ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. 60 రోజుల పాటు డెలివరీ వాహనాలు సీజ్..!

- October 15, 2026 , by Maagulf
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. 60 రోజుల పాటు డెలివరీ వాహనాలు సీజ్..!

కువైట్: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే డెలివరీ కార్లు, మోటార్‌సైకిళ్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు కువైట్ అధికారులు సిద్ధమయ్యారు. అక్టోబర్ 18 (ఆదివారం) నుంచి ప్రత్యేక ట్రాఫిక్ తనిఖీలు ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను కనీసం 60 రోజుల పాటు సీజ్ చేసే చర్యలు చేపట్టనున్నట్లు తెలిపింది.
ట్రాఫిక్ అవేర్‌నెస్ విభాగం డైరెక్టర్ కల్నల్ ఫహద్ అల్-ఈసా మాట్లాడుతూ.. డెలివరీ వాహనదారుల్లో ప్రమాదకర డ్రైవింగ్‌ను అరికట్టడం, ట్రాఫిక్ నిబంధనల అమలును మెరుగుపరచడం, రహదారి భద్రతను పెంపొందించడం ఈ ప్రత్యేక తనిఖీల ప్రధాన లక్ష్యాలని వివరించారు. ఈ చర్యలు కేవలం డ్రైవర్లకే పరిమితం కావని, ట్రాఫిక్ విభాగంతో సహకరించని డెలివరీ కంపెనీలపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు. డ్రైవర్లు పదేపదే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నప్పటికీ, వారిలో అవగాహన పెంచేందుకు కంపెనీ యాజమాన్యాలు సహకరించకపోతే సంబంధిత సంస్థలపై పరిపాలనాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ ఉల్లంఘనలపై అధికారుల దృష్టి
డెలివరీ డ్రైవర్లలో తరచుగా నమోదవుతున్న ట్రాఫిక్ ఉల్లంఘనలను అధికారులు గుర్తించారు. వాటిలో ప్రధానంగా:
- ఇండికేటర్ వేయకుండా లేన్లు మార్చడం.
- రెడ్ సిగ్నల్‌ను పట్టించుకోకుండా ముందుకు వెళ్లడం.
- ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగిన వాహనాలను దాటుకుని వెళ్లడం.
- ఫుట్‌పాత్‌లు, పాదచారుల వంతెనలపై వాహనాలు నడపడం.
ఇలాంటి చర్యల వల్ల పాదచారులతో పాటు ఇతర వాహనదారుల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడటమే కాకుండా, ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందని అధికారులు పేర్కొన్నారు.

డెలివరీ కంపెనీలకు అవగాహన కార్యక్రమాలు
డెలివరీ కంపెనీల ప్రతినిధులతో ఇప్పటికే సమావేశాలు నిర్వహించిన ట్రాఫిక్ అధికారులు, డ్రైవర్లు ఉల్లంఘనలకు పాల్పడుతున్న దృశ్యాలను వీడియోల ద్వారా చూపించారు. ఉద్యోగులకు సురక్షిత డ్రైవింగ్‌, రహదారిపై బాధ్యతల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కంపెనీలను ఆదేశించారు. అలాగే, డెలివరీ మోటార్‌సైకిళ్లకు అనుమతి లేని కొన్ని మార్గాలను అధికారులు నిర్దేశించారు. రైడర్లు అనుమతించిన మార్గాల్లోనే ప్రయాణించాలని, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

370 ఆధునిక కెమెరాలతో పర్యవేక్షణ
కువైట్‌లోని సెంట్రల్ కంట్రోల్ రూమ్ ద్వారా సుమారు 370 ఆధునిక కెమెరాలతో రహదారుల పరిస్థితులు, ట్రాఫిక్ ఉల్లంఘనలను పర్యవేక్షిస్తున్నట్లు కల్నల్ ఫహద్ అల్-ఈసా వెల్లడించారు. కెమెరాల నిఘాతో పాటు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తూ ప్రమాదకర డ్రైవింగ్‌ను గుర్తించి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.ట్రాఫిక్ సిగ్నళ్ల సమయాలను కూడా రహదారులపై వాహనాల రద్దీ, ట్రాఫిక్ సాంద్రత ఆధారంగా అధ్యయనం చేసి సర్దుబాటు చేస్తున్నట్లు తెలిపారు. తద్వారా వాహనాల రాకపోకలు సజావుగా సాగడంతో పాటు రహదారి భద్రత మెరుగుపడుతుందని అధికారులు భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com