్రాథమిక అంచనా మాత్రమేనని, హోమ్స్ ఉన్న ప్రాంతం, రకం, యజమాని చేపట్టాల్సిన మార్పులను బట్టి అద్దెల్లో మార్పులు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం పలువురు యజమానులు తమ ఆస్తుల్లో చేయాల్సిన మార్పులను పరిశీలిస్తూ, అనుమతుల కోసం సిద్ధమవుతున్నారు. అందువల్ల అన్ని ప్రాంతాల్లో అద్దెలు తప్పనిసరిగా పెరుగుతాయని ఇప్పుడే చెప్పలేమన్నారు.
నివాసితులకు లాభమా..నష్టమా?
కొత్త నిబంధనల ప్రధాన ఉద్దేశం షేరింగ్ వసతి గృహాల్లో నివసించే వారికి తగిన వ్యక్తిగత స్థలం, మెరుగైన పారిశుద్ధ్యం, వంటగది, బాత్‌రూమ్ వంటి సౌకర్యాలు కల్పించడం. అయితే గదుల్లో నివాసితుల సంఖ్య తగ్గడం, యజమానులు అదనపు సదుపాయాలు ఏర్పాటు చేయాల్సి రావడం వల్ల కొంతమేర ఖర్చులు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు..
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







