బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!

- October 13, 2026 , by Maagulf
బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!

మనామా: బహ్రెయిన్‌కు వచ్చే పర్యాటకులకు వీసాతో పాటు ఆరోగ్య బీమా ఫీజు విధించే ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. పర్యాటకులు అనారోగ్యానికి గురైనా, ప్రమాదాల్లో గాయపడినా వారి వైద్య ఖర్చులకు ఈ బీమా సొమ్మును వినియోగించనున్నారు. అయితే ఈ ఫీజు ఎంత ఉండాలనే దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.

BD5 వసూలు ప్రతిపాదనకు మార్పులు

గతంలో పర్యాటకుల నుంచి BD5 వసూలు చేయాలన్న ప్రతిపాదనను ఎంపీలు ఉపసంహరించుకున్నారు. ఈ మొత్తాన్ని ముందుగానే నిర్ణయించకుండా, దేశ ఆరోగ్య బీమా విధానం ప్రకారం ఖరారు చేయాలని నిర్ణయించారు. ఎంపీ మొహమ్మద్ అల్ మారాఫీ ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చారు.

పర్యాటకులకు అవసరమైన వైద్య సేవలు అందుబాటులో ఉండటంతో పాటు, వారి చికిత్స ఖర్చుల వల్ల ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గించడమే దీని ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. పార్లమెంట్ సేవల కమిటీ కూడా ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలపాలని ఎంపీలకు సిఫారసు చేసింది. అసలు ప్రతిపాదనలోని BD5 మొత్తాన్ని తొలగించేందుకు అల్ మారాఫీ అంగీకరించారు.

2018 ఆరోగ్య బీమా చట్టం ప్రకారం..

బహ్రెయిన్ ఆరోగ్య బీమా చట్టం–2018లోనే విదేశీ సందర్శకులకు తప్పనిసరి ఆరోగ్య బీమా కల్పించేందుకు అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ప్రతిపాదనకు అంగీకారం వ్యక్తం చేసింది.చట్టంలోని ఆర్టికల్ 35 ప్రకారం, పర్యాటకులకు ఎలాంటి వైద్య సేవలు అందించాలి, అత్యవసర చికిత్సలు, ప్రమాదాల్లో గాయపడినప్పుడు అందించే సేవలు ఏమిటి అనే అంశాలను సుప్రీం కౌన్సిల్ ఆఫ్ హెల్త్ నిర్ణయించాలి.

అలాగే బీమా ద్వారా గరిష్ఠంగా ఎంతవరకు వైద్య ఖర్చులను చెల్లించాలి, రోగులు తమ జేబు నుంచి ఎంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది అనే అంశాలనూ ఖరారు చేయాలి.అవసరమైన ఆరోగ్య బీమా ఫీజు చెల్లించని సందర్భాల్లో సందర్శకులకు ప్రవేశ వీసాలు జారీ చేయడం లేదా వాటిని పునరుద్ధరించడం సాధ్యం కాదని చట్టం పేర్కొంటోంది.

బీమా సంస్థలతో చర్చలు

పర్యాటకులు తీసుకోవాల్సిన బీమా రకం, చెల్లించాల్సిన ఫీజు, ఆ మొత్తాన్ని వసూలు చేసే విధానం వంటి అంశాలపై బీమా సంస్థలు, సంబంధిత విభాగాలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. వైద్య సేవలకు సంబంధించి కొన్ని నిబంధనలు ఇప్పటికే జారీ కాగా, మిగిలిన నిబంధనలు తుది దశకు చేరుకున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. పర్యాటకులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడం వల్ల బహ్రెయిన్ పర్యాటక రంగానికి ప్రయోజనం కలుగుతుందని, అదే సమయంలో ప్రభుత్వ ప్రజాధనంపై భారం తగ్గుతుందని ఎంపీ అల్ మారాఫీ అభిప్రాయపడ్డారు.

ఫీజు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది?

పర్యాటకుల ఆరోగ్య బీమా ఫీజు ఎంత ఉంటుందనే విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. మిగిలిన నిబంధనలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయో కూడా ప్రభుత్వం వెల్లడించలేదు. తుది నిర్ణయం వెలువడిన తర్వాతే పర్యాటక వీసాలపై కొత్త విధానం అమలు తేదీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com