సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- October 14, 2026
దోహా: ప్రాంతీయ సంఘర్షణలకు దౌత్య మార్గాల్లో పరిష్కారాలు కనుగొనే ప్రయత్నాలను కొనసాగిస్తామని, అదే సమయంలో దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునే విషయంలో ఎలాంటి రాజీ పడబోమని ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ స్పష్టం చేశారు. ఇరాన్ దాడులు, ప్రాంతీయ యుద్ధం వల్ల ఖతార్‌పై పడుతున్న ప్రభావాన్ని ప్రస్తావిస్తూ దోహాలో జరిగిన 55వ షూరా కౌన్సిల్ రెండో సమావేశ ప్రారంభ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఖతార్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తూ జరిగిన ఇరాన్ దాడులను ఎదుర్కొన్న సాయుధ దళాలు, భద్రతా సంస్థలను అమీర్ ప్రశంసించారు. ప్రస్తుత సంక్షోభాన్ని ఎదుర్కొనే సామర్థ్యం అనేక సంవత్సరాలుగా చేపట్టిన ముందస్తు సన్నద్ధత ఫలితమని పేర్కొన్నారు. దేశ భూభాగం, సముద్ర జలాలు, గగనతలాన్ని రక్షించేందుకు సైనిక బలగాలు నిరంతరం అప్రమత్తంగా పనిచేశాయని తెలిపారు.
దేశ రక్షణతో పాటు శాంతి ప్రయత్నాలు
చర్చలు, శాంతియుత పరిష్కారాలపై ఖతార్‌కు ఉన్న నిబద్ధతను బలహీనతగా భావించరాదని అమీర్ పేర్కొన్నారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం, ప్రాంతీయ యుద్ధం మరింత విస్తరించకుండా నిరోధించడం పరస్పర విరుద్ధమైన అంశాలు కావని స్పష్టం చేశారు.ప్రస్తుత అసాధారణ పరిస్థితుల్లో సంయమనం పాటిస్తూ సహకరించిన దేశ పౌరులు, నివాసితులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సంక్షోభాన్ని ఎదుర్కొనే క్రమంలో ఖతార్ సంస్థల సామర్థ్యం మరోసారి వెల్లడైందన్నారు.
ప్రాంతీయ సంఘర్షణలను ఎదుర్కొనేందుకు ఖతార్ అనుసరిస్తున్న వ్యూహంలో నాలుగు ప్రధాన అంశాలను అమీర్ వివరించారు.
- దేశాన్ని రక్షించుకుంటూనే యుద్ధంలోకి లాగబడకుండా వ్యవహరించడం.
- సరఫరా వ్యవస్థలు, నిత్యావసర వస్తువుల రవాణా నిరంతరాయంగా కొనసాగేలా చూడటం.
- కాల్పుల విరమణకు కృషి చేయడంతో పాటు సముద్ర మార్గాలను తిరిగి తెరిచేందుకు ప్రయత్నించడం.
- కొనసాగుతున్న సంఘర్షణలకు చర్చల ద్వారా పరిష్కారాలు కనుగొనడం.
ఖతార్ అంతర్జాతీయ ఇంధన సరఫరాదారుగా తన పాత్రను కొనసాగిస్తూనే దౌత్య సంబంధాలను క్రియాశీలంగా ఉంచేందుకు ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు.
హోర్ముజ్ జలసంధి మూసివేతతో ఎల్ఎన్జీ ఎగుమతులకు దెబ్బ
హోర్ముజ్ జలసంధి మూసివేత, ఖతార్‌లోని రాస్ లఫాన్ పారిశ్రామిక నగరంలో ఎల్ఎన్జీ ఉత్పత్తి కేంద్రాలకు జరిగిన నష్టం దేశ ఇంధన ఎగుమతులపై ప్రభావం చూపాయని అమీర్ వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్లో ఖతార్‌కు ఉన్న కీలక స్థానం దృష్ట్యా, దేశ ఎల్ఎన్జీ ఉత్పత్తిలో అంతరాయం ఏర్పడితే ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులపైనా ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. గల్ఫ్ సహకార మండలి (జీసీసీ) దేశాలు పరస్పర సహకారాన్ని మరింత పెంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధితో పాటు గల్ఫ్ ప్రాంతంలో నౌకాయాన స్వేచ్ఛను కాపాడటం, నీటి మౌలిక సదుపాయాలకు రక్షణ కల్పించడం అత్యంత ముఖ్యమని తెలిపారు.
ఆర్థిక వృద్ధి 2.2 శాతం.. ఐదేళ్లలో రూ.లక్షల కోట్ల పెట్టుబడులు
సంక్షోభ ప్రభావాల మధ్యనూ ఖతార్ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటోందని అమీర్ వివరించారు. జీడీపీ వృద్ధి 2.2 శాతంగా నమోదైందని, ద్రవ్యోల్బణం సుమారు 2 శాతం వద్ద స్థిరంగా ఉందని తెలిపారు. మొదటి త్రైమాసికంలో ప్రభుత్వ ఆదాయాలు 14 శాతం తగ్గినప్పటికీ, అత్యవసర ప్రజాసేవలు, అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులను తగ్గించలేదని వెల్లడించారు. రుణభారాన్ని తగ్గించడం, విదేశీ మారక ద్రవ్య లభ్యతను కాపాడుకోవడం, చమురు ధరల విషయంలో సంప్రదాయబద్ధమైన అంచనాలను అనుసరించడం వంటి ముందస్తు చర్యలు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కోవడంలో సహాయపడ్డాయని వివరించారు. రాబోయే ఐదేళ్లలో మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టులు, ఆతిథ్య రంగం, రియల్ ఎస్టేట్ తదితర రంగాల్లో మొత్తం 221 బిలియన్ ఖతార్ రియాళ్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు అమీర్ ప్రకటించారు. ఇంధన రంగంలో నార్త్ ఫీల్డ్ విస్తరణ ప్రణాళిక కొనసాగుతోందని, అమెరికాలోని గోల్డెన్ పాస్ ప్రాజెక్టులోనూ పురోగతి సాధిస్తున్నట్లు తెలిపారు. విదేశాల్లో ఖతార్ ఎనర్జీ చేపడుతున్న ప్రాజెక్టులతో పాటు సౌర విద్యుత్, నీటి భద్రత, ఆహార భద్రతకు సంబంధించిన కార్యక్రమాలను విస్తరించనున్నట్లు పేర్కొన్నారు.
విద్య, సాంకేతికతకు ప్రాధాన్యం
సంక్షోభానికి ముందు ఉన్న పరిస్థితులకు తిరిగి చేరుకోవడమే లక్ష్యంగా పెట్టుకోకుండా, ఈ అనుభవం నుంచి పాఠాలు నేర్చుకుని ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవాలని అమీర్ సూచించారు. ఆర్థిక వృద్ధి వనరులను విస్తరించడం, దేశీయ సామర్థ్యాలను పెంచడం, విద్యా రంగం, సాంకేతికతకు ప్రాధాన్యం ఇవ్వడం అవసరమన్నారు. ప్రభుత్వ విభాగాల పనితీరును మెరుగుపరచడంతో పాటు ఉద్యోగుల్లో నైపుణ్యం, బాధ్యతాయుతమైన విధానాలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.
గాజా పరిస్థితిపై తీవ్ర ఆందోళన
పాలస్తీనా అంశం ఖతార్ ప్రాధాన్యాల్లో ముందంజలో ఉంటుందని అమీర్ పునరుద్ఘాటించారు. గాజాలో జరిగిన పరిణామాలను ఆయన మారణహోమంగా అభివర్ణిస్తూ, దీనికి బాధ్యులైనవారిని జవాబుదారీగా నిలబెట్టాలని పేర్కొన్నారు.ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో పాలస్తీనియన్లపై దాడులు, అల్ అక్సా మసీదు ప్రాంగణంలోకి పదేపదే చొరబాట్లపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చర్యలు అంతర్జాతీయ చట్టం, ఐక్యరాజ్యసమితి చార్టర్, అంతర్జాతీయ మానవతా చట్టాలకు విరుద్ధమని పేర్కొన్నారు. సూడాన్, లిబియా, యెమెన్, సోమాలియాల్లోనూ రాజకీయ పరిష్కారాలకు ఖతార్ మద్దతు కొనసాగుతుందని తెలిపారు. చర్చలు, సంప్రదింపుల ద్వారా శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. ప్రాంతీయ యుద్ధం మరింత విస్తరించకుండా దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తూనే, దేశ భద్రత, ఇంధన సరఫరా, ఆర్థిక స్థిరత్వం, అంతర్జాతీయ నౌకాయాన స్వేచ్ఛకు ప్రాధాన్యం ఇస్తామని ఖతార్ అమీర్ తన ప్రసంగం ద్వారా స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..







